అన్ని రంగాల్లోనూ.. అన్ని విషయాల్లోనూ విభిన్నంగా నిలిచే విజయనగరం జిల్లా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణలోనూ తన ప్రత్యేకతను చాటుకుంది. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన ఆగస్టు 15 వేడుకల్లో అత్యున్నత పదవులు చేపట్టిన ముగ్గురు వనితలు.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, ఎస్పీ దీపికా ఎం పాటిల్ లు మువ్వెన్నల జెండాకు గౌరవ వందనం సమర్పించటం విశేష అంశంగా నిలిచింది. అలాగే అధిక సంఖ్యలో మహిళా అధికారులు పాల్గొనటం.. జాతీయ జెండాను పోలిన దుస్తులు ధరించి పరేడ్ నిర్వహించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముగ్గురు మహిళా రథసారధుల సమక్షంలో ప్రత్యేకంగా జరిగిన వేడుకలు మహిళల ప్రగతికి.. విశేష కీర్తికి.. సాధికారతకు నిదర్శనంగా నిలిచాయి. వేడుకల్లో సుమారు 25 మంది జిల్లాస్థాయి మహిళా అధికారులు, 200 పై చిలుకు వివిధ స్థాయిల అధికారిణులు, పలు విభాగాల మహిళా సిబ్బంది పాల్గొన్నారు.