విజయనగరం జిల్లాలో పరిశ్రమల అభివృద్దికి, కొత్త పరిశ్రమల స్థాపనకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని కలెక్టర్ ఏ.సూర్యకుమారి హామీ ఇచ్చారు. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడం, లేదా ఉన్న పరిశ్రమలను విస్తరించడం ద్వారా మరింత మందికి ఉపాది కల్పించాలని ఆమె కోరారు. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో కలెక్టరేట్ లో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలున్నాయని చెప్పారు. పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా, సింగిల్ విండో విధానం ద్వారా అనుమతిస్తామని అన్నారు. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా, అవసరమైన నైపుణ్యం గల కార్మికులను అందించడానికి కూడా సిద్దంగా ఉన్నామని చెప్పారు. దీనికోసం యువతకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులను తయారు చేస్తామన్నారు. పరిశ్రమల స్థాపనలో ఎటువంటి సమస్యలు ఎదురైనా, తమ దృష్టికి తీసుకువస్తే, పరిష్కరిస్తామని అన్నారు. రాయపూర్-విశాఖపట్నం గ్రీన్‌ఫీల్డు హైవే పూర్తయితే, రవాణాకు ఎంతో సులభం అవుతుందని, దూరం కూడా గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. వీటిన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని సూచించారు. సామాజిక బాధ్యత క్రింద జిల్లాలోని పాఠశాలలు, ఆసుపత్రులను అభివృద్ది చేయాలని, వాటర్ హార్వెస్టింగ్ కట్టడాల నిర్మాణానికి సహకరించాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. కోవిడ్ నియంత్రణలో పారిశ్రామిక వేత్తలు భాగస్వాములు కావాలని, పాఠశాలలకు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని కలెక్టర్ సూచించారు.
జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను వివరించారు. ముఖ్యంగా పర్యాటక రంగాభివృద్దికి ఎంతో అవకాశం ఉందన్నారు. ఎస్.కోట, బొడ్డవర, సాలూరు, పార్వతీపురం, పూసపాటిరేగ, భోగాపురం లాంటి చోట్ల పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుందని సూచించారు. జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల స్థాపన కోసం బయట ప్రాంతాలనుంచి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని, జిల్లాలోని పారిశ్రామిక వేత్తలు కూడా దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. కోవిడ్ సమయంలో జిల్లాలోని పరిశ్రమలు అందించిన సహకారం మరువలేనిదని అభినందించారు. ఇకముందు కూడా ఇదే సహకారాన్ని అందించి, తమ సామాజిక బాధ్యత క్రింద జిల్లా అభివృద్దిలో భాగస్వాములు కావాలని జెసి కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ ప్రసాదరావు, సహాయ సంచాలకులు సీతారామ్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.