మన బడి నాడు-నేడు, జగనన్న విద్యాకానుక పథకాలతో భావితరాలకు బంగారు భవిష్యత్తు సిద్ధిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆశాభావం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని డెంకాడ మండలం రఘుమండ గ్రామంలో సోమవారం జరిగిన మనబడి నాడు-నేడు, జగనన్న విద్యాకానుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పెట్టుకుందని, ఆ దిశగా ఎన్నో సంస్కరణలు చేపట్టిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, సుమారు ఆరు వేల పాఠశాలలు మూతపడ్డాయన్నారు. కానీ వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ అభివృద్ధికి సమున్నత స్థానం దక్కిందని, రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని గుర్తు చేశారు. పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువే అని ఎప్పుడూ ముఖ్యమంత్రి అంటుంటారని.. తల్లిదండ్రులు ఈ మాటను గుర్తు పెట్టుకొని పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా సూచించారు. మనబడి నాడు-నేడు పథకంలో భాగంగా మొదటి దశ పనులకు గాను రూ.278 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిందని పేర్కొన్నారు. సుమారు 1060 పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని గుర్తు చేశారు. ఇప్పటి పిల్లలు చాలా అదృష్టవంతులని.. మా చిన్నతనంలో చదువులు నేలపై సాగేవని.. మరుగుదొడ్లు ఉండేవి కావని.. భోజనానికి రెండు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి వచ్చేవారమని ఆమె ప్రస్తావించారు. కానీ ఈ రోజు మనబడి నాడు-నేడు పథకంలో భాగంగా ప్రతి పాఠశాలా అద్భుతంగా రూపుదిద్దుకుందని, అన్ని రకాల వసతులు సమకూరాయని వివరించారు. అధునాతన సదుపాయాలతో కూడిన తరగతి గదులు, శుద్ధమైన తాగునీరు, భోజన శాలలు, మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయని.. ఇదంతా వైకాపా ప్రభుత్వ సాధించిన ఘనతకు నిదర్శనమని అన్నారు. ఇప్పటి వరకు ఇంగ్లీషు మీడియం చదువులు డబ్బున్నోళ్లకే అనే నానుడి ఉండేదని.. ఇప్పుడు ప్రతి పేదింటి బిడ్డకూ ఇంగ్లీషు మీడియం చదువు ఉచితంగా అందుతుందని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ + పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు.
కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కలెక్టర్ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మనబడి నాడు-నేడు పథకంలో భాగంగా రఘుమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను, ఫోటో ఎగ్జిబిషన్ ను, ఆధునికీకరించిన భోజన శాలను, అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు.
అనంతరం డీఈవో విద్యారంగంలో జరిగిన అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.278 కోట్లు కేటాయించిందని, మొదటి దశలో 1060 పాఠశాలల అభివృద్ధికి సంకల్పించగా ప్రస్తుతానికి 990 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. రెండో దశలో భాగంగా 884 పాఠశాలలను ఆధునికీకరించనున్నట్లు వెల్లడించారు. అలాగే జగనన్న విద్యా కానుక ద్వారా 2.26 లక్షల మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశామని వివరించారు. గత విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 10,784 మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వివరించారు. పాఠశాలల్లో ఇంగ్లీషు ల్యాబ్‌లు, ఇతర 9 రకాల వసతులను కల్పించామని పేర్కొన్నారు. అలాగే జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 1.94 లక్షల మందికి పౌష్టికాహారం అందజేస్తున్నామని వివరించారు. అమ్మ ఒడి పథకం ద్వారా జిల్లాలో 2.50 లక్షల మందికి లబ్ది చేకూరిందని గుర్తు చేశారు.
జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి మాట్లాడుతూ మనబడి నాడు - నేడు పథకం చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆడపిల్లల చదువుకు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. మూఢనమ్మకాలను, అపోహలను విడనాడాలని కనీసం డిగ్రీ వరకైనా చదివించాలని సూచించారు.
ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దీని వల్ల పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యవర్తులు, దళారీలు లేని పాలన అందుతోందని ఈ సందర్భంగా అన్నారు.
నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆధ్వర్యంలో నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. రూ.50 లక్షలతో రఘుమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల రూపురేఖలు మారిపోయాయన్నారు. అధునాతన సదుపాయాలతో కూడిన తరగతి గదులు, భోజన శాల, మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకొని బాగా చదువుకోవాలని, ఐఎస్‌లు, ఐపీఎస్‌లు కావాలని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పథకాలపై వారి అభిప్రాయాలను వెల్లడించారు.
పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను అలరించాయి. చివరిగా జగనన్న విద్యాకానుక కిట్లను అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురేష్ బాబు, పాకలపాటి రఘువర్మ, జాయింట్ కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, డీఈవో జి. నాగమణి, ప్రత్యేక అధికారి, డీఎస్‌వో పాపారావు, సమగ్ర శిక్షా అభియాన్ ఏపీసీ కీర్తి, ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, రఘుమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్.ఎం. సౌభాగ్య లక్ష్మి, పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్, డీసీసీబీ ఛైర్మన్, స్థానిక సర్పంచు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.