నాడు-నేడు ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి.. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లాలో నాడు నేడు మొదటివిడత ద్వారా రూ.312 కోట్ల నిధులుతో 1130 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చారు. రెండవ విడతలో భాగంగా జిల్లాలోని 1235 పాఠశాలల్లో పనుల ప్రారంభానికి ఈ సందర్భంగా మంత్రి శ్రీకారం చుట్టారు. మధురవాడలోని చంద్రంపాలెంలోని హైస్కూలులో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈసంధర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని పేద విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తుపై సీఎం దృష్టి సారించిన ఏకైక సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. దేశంలో అమ్మఒడి ద్వారా ఏడాదికి 15,000, పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ చేసిన సీఎం జగన్ ఒక్కరే అని అన్నారు.
జిల్లాకు మొదటి విడతలో 48 కోట్లు, రెండో విడతలో 60 కోట్లు కేటాయించారని అన్నారు. టాయిలెట్స్ సరిగా లేకపోవడంతో ఎందరో విద్యార్థినులు స్కూల్స్ మానేయడం జరిగిందని.. వారి అవస్థలు గుర్తించిన ముఖ్యమంత్రి పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించారని అన్నారు. ఇందుకు జగన్ కు ఉన్న మంచి మనసు కారణమని అన్నారు.
పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులుకు పుస్తకాలు, కిట్లు, డిక్షనరీ ఇవ్వడం అభినందనీయమని మంత్రి అన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం వేల కోట్లు ఖర్చుపెడుతున్న ఘనత సీఎంకు దక్కుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు సువర్ణాధ్యాయం వస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాలో 40వేలు జాయినింగ్స్ పెరిగాయని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. వచ్చే మూడేళ్ళలో ఇక్కడకు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలని మంత్రి అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు జీవితంలో పైకి రావాలని అన్నారు.
జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ.. 18 నెలలుగా జిల్లాలో నాడు-నేడు పనులు చేస్తున్నామని.. కరోనా సమయంలో కూడా పనులు చేసి పాఠశాలలను అభివృద్ధి చేశామని అన్నారు. బ్లాక్ బోర్డు స్థానంలో గ్రీన్ బోర్డు, బెంచ్ లు, ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్స్.. ఇలా ఎన్నో మౌలిక వసతులు కల్పించామని అన్నారు. నాడు నేడులో భాగంగా చంద్రంపాలెం పాఠశాలను 1.25 కోట్లతో అభివృద్ధి చేశామని అన్నారు. ఏజెన్సీలో పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే పూర్తవుతాయని అన్నారు. జిల్లాలో 60కోట్లతో నాడు నేడు పనులు చేపట్టామని అన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామని.. కరోనా నిబంధనలు పాటించాలని అన్నారు. థర్డ్ వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటామని అన్నారు. టీచర్లకు వాక్సినేషన్ పూర్తయిందని అన్నారు.
జీవీఎంసీ చీఫ్ విప్, ఆరో వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పాఠశాలల రూపురేఖలు మార్చడం దేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికె సాధ్యమైందని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మంత్రి జగనన్న విద్యాకానుక కిట్లు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే అదీప్ రాజ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్ పర్సన్లు మళ్ళ విజయ ప్రసాద్, కేకే రాజు, అక్కరమాని విజయనిర్మల, పిల్లా సుజాత, కార్పొరేటర్లు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.