నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలి..
Ens Balu
3
Visakhapatnam
2021-08-16 15:01:17
విశాఖజిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ది పధకాల పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో ఆర్ డబ్ల్యు ఎస్, డ్వామా, పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు తమకు కేటాయించిన పనులపై అలసత్వం వహించకుండా భాద్యతగా పని చేయాలని లేని పక్షంలో వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జలజీవన్ మిషన్ ప్రోగ్రాంకు సంబందించి ఇంటింటికి కొళాయి కనెక్షన్ పనులను వేగవంతం చేయాలన్నారు. నాడు – నేడు పథకానికి సంబందించి మొదటి ఫేజ్ లో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. పాఠశాలలో అభివృద్ది పనులు , సమగ్ర శిక్ష పనులు, వై ఎస్ ఆర్ రూరల్, అర్బన్ క్లినిక్ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. డ్వామా కు సంబందించి పని దినాలను శత శాతం పూర్తి చేయాలని, జగనన్న కాలనీలలో రోడ్ల నిర్మాణాలు, ప్లాంటేషన్ తదితర పనులను శీఘ్రంగా చేయాలని ఎ .పి ఓ లు ఎప్పటి కప్పుడు తనిఖీలను నిర్వహించి లక్ష్యాలను సాధించాలన్నారు. పంచాయితీ రాజ్ పనులకు సంబందించి అన్ని సి.హెచ్ సి, పి హెచ్ సి ల నిర్మాణాలకు సంబందించి ఖర్చు అయిన బిల్లులను అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశాలైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల ను త్వరగా పూర్తి చేయాలన్నారు. అదే విదంగా డిజిటల్ లైబ్రేరీల పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. నిర్మాణం పూర్తి అయిన అంగన్వాడి భవనాలను వెంటనే అప్పచెప్పాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ నుండి జి.వి.ఎం .సి కమిషనర్ డా. జి.సృజన , ఆర్ డబ్ల్యు ఎస్, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బి శాఖల ఎస్ ఇ లు, డ్వామా, మెప్మా పిడిలు , సమగ్ర శిక్ష, ఎల్ డి ఎంలు తదితర అధికారులు హాజరవ్వగా వీడియో కాన్పరెన్స్ ద్వారా ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల కృష్ణ, మండల అధికారులు హాజరయ్యారు.