విద్య అనే అస్త్రాన్ని ఉపయోగించి పేదరికాన్ని నిర్మూలించే క్రమంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ బడుల రూపురేఖలను సమూలంగా మార్చేందుకు మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం సింగంశెట్టి ప్రభావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనబడి నాడు-నేడు తొలిదశను ప్రజలకు అంకితం చేయడంతో పాటు రెండో దశ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారంచుడుతున్నాం.. ఈరోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బడులు తెరుచుకుంటున్నాయి.. కోవిడ్ తీవ్రత వల్ల బడులు ఇప్పటి వరకు మూసిఉన్నాయి.. పిల్లలు పరీక్షలు రాసి దాదాపు రెండేళ్లవుతోంది. డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్ సూచనల మేరకు ప్రస్తుతం అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటూ, కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ బడులు తెరుస్తున్నాం. గ్రామ సచివాలయం యూనిట్‌గా తీసుకొని కోవిడ్ పాజిటివిటీ రేటు పది శాతం కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలను తెరుస్తున్నట్లు వివరించారు. ఒక్కో గదిలో 20 కంటే ఎక్కువ మంది లేకుండా తరగతులు నిర్వహిస్తామని, అంతకంటే ఎక్కువగా ఉంటే రోజువిడిచి రోజు తరగతులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిందన్నారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పది మార్పులు ప్రస్ఫుటంగా కనిపించేలా నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. ఫర్నిచర్, స్వచ్ఛమైన తాగునీరు, అదనపు తరగతి గదులు, కిచెన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్, గ్రీన్ చాక్‌బోర్డ్ తదితరాలను నాణ్యత పరంగా రాజీపడకుండా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 56 వేలకు పైగా పాఠశాలలు, హాస్టళ్లు, జూనియర్ కళాశాలలు తదితర విద్యాసంస్థల్లో రూ.16 వేల కోట్ల మేర ఖర్చుతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మంచినీటి సరఫరాకు సంబంధించి పీహెచ్ స్థాయిని సైతం పరీక్షించే ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామంటే ఏ స్థాయిలో సౌకర్యాల కల్పన జరుగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లెమ్మలకు అన్నగా, అక్కలకు తమ్ముడిగా.. పిల్లలకు మేనమామగా ఆలోచించి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ అనంతరం మంచి వేతనాలతో ఉద్యోగాలు లభించేలా చేయాలనే లక్ష్యంతో విద్యాసంస్థలను తీర్చిదిద్దుతున్నామని.. ఈ క్రమంలోనే జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, నాడు-నేడు, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు వెల్లడించారు. రెండేళ్ల కాలంలో విద్యా రంగంలో ఈ విప్లవాత్మక కార్యక్రమాల అమలుకు దాదాపు రూ.32 వేల 714 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి విద్యేనని.. వారిలో పోటీ తత్వాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. పిల్లలు డిగ్రీ లేదా ప్రొఫెషనల్ కోర్సును చదవడం అనేది ఓ హక్కుగా అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు తెలిపారు.
జగనన్న విద్యా కానుక కిట్ల ద్వారా పాఠశాల బ్యాగులు, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, యూనిఫాం, బూట్లు, సాక్సులు వంటివి విద్యార్థులకు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అయిదో తరగతి వరకు విద్యార్థులకు బొమ్మలతో కూడిన డిక్షనరీని అందిస్తున్నామన్నారు. రెండేళ్ల కాలంలో జగనన్న విద్యాకానుక పథకం కోసం దాదాపు రూ.1380 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. నాణ్యత పరంగా అత్యుత్తమంగా ఉండేవిధంగా చూస్తున్నామన్నారు. గతంలో చోటుచేసుకున్న లోపాలను సవరించి ప్రస్తుతం రెండో విడత కానుకను అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇకపై పాఠశాలలను ఆరు రకాలుగా ఏర్పాటు చేస్తున్నామని.. అవి 1. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్, 2. ఫౌండేషన్ స్కూల్స్, 3. ఫౌండేషన్ స్కూల్స్ ప్లస్, 4. ప్రీ హైస్కూల్స్, 5. హైస్కూల్స్, 6. హైస్కూల్ ప్లస్‌గా వర్గీకరిస్తున్నట్లు తెలిపారు. ఏఎస్ఈఆర్ సర్వే ప్రకారం మూడో తరగతి విద్యార్థులకు రెండో తరగతి పాఠ్యపుస్తకాలు ఇవ్వగా 22 శాతం మంది మాత్రమే చదవగలిగారని.. ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు 18 సబ్జెక్టులు ఉంటే ఒకే టీచర్ అన్ని సబ్జెక్టులను బోధిస్తుండటం వల్ల విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ప్రమాణాల మేరకు లేదని.. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల వ్యవస్థను ఆరు రకాలుగా వర్గీకరిస్తున్నట్లు తెలిపారు. కొత్త విధానంలో ప్రతి సబ్జెక్టుకు ఓ టీచర్ అందుబాటులో ఉంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యారంగ కార్యక్రమాల వల్ల ప్రయోజనాలను గమనిస్తే.. 2018-19లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 37 లక్షల 20 వేల మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 43 లక్షల 43 వేలకు పెరిగిందని ముఖ్యమంత్రి వివరించారు.
అంతకు ముందు మొదటి దశ నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన భవిత కేంద్రం, ఫిజియోథెరపీ, అదనపు తరగతి గదులు, గ్రంథాలయం, వంటశాల, డిజిటల్ తరగతి, మంచినీటి సరఫరా వ్యవస్థ తదితర సౌకర్యాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ , రాష్ట్ర పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ బి.రాజశేఖర్, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తదితరులతో ముఖ్యమంత్రి పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను కలెక్టర్ సి.హరికిరణ్.. ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో జ్యోతిప్రజ్వలన చేసి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు.