కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. జిల్లాలో గుర్తించిన 15 ఆసుపత్రుల్లో అన్ని రకాల వసతులు సమకూర్చుకొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో తీసుకొనే చర్యలు, అనుసరించాల్సిన పద్దతులపై చర్చించేందుకు జేసీ జిల్లా వైద్యారోగ్య శాఖ, ఇతర అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాలులో బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో గుర్తించిన 15 ప్రయివేటు ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు జరిగేలా, అన్ని రకాల వసతులను సమకూర్చుకొనేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మూడో దశలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మొదటి రెండు దశల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని జాగురూకత వ్యవహరించాలని సూచించారు. డీఎం &హెచ్‌వో రమణ కుమారి, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు, జిల్లా కేంద్రాసుపత్రి సూపరింటెండెంట్ డా. సీతారామరాజు, డీఐవో డా. గోపాల కృష్ణ, అదనపు ఎస్సీ పీఎస్ఎన్ రావు, అదనపు డీఎం & హెచ్‌వో రామ్మోహన్‌రావు, ఇతర అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.