బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై, పొగాకు వాడకంపై నియంత్రణ ఉండాలని జేసీ మహేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్‌లో ఆయన ఈ మేరకు మాట్లాడారు. పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు చట్టంలో పేర్కొన్న నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, జరిమానాలు విధించాలని చెప్పారు. ముఖ్యంగా యువత పొగాకు వాడకానికి దగ్గర కాకుండా చూడాలన్నారు. పిల్లలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. అనంతరం పొగాకు వాడకంపై హెచ్చరికలు, సూచనలతో కూడిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో జేసీ జె. వెంకటరావు, టొబాకో స్టేట్ కన్సల్టెంట్ శివకుమార్, డీఎం &హెచ్‌వో రమణ కుమారి, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు, జిల్లా కేంద్రాసుపత్రి సూపరింటెండెంట్ డా. సీతారామరాజు, డీఐవో డా. గోపాల కృష్ణ, అదనపు ఎస్సీ పీఎస్ఎన్ రావు, అదనపు డీఎం & హెచ్‌వో రామ్మోహన్‌రావు, ఇతర అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.