మసగ్ర భూ సర్వేకి ప్రత్యేక ప్రణాళికలు..
Ens Balu
2
Kakinada
2021-08-18 15:15:55
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష కార్యక్రమానికి సంబంధించి సమగ్ర భూ రీసర్వే కార్యకలాపాలు ప్రణాళిక ప్రకారం దశల వారీగా కొనసాగుతున్నాయని కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అలోక్ ప్రేమ్‌నగర్, సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులతో కలిసి సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్.. భూ రికార్డుల స్వచ్ఛీకరణ, రీసర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పంచాయతీరాజ్, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సి.హరికిరణ్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్.. కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ విలేజస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ (స్వామిత్వా) కార్యక్రమానికి సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన భూ రికార్డుల స్వచ్ఛీకరణ, రీసర్వే పనులను ప్రత్యేక బృందాలతో నిర్వహిస్తున్న తీరును వివరించారు. డ్రోన్ ఫ్లయింగ్ సన్నద్ధత కార్యకలాపాలను దశల వారీగా పూర్తిచేస్తున్నట్లు వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం డ్రోన్ ఫ్లయింగ్, ఓఆర్ఐ మ్యాప్స్, గ్రౌండ్ ట్రూతింగ్ తదితర అంశాలపై కలెక్టర్ హరికిరణ్.. జిల్లా పంచాయతీరాజ్, సర్వే అధికారులతో సమీక్షించారు. సమావేశానికి జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్ తదితరులు హాజరయ్యారు.