ఎవరి రేషన్ కార్డులు రద్దుకావు..
Ens Balu
2
కాకినాడ
2021-08-19 15:18:08
బియ్యం కార్డులో పేర్లున్న వారిలో ఇంకా ఈ-కేవైసీ పూర్తికానివారు వారి కుటుంబ పరిధిలోని వాలంటీర్ మొబైల్ యాప్ ద్వారా ప్రక్రియను పూర్తిచేయించుకోవాలని, ఎవరి బియ్యం కార్డూ రద్దు కాదని.. ఈ విషయంలో అనవసర అపోహలు, భయాలు వద్దని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్.. వర్చువల్ విధానంలో బియ్యంకార్డుదారుల ఈ-కేవైసీ అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కార్డులో పేర్లున్న వారిలో ఎవరికి ఈ-కేవైసీ కాలేదో వారికి నోటీస్ ద్వారా సమాచారం అందిస్తున్నామని, వారు మాత్రమే ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ వాలంటీర్ ద్వారా ప్రక్రియను పూర్తిచేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ-కేవైసీ చేసే సమయంలో వేలిముద్రలకు సంబంధించి ఎవరికైనా, ఏదైనా సమస్య ఎదురైతే మాత్రమే వాటిని అప్‌డేట్ చేసుకునేందుకు ఆధార్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 272 ఆధార్ అప్‌డేషన్ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. ఈ కేంద్రాల వద్ద తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 1,99,944 మందికి ఈ-కేవైసీని పూర్తిచేశామని, మిగిలిన ప్రతి ఒక్కరికీ ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల చివరినాటికి అవసరం మేరకు సమయం పెంపుపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఈ-కేవైసీ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సంక్షేమ పథకాలకూ బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ అవసరమవుతుందని.. ప్రస్తుతం ఈ-కేవైసీ సమయంలో సమస్యలు ఎదురైన వారు వాటిని పరిష్కరించుకుంటే వివిధ పథకాల లబ్ధి విషయంలోనూ సమస్య రాదని వివరించారు. అయిదేళ్లలోపు పిల్లలకు ఈ-కేవైసీ అవసరం లేదని, ఆపై వయసు పిల్లలకు వచ్చే నెల చివరి వరకు సమయం ఉందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.