విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేసేందుకు, ఈ నెల 23 నుంచి నియోజవర్గాల వారీగా శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్దుల సంక్షేమశాఖ అధికారులు, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృత్రిమ అవయవాలు పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఈ శిబిరాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలతో గురువారం వెబ్క్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జె.వెంకటరావు మాట్లాడుతూ, జిల్లాలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, వారు అందించే కృత్రిమ అవయవాల తయారీ, పంపిణీ గురించి వివరించారు. కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్లను అందించడం జరుగుతుందని చెప్పారు. కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, కృత్రిమ అవయవాలను తయారు చేసి, ఉచితంగా అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 23, 25, 27 తేదీల్లో నియోజకవర్గాల వారీగా శిబిరాలను ఏర్పాటు చేసి, కృత్రిమ అవయవాలను పంపిణీ చేసేందుకు, కొలతలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరాల్లో దివ్యాంగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.
కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం (ఏఎల్ఎంయు), గురుదేవ ఛారిటబుల్ ట్రస్టు, అసోసియేషన్ సాయి కొరియన్ తదితర సంస్థలు కృత్రిమ అవయవాలను, కాలిపర్స్ పంపిణీ చేస్తాయని చెప్పారు. శారీరకంగా వికలాంగత్వం ఉన్నవారికి ఇదొక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ శిబిరాల ఏర్పాటు గురించి గ్రామ స్థాయిలో కూడా విస్తృతంగా ప్రచారం చేసి, ఎక్కువమంది వినియోగించుకొనేవిధంగా చూడాలని కోరారు.
ఈ సమావేశంలో వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు నీలకంఠ ప్రధానో, వివిధ మండలాల ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.