సమస్యల పరిష్కారం కోసం రెవిన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, అర్జీదారులందరికీ సమాన గౌరవం ఇవ్వాలని, అర్జీదారులందరి సమస్యల పట్ల ఒకే రీతిలో స్పందించి వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి జిల్లాలోని తహశీల్దార్‌లను ఆదేశించారు. అర్జీలు ఇవ్వడానికి వచ్చే వ్యక్తులందరి సమస్యలను సావధానంగా విని వాటిని సాధ్యమైనంత మేరకు న్యాయబద్ధంగా పరిష్కరించేందుకే ప్రయత్నించాలన్నారు. అర్జీలను తమ స్థాయిలో పరిష్కారం సాధ్యమైనప్పటికీ వాటిని తిరస్కరించే పరిస్థితి రానివ్వొద్దని స్పష్టంచేశారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్‌తో కలసి జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్‌లతో ఆన్ లైన్ కాన్ఫరెన్సు నిర్వహించారు. స్పందనలో వచ్చే ప్రజా వినతుల పరిష్కారం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
జిల్లాలోని ఏ మండలంలోనూ ప్రభుత్వానికి చెందిన భూముల రక్షణ బాధ్యత తహశీల్దార్లదేని స్పష్టంచేశారు. ప్రభుత్వ భూములకు తహశీల్దార్‌లు రక్షకులుగా వ్యవహరించాలన్నారు. మండలంలోని ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమణలకు గురైతే తక్షణం స్పందించి ఆక్రమణలు తొలగించి, భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువుల ఆక్రమణల వల్ల వాటి నీటి నిల్వ సామర్ధ్యం కోల్పోయి అనేక నష్టాలు జరిగే అవకాశం వుంటుందని అందువల్ల చెరువుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. మండలంలోని భూవివరాలపై తహశీల్దార్‌లకు సమగ్రమైన అవగాహన వుండాలని కలెక్టర్ స్పష్టంచేశారు. ఏయే వర్గీకరణలకు సంబంధించిన భూమి ఎన్ని ఎకరాలు వుందో చెప్పే పరిస్థితి వుండాలన్నారు. వచ్చే సమావేశం నాటికి ఆయా మండలాల్లో భూముల వివరాలకు సంబంధించి పూర్తి సమాచారంతో, అవగాహనతో సిద్ధం కావాలన్నారు. జిల్లాకు రానున్న రోజుల్లో పలు పరిశ్రమలు, జాతీయ ప్రాజెక్టులు రానున్నాయని, వాటి ఏర్పాటు కోసం భూములు అవసరం వుంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ల్యాండ్‌బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఆయా మండలాల్లో ఆక్రమణలు లేకుండా స్పష్టంగా అందుబాటులో వుండే ప్రభుత్వ భూముల వివరాలు సిద్ధం చేయాలని చెప్పారు.
ఈ సందర్భంగా మండలాల వారీగా రెవిన్యూ శాఖకు సంబంధించి స్పందన వినతుల పరిష్కారంపై సమీక్షించారు. ఏదైనా మండలంలో పెద్ద ఎత్తున పెండింగ్‌లో వున్నట్లయితే ఏ కారణంగా వున్నాయో తెలుసుకున్నారు. కోర్టు వివాదంలో ఉన్నట్లు తెలియజేస్తే వాటికి సంబంధించి కౌంటర్‌లు సంబంధిత న్యాయస్థానంలో దాఖలు చేసిందీ లేనిదీ సమీక్షించారు. ఏయే రకమైన వినతులు పరిష్కారం కాకుండా మిగిలి వుంటున్నాయో తహశీల్దార్‌ల ద్వారా తెలుసుకున్నారు. వై.ఎస్.ఆర్. జగనన్న భూహక్కు భూరక్ష కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న రెండు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా జరుగుతున్న సర్వేపై సమీక్షించారు.