భూములు రీసర్వే పనులు వేగం పెంచాలి..


Ens Balu
3
Srikakulam
2021-08-19 16:22:32

శ్రీకాకుళం జిల్లాలో భూముల రీ సర్వే పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఏడి సర్వేను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ చాంబర్ లో జగనన్న భూ రక్షణ, శాశ్వత భూ హక్కు, భూ రక్ష పై పైలెట్ గ్రామాల్లో జరుగుతున్న పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తో గురువారం సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు పనులు చేపడుతున్న మూడు డివిజన్లలో శ్రీకాకుళం డివిజన్ లో పోలాకి మండలం సంతలక్ష్మీపురం గ్రామం, టెక్కలి డివిజన్ లోని కోటబొమ్మాళి మండలం ఆనందపురం గ్రామం, పాలకొండ డివిజన్ లోని పాలకొండ మండలం పరశురాంపురం గ్రామాల్లో చేపడుతున్న పైలెట్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, ప్రస్తుతం ఒక డ్రోన్ తో సర్వే జరుగుతుందని సర్వే సహాయ సంచాలకులు కుంచె ప్రభాకర్ కలెక్టర్ కు వివరించారు. అదనంగా మరో డ్రోన్ తీసుకొని సర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రణాళికా బద్థంగా, సమస్యలు లేకుండా చేయాలన్నారు. శ్రీకాకుళం, గార మండలాలు కలిపి ఒక క్లస్టర్ గా చేసి ఒకేసారి పనులు జరిగేలా గ్రౌండ్ వర్క్ పనులు చేయాలని, సర్వే కమీషనర్ నుండి అనుమతి వచ్చిన వెంటనే డ్రోన్ ఫ్లైయింగ్ పనులు ప్రారంభించాలని చెప్పారు.  ఈ సమావేశంలో భూ సర్వే శాఖ సహాయ సంచాలకులు కుంచె ప్రభాకర్, డిపిఓ రవి కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ లక్ష్మీపతి పాల్గొన్నారు.