లింగ నిష్పత్తి పై గ్రామ స్థాయిలో అవగాహన..
Ens Balu
3
Srikakulam
2021-08-19 16:51:52
లింగ నిష్పత్తి పై గ్రామ స్థాయిలోనే అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ. కిషోర్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో పిసి మరియు పియన్ డిటి చట్టం అమలు పై కమిటీ ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలోనే ఆశా వర్కర్లు, ఎఎన్ఎం లు, అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణులకు ఆవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే సమావేశానికి ఐసిడిఎస్ సిడిపిఓ హాజరయ్యేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి బి. జగన్నాధరావు ను ఆదేశించారు. లింగ నిష్పత్తి ఏ ఏ మండలాల్లో తక్కువగా ఉందో వాటిని గుర్తించి ఆ మండలంలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఆడపిల్ల పుట్టడమే అదృష్టంగా భావించాలన్నారు. స్కానింగ్ కేంద్రాలు చట్టం ఉల్లంఘన చేస్తే కఠిన క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. బాల్య వివాహాలు నిరోధించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్ లో ఉన్న ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లు సమాచారం తీసుకోవాలని చెప్పారు. కొన్ని కేంద్రాలను తనిఖీ చేయాలని చెప్పారు. గర్భం ధరించడానికి ముందుగాని తర్వాత గానీ లింగ ఎంపిక చేయకూడదన్నారు. లేబరేటరీలు గర్భస్థ పిండాలు తెలిపే లింగాన్ని తెలిపే ఉద్దేశంతో ఎలాంటి పరీక్షలు చేయరాదని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై మూడు సంవత్సరాలు జైలు శిక్ష, 10 వేల రూపాయలు జరిమానా విధించబడుతుందన్నారు. స్వచ్ఛంద సంస్థల నుండి రమణమూర్తి, విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామ స్థాయిలోనే అవగాహన సదస్సు లు ఏర్పాటు చేయాలని, సినిమా హాల్స్, సిటి కేబుల్ లలో ప్రకటనలు జారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి. జగన్నాధరావు, ఒన్ టౌన్ సీఐ అంభేథ్కర్, అడ్వకేట్ సరళ కుమారి, స్వీప్ స్వచ్ఛంద సంస్థలు నుండి రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.