వ్యక్తిగత పరిశుభ్రతతోనే దోమల నియంత్రణ..


Ens Balu
4
Srikakulam
2021-08-19 16:54:45

వ్యక్తిగత పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె సి చంద్ర నాయక్ వెల్లడించారు. ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఆయన ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  2018 సం.రం నుండి జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయని, ఇది శుభ పరిణామమని  అన్నారు. డెంగ్యూ 2018లో 87 కేసులు, 2019లో 164 కేసులు, 2020లో 23 కేసులు, 2021లో ఇప్పటివరకు 10 కేసులు నమోదయినట్లు చెప్పారు. మలేరియా 2018లో 264 కేసులు, 2019లో 125 కేసులు, 2020లో 34 కేసులు, 2021లో ఇప్పటివరకూ 28 కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని , అందువలన ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మలేరియా మరియు డెంగ్యూ వ్యాధులు దోమల నుండి సంక్రమిస్తాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి దోమల నివారణకై తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తక్కువ ధరకు లభించే దోమ తెరలను వినియోగించుకోవాలని, తద్వారా దోమల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. సరైనా జాగ్రత్తలు పాటించకపోవడం వలన సెరిబ్రల్ మలేరియా వంటి వ్యాధుల బారిన పడి లక్షలాది రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. చిన్నపాటి జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. మలేరియా నివారణకై జిల్లాలో 144 హై రిస్క్ గ్రామాలను గుర్తించడం జరిగిందని, ఈ ప్రాంతాల్లో మొదటి విడత పిచికారి కార్యక్రమాన్ని  2021 మే 15 నుండి జూన్ 30 వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. రెండవ విడత పిచికారి కార్యక్రమాన్ని జూలై 16 నుండి ప్రారంభించి ఇప్పటి వరకు 124 గ్రామాలలో పిచికారి చేయించినట్లు చెప్పారు.

10ఏపిఐ ఉన్న 26 గ్రామాల్లో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలతో పిచికారి జరిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2 లక్షల గంబూషియా చేపలను హైరిస్క్ ప్రాంతాల్లో పెద్ద నీటి నిల్వలు ఉన్నచోట విడిచిపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసామని, ఇంతవరకు లక్ష గంబూషియా చేపలను కుసిమి, దోనుబాయి, అన్నవరం మొదలగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని నీటి నిల్వల్లో విడిచిపెట్టామని తెలిపారు. ఈ సీజనల్ మలేరియాకు సంబంధించిన ఏంటి మలేరియా మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఉప కేంద్రాల్లో నిల్వచేసినట్లు ఆయన వివరించారు. గ్రామాలు, పట్టణాల్లో పంచాయతీరాజ్ శాఖ, పురపాలక శాఖల సహకారంతో దోమల లార్వా నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసారు. డెంగ్యూ ఏడిస్ దోమల నుండి సంక్రమిస్తుందని,  ఇవి ఇంటి పరిసరాల్లో ఉండే చిన్ననీటి నిల్వల్లో ఉండి పగటిపూట తిరుగుతూ ఉంటాయని చెప్పారు. కావున పగటి వేళల్లో దోమలు కుట్టకుండా ఉండేందుకు పూర్తిగా వస్త్రధారణ చేసుకోవాలని సూచించారు. డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు జిల్లా ఆసుపత్రితో పాటు పాలకొండ, రాజాం, టెక్కలి ఆసుపత్రులలో కూడా చేయడం జరుగుతుందని తెలిపారు.  మలేరియా , డెంగ్యు వచ్చేక బాధపడటం కంటే రాకుండా ముందస్తు నివారణ చర్యలు పాటించడం మేలని ఆయన సూచించారు.  ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బగాది జగన్నాథరావు, జిల్లా మలేరియా అధికారి డా. జి.వీర్రాజు, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.