తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాలు, చర్చిలకు మరింత భద్రత కల్పించనున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని 64 మండాల్లోని అన్ని గ్రామాల్లోని చర్చిలు, ఆలయాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు, అవిపనిచేస్తున్న విధానాలపై నివేదికలు సమర్పించాలని ఎస్ఐలను శుక్రవారం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసుల ద్వారా సమాచారం సేకరించడంతోపాటు అక్కడి తాజా పరిస్థితులను అంచనా వేయాలని కూడా ఆదేశించారు. దీనితో స్టేషన్ల పరిధిలోని పోలీసులు, సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులు ఈ సమాచారం సేకరించే పనిలో పడ్డారు. జిల్లా మొత్తం సమాచారం వచ్చిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు జారీ చేయనున్నారు.