శ్రీ పద్మావతి ఆలయంలో వరలక్ష్మీవ్రతం..


Ens Balu
4
Tirupati
2021-08-20 09:00:45

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శుక్రవారం  వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. విష్వక్సేనారాధనతో ప్రారంభించి పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సంప్రదాయ పుష్పాలతో  ఆరాధించారు. అదేవిధంగా అమ్మవారిని 9 గ్రంథులతో అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా  ఆరాధించారు. అనంతరం శ్రీ వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని, ఆచరించవలసిన విధానాన్ని  ఆగమ పండితులు   శ్రీనివాసాచార్యులు  తెలియజేశారు.  తరువాత ఐదు రకాల కుడుములతో పాటు 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.  2713 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసి వర్చువల్ గా ఈ వ్రతంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు, రాష్ట్ర మంత్రి  వేణుగోపాల కృష్ణ,  టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, జెఈవో  స‌దా భార్గ‌వి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, అదనపు సివిఎస్వో  శివకుమార్ రెడ్డి, ఆల‌య డెప్యూటి ఈవో  క‌స్తూరి బాయి, ఏఈవో  ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అర్చ‌కులు  బాబుస్వామి పాల్గొన్నారు. భక్తుల కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ వరలక్ష్మి వ్రతాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేసింది.