ప్రియుడిచేతిలో దాడికి గురై, జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న, పూసాటిరేగ మండలం చౌడవాడకు చెందిన రాములమ్మను, ఆమె కుటుంబ సభ్యులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాములు పుష్ప శ్రీవాణి, మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం పరామర్శించారు. ఆసుపత్రి వైద్యాధికారులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రాణాపాయం లేదని, ఎటువంటి ఆందోళన చెందవద్దని, చికిత్సకయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ, ఈ సంఘటన చాలా దురదృష్టకమంటూ, దానిని ఖండించారు. పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తే, తనకు కాబోయే భార్యపై అనుమానంతో దాడి చేశాడని, పెట్రోలు పోసి నిప్పంటించాడని చెప్పారు. అయితే బాధితులు తక్షణమే స్పందించి, దిశ యాప్‌ను ఉపయోగించడంతో, సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకొని, బాధితులను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారని చెప్పారు. మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి తీసుకువచ్చిన దిశ యాప్ వారి ప్రాణాలను కాపాడిందని అన్నారు. దిశయాప్‌లో ఎస్ఓఎస్ బటన్‌ను బాధితురాలి సోదరి ప్రెస్ చేయడంతో, వెంటనే పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలంతా దిశయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. ఆపద సమయంలో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే, పోలీసులు అక్కడికి చేరుకొని రక్షణ కల్పిస్తారని చెప్పారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, చౌడవాడ ఘటనలో బాధితులకు ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. అయినప్పటికీ మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం స్టీలుప్లాంటు బర్న్స్ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన రాంబాబును, అతనిని ప్రోత్సహించినవారిని గుర్తించి, వారికి శిక్ష పడేలా చేస్తామని అన్నారు. బాధితరాలు రాములమ్మకు, నిందితుడు రాంబాబుతో 8 నెలల నుంచీ పరిచయం ఉందని, ఇద్దరూ ప్రేమించుకుంటూ, అక్టోబరులో పెళ్లి చేసుకోవడానికి పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరిందని తెలిపారు. అయినప్పటికీ, రాములమ్మపై అనుమానంతో పెట్రోలు పోసి తగలబెట్టేందుకు రాంబాబు ప్రయత్నించాడని చెప్పారు. ఆ కుటుంబాన్ని ఆదుకొనేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి, ఎస్‌పి దీపిక, ఎంఎల్‌సి పెనుమత్స సురేష్ బాబు, ఎంఎల్ఏలు బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, ఇతర అధికారులు ఉన్నారు.