విజయనగరం జిల్లాలో 18 ఏళ్లు దాటినవారందకీ కోవిడ్ వేక్సిన్ వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతీఒక్కరూ వినియోగించుకొని, వేక్సిన్ వేయించుకోవాలని కోరారు. జిల్లాలో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమంపై తన ఛాంబర్‌లో శనివారం సమీక్షించారు. జిల్లాలో 18 ఏళ్లు దాటినవారందరికీ కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు కలెక్టర్ చెప్పారు. సోమవారం నుంచి ఈ ప్రక్రియను ముమ్మరం చేస్తున్నామని, ప్రతీఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రతీ ఒక్కరూ అప్రమత్తం గా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 వేక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలోని 26 కేంద్రాల్లో ప్రత్యేకంగా కో-వేగ్జిన్ వేస్తారని, మొత్తం 80 కేంద్రాల్లోనూ కోవిషీల్డ్ వేక్సిన్ వేస్తారని చెప్పారు. అన్ని పిహెచ్‌సిలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో వేక్సినేషన్ జరుగుతుందన్నారు. వివిధ రంగాల వారీగా కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 24న, 18 ఏళ్లు దాటిన బిసి కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు, హాస్టల్ సిబ్బందికి వేక్సినేషన్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే హొటల్స్ అసోసియేషన్ ద్వారా, హొటల్ సిబ్బందికి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా ఆ సంస్థ సిబ్బందికి, వర్కర్లకు ప్రత్యేకంగా వేక్సినేషన్ నిర్వహిస్తామన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు సుమారుగా 9,74,091 మందికి మొదటి డోసును, 2,32,226 మందికి రెండో డోసును వేక్సిన్ వేశామని చెప్పారు. హెల్త్‌కేర్ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు శతశాతం వేక్సినేషన్ జరిగిందన్నారు. పిల్లలకు పాలిచ్చే తల్లులకు శతశాతం, గర్భిణిలకు సుమారు 75శాతం వేక్సినేషన్ పూర్తిచేసినట్లు చెప్పారు. వేక్సినేషన్ కార్యక్రమంలో ప్రతీఒక్కరూ భాగస్వాములై, జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో డిఐఓ డాక్టర్ గోపాలకృష్ణ, డిబిసిడబ్ల్యూఓ కీర్తి, ఎన్ఐసి అధికారి నరేంద్ర, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.