అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయడం ద్వారా, వాటి లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి కోరారు. జిల్లా అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా యూనిట్లను రూపొందించి, వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. వైఎస్ఆర్ క్రాంతిపథం, డిఆర్‌డిఏ, మెప్మా కార్యక్రమాలపై కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల పరంగా అమలవుతున్న పథకాలను, జిల్లాలో వాటి ప్రగతిని జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు వివరించారు. వైకెపి, డిఆర్‌డిఏ ద్వారా వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ బీమా, జగనన్న తోడు, వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్ఆర్ పింఛన్ కానుక, నైపుణ్య శిక్షణ, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, ఉన్నతి తదితర పథకాలను అమలు చేయడం జరుగుతోందని చెప్పారు. మెప్మా ద్వారా అమలు జరుగుతున్న వైఎస్ఆర్ బీమా, జగనన్న తోడు, వైఎస్ఆర్ ఆసరా, స్వానిధి, ఉపాధి కల్పనా పథకాలు, టిట్కో హౌసింగ్, క్లాప్ తదితర పథకాలను ప్రగతిని వివరించారు. కార్యక్రమాలను అమలు చేయడంతోపాటుగా, డిజిటల్ ఎకనాలడ్జమెంట్ తప్పనిసరి చేశామని చెప్పారు. కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, జిల్లాలోని పరిస్థితులకు అనుగుణంగా పథకాలను అమలు చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల సామాజిక అవసరాలు, భౌగోలిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. పేదలకు ప్రభుత్వ పథకాలపై సంపూర్ణ అవగాహన కల్పించి, వాటిని అట్టడుగు స్థాయికి అందేలా చూడాలన్నారు. పథకాలకు ఎంపిక చేసిన లబ్దిదారుల జాబితాలను ప్రజాప్రతినిధులకు అందజేయాలని చెప్పారు.
వివిధ పథకాల ద్వారా రుణాలను అందించడంతోపాటుగా, వాటి రికవరీపైనా దృష్టి పెట్టాలని సూచించారు. రికవరీ విషయంలో భోగాపురం, చీపురుపల్లి, గుర్ల మండలాలు వెనుకబడి ఉండటంపై ఆరా తీశారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, పథకాల అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు. బీమా పథకాన్ని పేదలందరికీ వర్తింపజేయడం ద్వారా, వారి జీవితాలకు భరోసా లభిస్తుందన్నారు. జగనన్న తోడు పథకం ప్రగతి తక్కువగా ఉందని, వేగవంతం చేయాలని సూచించారు. ఈ నెలాఖరునాటికి ఈకెవైసి పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని పరిశ్రమలు, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకొని, నైపుణ్య శిక్షణ జరగాలన్నారు. పట్టణ ప్రాంతంలో గృహ నిర్మాణ కార్యక్రమం భారీ స్థాయిలో జరుగుతోందని, అందువల్ల హౌసింగ్ లోన్స్‌పై దృష్టి పెట్టాలని, ముఖ్యంగా గుంకలాం లేఅవుట్ లబ్దిదారులకు రుణాలను త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిఆర్‌డిఏ, వైకెపి ప్రాజెక్టు డైరెక్టర్ అశోక్‌కుమార్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర రావు, డిఆర్‌డిఏ ఏపిడి సావిత్రి, డిపిఎంలు, టిపిఎంలు, ఏరియా కో-ఆర్డినేటర్లు, ఏపిఎంలు, సిసిలు, సిఎంఓలు తదితరులు పాల్గొన్నారు.