శ్రీకాకుళం ప్రతి సోమవారం ఖాదీ, చేనేత వస్త్రాలు ధరించడం సాంప్రదాయంగా పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేస్తూ పొందూరు ఖాదీ జాతీయ, అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిందని అయినప్పటికీ ఖాదీ, చేనేతకారుల ఆర్థిక స్థితి గతులు అనుకున్న స్థాయిలో ఉండడం లేదని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఖాదీ, చేనేత కార్మికులకు తగిన ప్రోత్సాహం అందించి వారి జీవన పరిస్థితులు మెరుగుకావడానికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం కింద మగ్గాలు ఉన్న కార్మికులకు ఏడాదికి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల క్రింద చేయూతను ఇస్తున్నాయని ఆయన తెలియజేస్తూ జిల్లాలో చేనేత కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుకు ప్రజల సహకారం అవసరమని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం ఖాదీ, చేనేత వస్త్రాలను ధరించి ఖాదీ, చేనేత కార్మికులకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా సహకారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.