ప్రజలకు పారదర్శకంగా పాలన అందాలంటే గ్రామ పరిపాలనా విభాగం అభివృద్ధి చెందాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస నియోజకవర్గం మందస మండలంలోని నారాయణపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను మంత్రి డా. సీదిరి అప్పలరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు సత్వరమే అందుకోవడంతో పాటు ప్రజా పరిపాలనా విభాగం మెరుగుపరిచేందుకు సచివాలయాలు ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో గ్రామ పరిపాలన జరిగితే గ్రామ స్వరాజ్యం ఏర్పాటుచేసుకునే అవకాశం కలుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి భావించి సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేశారని గుర్తుచేసారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏ రాష్ట్రం చేయని సాహసాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేసారని తెలిపారు. దేశానికే రోల్ మోడల్ గా ప్రజా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిందని తెలిపారు. వ్యవస్థల్లో ఉన్న లోపాలతో ప్రజలపై భారం పడకూడదని, ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమం, అభివృద్ధి తక్షణమే లబ్ధిదారునికి అందేలా చూసే బాధ్యత సచివాలయ వ్యవస్థ చూసుకుంటుందని అన్నారు. సచివాలయాలు అన్ని గ్రామ అభివృద్దికి దేవాలయాలు అని అన్నారు. ప్రజా పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యం దిశగా పయనిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అందులో భాగంగా నారాయణపురంలో సచివాలయంకు నూతన భవనం ప్రారంభించుకుంటున్నమని అన్నారు.
వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆరుగాలం కష్టపడే రైతుకు భరోసాగా ఉండాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. రైతుకు నిత్యం తోడుగా ఉండాలని రైతు సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేసేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు సంక్షేమానికి భాటలు వేస్తున్న రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రతి గ్రామం సర్వతోముఖాభివృద్ది జరగాలని కోరుకుంటున్నామని, ప్రజా ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడమే ధ్యేయంగా ప్రతి సచివాలయం వద్ద ప్రజా ఆరోగ్య కేంద్రం నిర్మిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేసారు. అందులో భాగంగా ఆరోగ్య కేంద్రం ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వైద్యం అందని గ్రామాలకు నేడు సచివాలయాల చెంతనే వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అందరూ ఆరోగ్యంగా ఉండేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మందస మండల తహశీల్ధారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.