ఆంధ్రకేసరి అందరికీ ఆదర్శ ప్రాయులు..
Ens Balu
4
Srikakulam
2021-08-23 07:10:00
సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమర యోధుడు, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు టంగుటూరి ప్రకాశం పంతులు అని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. ఆగష్టు 23న కీ.శే.టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురష్కరించుకొని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రకాశం పంతులు జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అని గుర్తుచేసారు. 1940 – 50 దశకంలో ఆంధ్ర రాజకీయాల్లో క్రియశీలక పాత్రను పోషించడమే కాకుండా ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరని అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కావడం గొప్ప చారిత్రాత్మకమని కొనియాడారు. సైమన్ కమీషను వెళ్లినచోటల్లా నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికారన్నారు. 1928 మార్చి 2న కమీషన్ బొంబాయిలో అడుగుపెట్టినపుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదని, ప్యారీస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపములో జరిగిన పోలీసులు కాల్పుల్లో కోపోద్రిక్తుడైన ప్రకాశం తన చొక్కా చించి ధైర్యంగా ముందుకు వెళ్లాడన్నారు. ఆయన ధైర్ఘ్య సాహసాలకు గుర్తుగా ఆంధ్రకేసరిగా పేరు పొందారని అన్నారు. అలాగే 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, జైలుకు వెళ్లి విడుదలైన తదుపరి ప్రజలకు మరింత చేరువకావటానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించిన ధీరోదాత్తుడు ప్రకాశం పంతులు అని తెలిపారు. ఆయన ఇచ్చిన స్పూర్తి , ఆశయసాధన అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, డా. కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములునాయుడు, హిమాంశు కౌశిక్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.