ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించాలి..


Ens Balu
2
Srikakulam
2021-08-23 09:20:40

పెండింగ్ లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు.  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు.  ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డ్వామా, డిఆర్డిఎ పిడి లు హెచ్. కూర్మారావు, శాంతి శ్రీ అర్జీలను స్వీకరించారు.పోలాకి మండలానికి చెందిన సుశీల భూ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు తన అర్జీ  అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులకు వచ్చే అర్జీలు మీ మీ స్థాయిలో పరిష్కారం అయ్యే అర్జీలను పరిష్కరించాలని, పరిధి లో లేనివి సంబంధిత మండలాలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.  శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అర్జీల సంఖ్య ను తెలియజేయాలన్నారు. ఏ వారం వచ్చిన అర్జీలను ఆ వారమే పరిష్కారానికి అవకాశం ఉన్న మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 266 అర్జీలు స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.