స్పందన అర్జీలను గడువులోగా పరిష్కరించాలి..
Ens Balu
3
Kakinada
2021-08-23 11:25:13
స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీలను గడువులోగా పరిష్కరించా లని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన హాలులో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్లు డా. జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, ఎ.భార్గవ్ తేజ; డీఆర్వో సీహెచ్ సత్తిబాబు పొల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. తొలుత ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద కలెక్టర్ హరికిరణ్, ఐసీడీఎస్ పీడీ జి.సత్యవాణి; ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ఈడీలు జీఎస్ సునీత, ఎస్‌వీఎస్ సుబ్బలక్ష్మి; హౌసింగ్ పీడీ జి.వీరేశ్వర ప్రసాద్, ఇతర అధికారులు నివాళులర్పించారు. అనంతరం ఇప్పటి వరకు స్పందన ద్వారా వచ్చిన అర్జీలు, వాటి పరిష్కారంలో పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి సంబంధించి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. స్పందన ద్వారా అందిన ప్రతి అర్జీదారునికి సంతృప్తికరమైన, నాణ్యతతో కూడిన సేవలు అందించాలన్నారు. అదేవిధంగా గత సోమవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా వచ్చిన అర్జీలను ఈ నెల 25 నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. మనబడి నాడు-నేడు రెండో దశ పనులకు సంబంధించి భాగస్వాములైన వివిధ శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులు పూర్తిచేయాలన్నారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాల మంజూరు, ఉపాధి కల్పన, ఫించన్లు, ఉపకార వేతనం, భూ వివాదాలు, వైఎస్సార్ బీమా, ఆరోగ్య శ్రీ, బియ్యం కార్డు మంజూరు తదితరాలకు సంబంధించి దాదాపు 355 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అర్జీల పరిష్కారం కొత్త ఫార్మాట్‌లో జరిగేలా చూడాలని అధికారులను కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.