మేం దృష్టిపెడితే హెరిటేజ్ నడిచేదా..ఈనాడు పనిచేసేదా


Ens Balu
30
Visakhapatnam
2022-12-03 11:35:26

రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను కానీ, రాష్ట్రానికి రానున్న పరిశ్రమలను కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడటం లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి విఘాతం కలిగించే విధంగా రెండు దినపత్రికలు శనివారం ప్రచురించిన తప్పుడు కథనాలపై అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. శనివారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని.. ఇందులో భాగంగానే అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందన్న ఒకే కథనం రెండు దినపత్రికల్లో ప్రచురితం కావడాని బట్టి చూస్తే, ఇది చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అని అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనం చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు అవాస్తవాలను ప్రచురిస్తున్నాయని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

 చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ కంపెనీ కార్పొరేట్ కార్యాలయం హైదరాబాదులో ఉన్నా, హెరిటేజ్ సామ్రాజ్యమంతా ఆంధ్రప్రదేశ్లోని విస్తరించి ఉంది కదా? దాని జోలికి ఎప్పుడైనా మా ప్రభుత్వం వెళ్లిందా? అని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమలను తాము రాజకీయ కోణంలోనే చూస్తే చంద్రబాబు ఏపీలో హెరిటేజ్ కంపెనీని నడిపించగలరా?  అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఏబీఎన్ రాధాకృష్ణ, రామోజీరావు ఏపీలో ప్రింటింగ్ ప్రెస్ లను నడపటం లేదా? అలాగే రామోజీరావు మార్గదర్శి కార్యకలాపాలను కొనసాగించడం లేదా? ప్రభుత్వం వీటిపై కక్ష కట్టి ఉంటే ఇప్పటికీ ఇవి సజావుగా ఎలా నడుస్తున్నాయని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. 
రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలను తీసుకువచ్చి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని, తద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తుంటే, దీనిపై తప్పుడు కథనాలు వండి వడ్డించి ప్రజలను తప్పుతో పట్టిస్తున్న ఆ పత్రికలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు.  
గడిచిన ఆరేడు నెలల్లో రాష్ట్రంలో పలు పరిశ్రమలను ప్రారంభించామని, మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశామని, సుదీర్ఘమైన సముద్రతీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోందని అమర్నాథ్ వెల్లడించారు. కాకినాడలో సుమారు వంద కోట్ల రూపాయలతో యాంకరేజ్ పోర్టును అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. 

దేశవ్యాప్తంగా సాగుతున్న ఆక్వా ఎగుమతులలో 45 శాతం ఏపీ నుంచే జరుగుతున్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక ప్రణాళిక వాస్తవాలకు దగ్గరగా ఉందని అమర్నాథ్ చెప్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో మూడుసార్లు నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్లలో 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకున్నారు. వాస్తవానికి 34 వేల రూపాయల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని అమర్నాథ్ స్పష్టం చేశారు. అప్పట్లో వాస్తవాలు వెల్లడించలేని ఈ రెండు పత్రికలు, ఇప్పుడు రాష్ట్రం నుంచి లక్ష డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వెనక్కి వెళ్లిపోయాయన్న తప్పుడు కథనాలు సిరాతో రాస్తున్నాయా? సారా తాగి రాస్తున్నాయని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు ఆయన తోక పత్రికలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి అమర్నాథ్ తీవ్రంగా హెచ్చరించారు.