ఏపీలో జగనన్న విద్యుత్ కోతల పథకం అమలు


Ens Balu
42
Visakhapatnam
2023-09-04 11:05:08

ఆంధ్రప్రదేశ్ లో ఇక పరిశ్రమలకు కూడా కష్టకాలం వచ్చేసింది. విద్యుత్‌ సరఫరాలో బారి కోతలు విధిస్తూ పరిశ్రమలకు వినియోగ గడువు నిర్ణయించడంతో పాటు వారానికో రోజు పవర్‌ హాలిడే ప్రకటించి పరిశ్రమల నడ్డి విరుస్తోందని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. ఏపీలో పరిశ్రమలపై నాలుగున్నారేళ్లగా పిడుగులు పడుతూనే ఉన్నాయి. పరిశ్రమలు అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి డబ్బులు కట్టే సంస్థలుగానే చూస్తున్నారు కానీ…అవి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని…వాటిని కాపాడుకుందామనే ఆలోచన ఎప్పుడూ చేయలేదని ఆరోపించారు. కరెంట్ చార్జీలను ఇష్టం వచ్చినట్లుగా పెంచడంతో ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు దాదాపుగా మూతబడ్డాయి. ఇప్పుడు ఇతర పరిశ్రమలకూ కరెంట్ కోతలతో అదే పరిస్థితిని తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఏప్రిల్‌, మే నెలల్లో పవర్‌ హాలిడే ప్రకటిస్తారు. కానీ సెప్టెంబరు తొలివారంలోనే ఈ విధానాన్ని అమలు చేయడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ చేతకాని అసమర్థ పాలనకు ఇది ఒక మచ్చుతునక అని ట్వీట్ చేశారు.

వైఎస్సార్సీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై వేల కోట్ల భారం వేశారని.. రైతులకు పంట చేతికి వచ్చే సమయానికి విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నది కనిపిస్తున్నదా అని ప్రశ్నించారు. రైతులకు కనీసం ఇస్తానన్న 9 గంటల కరెంటు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన తరువాత 22 మిలియన్ యూనిట్లు లోటు ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తన అనుభవంతో సర్ ప్లస్ చేసి ప్రతి ఇంటికి 24 గంటలు, పరిశ్రమలకు 24/7 కరెంటు అందించిన ఘనత గుర్తుచేసుకోవాలన్నారు. 
 9529 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం నుంచి 19,080 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు.

మీరు అధికారంలోకి రాకముందు సర్ ప్లస్ లో ఉన్న రాష్ట్ర విద్యుత్ ఇప్పుడు ఎందుకు అస్తవ్యస్తంగా మారిందో.. 2019 నుంచి విద్యుత్తు రంగంలో చోటు చేసుకున్న పరిణామాలపై అర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ఇంధన సంస్థలు తీసుకున్న రుణాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్మార్ట్‌ మీటర్ల కోసం చేసిన అప్పుల వివరాలను శ్వేతపత్రాన్ని విడుదల చేసి ప్రజలకు వివరించే ధైర్యం మీకు ఉందా జగన్మోహన్ రెడ్డి గారు..అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ అసమర్ధ పాలన వలన ఒక్క విద్యుత్ వ్యవస్థనే కాకుండా రాష్ర్టాన్ని అన్ని విభాగాల్లో భ్రష్టు పట్టించారని మీరు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బై జగన్...  బై బై జగన్.. అంటూ ట్వీట్ చేశారు.