నాడు భీమిలీ టు వైజాగ్ ఈస్ట్.. నేడు అక్కరమాని దారెటు..!


Ens Balu
216
Visakhapatnam
2023-08-27 16:48:15

వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు నుంచి అక్కరమాని విజయనిర్మల పార్టీకి విధేయురాలిగా పనిచేస్తూ వచ్చారు. ఎక్కువ కాలం భీమిలి నియోజకవర్గం నుంచే తన సేవా కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి విశేషంగా కృషిచేశారు. షడన్ గా అక్కడ సీటు అవంతి శ్రీనివాస్ తన్నుకుపోయారు..అక్కడ నుంచి విశాఖ ఈస్ట్ వచ్చిన తరువాత మళ్లీ ఇక్కడ నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్ధి వెలగపూడి రామక్రిష్ణం బాబుపై ఓడిపోయారు. అయినా ఎక్కడా తగ్గకుండా పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తూ..పనిచేస్తూ వచ్చారు. ఆమె సేవలను గుర్తించిన వైఎస్సార్సీపి  సింపతీ చూపిస్తూ విఎంఆర్డీఏ చైర్మన్ గానూ, విశాఖ తూర్పు నియోజకవర్గం ఇన్చాచార్జిగానూ హోదా కల్పించి దాదాపుగా సీటు ఖరారు చేసింది. ఆ ధీమాతోనే విశాఖ ఈస్ట్ లో ఇల్లు తీసుకొని మరీ నాలుగేళ్లపాటు స్థానికంగా పార్టీని బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తూ వచ్చారు. సరిగ్గా నియోజకవర్గంలో బలం పుంజుకుంటూ దూసుకుపోతున్నారని ప్రచారం ఉదృతంగా సాగుతున్న వేళ షడన్ గా మళ్లీ విశాఖ ఎంపీ ఎంవివి సత్యన్నారాయణను అధిష్టానం తూర్పునియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. అంతేకాకుండా ఆయనతో కలిసి పార్టీ పరిశీలకు గడప గడపకూ తిరుగుతూ ప్రచారం కూడా మొదలు పెట్టారు.

ఇలా పార్టీకార్యక్రమాలు చేపడుతున్న సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి చెప్పిన సమాధానం అక్కరమాని అనుచరులకు తీవ్ర బాధను మిగిల్చి నట్టు అయ్యింది. పార్టీని బలోపేతం చేస్తున్న అక్కరమాని కంటే బలమైన నాయకుడిగా ఎంవివి ఉన్నందున ఆయనకు పగ్గాలు చేపట్టామని..ఈ తరహా మార్పు రాష్ట్రంలో ఎక్కడైనా జరుగవచ్చునని పరోక్షంగా మరికొందరు సమన్వయకర్తలకు హెచ్చరికలు జారీచేశారు. గెలిచే వ్యక్తులకే పార్టీ పదవులు కట్టబెడుతుందని చెప్పుకొచ్చారు. ఇంతకాలం పార్టీకోసం పడిన కష్టం.. చేసిన ఖర్చు..పోయిన కాలం వృధాయేనా అనే ప్రశ్నలకు మాత్రం వైవీ తెలివిగా సమాధానం చెప్పారు. తమపార్టీ మిగిలిన పార్టీల మాదిరిగా మీడియాలోనూ, టీవీల్లోనూ బలంగా కాకుండా జనంలో బలంగా ఉందన్నారు. అధికారపార్టీ నేతలు బలంగా ఉన్నచోట గ్రూపు రాజకీయాలు జరుగుతాయని అన్నారు. అక్కరమాని విజయనిర్మల కంటే ప్రజల మన్ననలు ఎంపీగా ఉన్న ఎంవివి లాంటి వ్యక్తి అసెంబ్లీ  అభ్యర్ధిగా వస్తున్నారనే విషయం తెలుసుకుని కార్యకర్తల్లో మరింత ఉత్సాహం, ఎంతగానో ఆయనను స్వాగతిస్తున్నారని చెప్పుకు రావడం విశేషం.

విశాఖ తూర్పు నియోజకవర్గంలో యాదవులు బలం చాలా గట్టిగా వుంటుంది. అలాంటి ప్రాంతంలో అక్కరమాని వారికి వెన్నుదన్నుగా ఉంటూ పార్టీని  నియోజకవర్గంలో చాలా బలంగా తీసుకెళ్లి..తన బలగాన్ని ప్రదర్శించుకునే సమయం వచ్చిన తరుణంతో ఆ సీటుని ఎంపీ ఎంవివికి అధిష్టానం కట్టబెట్టి..అక్కరమానిని పక్కన బెట్టడం చర్చనీయాంశం అవుతోంది. అయితే మళ్లీ అక్కరమానిని భీమిలీ నియోజకవర్గానికైనా పంపిస్తారా అనే ప్రశ్నకు కూడా పార్టీ అధిష్టానం వద్ద సమాధానం లేదనేది వైవి చెబుతున్న గ్రూపు రాజకీయాలు అన్న మాటలను బట్టి స్పష్టమవుతోంది. ఇంతలా పార్టీకోసం శ్రమించిన అక్కరమానికి మిగిలింది ప్రస్తుతం నిరాశ మాత్రమే. అయితే ఎంవీవీని ఎమ్మెల్యేగా బరిలోకి దించిన అధిష్టానం కనీసం ఎంపీ స్థానానికైనా అక్కరమానిని పంపిస్తుందా ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఈసారి విశాఖ ఎంపీ అభ్యర్ధిగా మరో వ్యక్తిని పార్టీ రంగంలోకి దించబోతుందనే సంకేతాలు తూర్పు నియోజకవర్గం సమన్వకర్త మార్పుతో తేలిపోయింది. ఇంతగా శ్రమించిన అక్కరమాని దారి ఇపుడు ఎటు అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఈ అవమానంతో ఆమె పార్టీలో ఉంటారా..? లేదంటే మారిపోతారా..? కాదూ అంటే తరువాత ఎమ్మెల్సీ ఇచ్చే కార్యక్రమం చేపడతారా..? చూడాలి గ్రూపు రాజకీయాల్లో అక్కరమానిని ఏ విధంగా పార్టీలో స్థానం కల్పిస్తారనేది.