ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఉన్న నిజాయతీ, నిబద్ధతలే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీని 175 స్థానాల్లో గెలిపిస్తాయని టిటిడి చైర్మన్, వైయస్సార్ సిపి ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో మంగళవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. పారదర్శకతతో అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకే నేరుగా పథకాలను అందజేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనన్నారు. రాబోయే ఎన్నికల నాటికి పెన్షన్ ను రూ. 3,000 చేస్తామని చెప్పిన హామీలో భాగంగానే ప్రస్తుతం ఇస్తున్న రూ. 2,500 పెన్షన్ ను రూ. 2,750 చేస్తూ కేబినెట్ లో ఆమోదించారని తెలిపారు. కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలు అమలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని, ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగా చేస్తున్న విమర్శలను సుబ్బారెడ్డి కొట్టిపడేశారు. ఈ వ్యవస్థలో ఏమైనా చిన్నపాటి లోటుపాట్లు ఉంటే సరిచేసి మరింత బలోపేతం చేస్తామన్నారు. పథకాల అమలు విజయంలో వాలంటీర్ల పాత్రను ప్రశంసించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల యువకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నారని చెప్పారు. చేరికలు నిరంతర ప్రక్రియగా అభివర్ణిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.