భవిష్యత్తులో ఇదే రాష్ట్ర కార్యాలయం కావాలి


Ens Balu
24
Visakhapatnam
2022-12-14 17:36:01

విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి నూతన కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. స్థానిక ఎండాడలోని పనోరమా హిల్స్ సమీపంలో సుమారు రెండు ఎకరాల స్థలంలో నిర్మించనున్న కార్యాలయ భవనానికి వైసిపి ఉమ్మడి విశాఖ జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి విడుదల రజని, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే విశాఖపట్నం పరిపాలన రాజధానిగా అవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్మితమవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవిష్యత్ లో రాష్ట్ర పార్టీ కార్యాలయం అవుతుందని  45 నుంచి 60 రోజుల్లో పార్టీ కార్యాలయం మొదటి దశ పనులు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

 పార్టీ కార్యాలయం నిరంతరం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని పార్టీ కార్యాలయాల్లో 24X7 కాల్ సెంటర్లు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.  జనవరిలో భోగాపురం ఎయిర్ పోర్టుకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. అదాని డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే విశాఖలో 40 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక  ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో ఆనందం పంచుతున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజానీకమంతా అండగా ఉండి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ అన్నివిధాలా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.

 తెలుగుదేశం పార్టీ అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించుకుందని, పార్టీ అదే పని చేస్తే పని తప్పుడు ప్రచారం చేస్తూ తమ పార్టీపై బురద జల్లుతున్నారని అమర్నాథ్ విమర్శించారు. ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ ముందుకు సాగడం వల్ల ఇబ్బందులు తప్ప మరేమీ ఉండదని అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయం నిర్మాణ బాధ్యతను కార్యకర్తలు, నాయకులు భుజాన వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉగాది నాటికి ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అమర్నాథ్ లక్ష్యాన్ని నిర్దేశించారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో పార్టీ విజయపతాక ఎగరవేయాలని, దీనికి పునాది విశాఖ నుంచి ప్రారంభం కావాలని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో విశాఖ నగరంలో కోల్పోయిన సీట్లను, ఈసారి మన ఖాతాలో వేసుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు అమర్నాథ్ పిలుపునిచ్చారు. 

విశాఖ  రాష్ట్ర భవిష్యత్తు కాబోతుందని ఆయన అన్నారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి విడదల రజిని మాట్లాడుతూ విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాష్ట్రానికి ఆదర్శం కానుందని పేర్కొన్నారు. పార్టీ ఏర్పాటు చేసి 11 ఏళ్ళు పూర్తి అయి 12వ ఏట అడుగుపెడుతున్న తరుణంలో విశాఖపట్నంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం ముదావహమని అన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఈ కార్యాలయం అందుబాటులో ఉంటూ పార్టీని మరింతగా బలోపేతం చేయడం వచ్చే ఎన్నికల్లో పార్టీ జయకేతనం ఎగురవేయడం, మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టడం లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ విశాఖపట్నంలో పార్టీ కార్యాలయం నిర్మాణం వల్ల ఈ ప్రాంత ప్రజల ఆశలు ఆశయాలు నెరవేరుతాయని తెలిపారు. 

కార్యకర్తల్లో నూతన ఉత్తేజంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింతగా పటిష్టం కానుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి శాసనమండలి సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్,సమన్వయకర్త కె. కె. రాజు,మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ ఎ.రహమాన్, చింతలపూడి వెంకటరామయ్య తిప్పల గురుమూర్తిరెడ్డి,బీసీ కమిషన్ సభ్యులు పక్కి దివాకర్, మాజీ మంత్రి బాలరాజు, దాడి వీరభద్రరావు, దాడి రత్నాకర్,బొల్లవరపు జాన్ వెస్లీ నడింపల్లి కృష్ణంరాజు, సతీష్ వర్మ, కాశీ విశ్వనాథ్, కొల్లి సింహాచలం,రవిరెడ్డి,మంత్రి రాజశేఖర్, భరణికాన రామారావు, బెహరా భాస్కరరావు,వి.వి.ఎన్ ఎం రాజా,పీఎస్ఎన్ రాజు,ద్రోణంరాజు శ్రీవత్సవ,మొల్లి అప్పారావు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.