జనసేన-టిడిపీ పొత్తులపై క్లారిటీ ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి వైపు..?


Ens Balu
155
Tadepalli
2023-01-09 04:25:37

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాజకీయాల్లో రసవత్తర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన-టిడిపి పొత్తులపై ఇద్దరు పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబులు మీడియా ముఖంగా ఒక మోస్తరు క్లారిటీ ఇవ్వడంతో ప్రధాన ఓటు బ్యాంకుగా భావించే ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఒక క్లారిటీ వచ్చినట్టు అయ్యిందని విశ్లేషకులు తొలి అంచనాకు వచ్చారు. ఇప్పటి వరకూ వీరి పొత్తుపైనా, తిరుగుబాటు పైనా క్లారిటీ లేక ప్రభుత్వ ఉద్యోగులు,  ప్రైవేటు ఉద్యోగులు తీవ్రంగా సతమతం అయ్యారని, టిడిపి ఒంటరిగా పోటీచేస్తే వైఎస్సార్సీ పక్కగా గెలుస్తుందని అంచనాలు వేసిన వారంతా నిన్నటి ప్రకటనతో అందరూ ఎటువైపు నిలబడాలనే విషయమై ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారని చెబుతున్నారు. అన్నేళ్ల టిడిపి పాలనలో ఎలాంటి ఇబ్బందులు చవి చూడని ఉద్యోగులు, సిబ్బంది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రివర్స్ పీఆర్సీ, హెచ్ఆర్ఏ, డీఏల కుదింపు, ఉద్యోగులకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్, ఉపాధ్యాయులకు భోదనేతరపనులు, ఉద్యోగులపై ఫ్లైయింగ్ స్వాడ్ నిఘా తదితర అంశాలను చాలా సీరియస్ గానే ఉద్యోగులు తీసుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీచేస్తే రాష్ట్రంలో మార్పు తధ్యమనే సంకేతాలను సామాజిక మాద్యమాల ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చుకుంటున్నారనే వాదన నిన్నటి నుంచే రాష్ట్రంలో వైరల్ అవుతుంది. ఏ ప్రభుత్వంలోనూ ఉద్యోగులు అంతగా ఇబ్బంది పడలేదని.. ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సెలవులు కూడా తీసుకోకుండా పనిచేసినా వేధింపులు, బెదిరింపులు అధికం అవుతున్నాయని అటెండరు నుంచి ఐఏఎస్ వరకూ ఫీలవుతున్నారనే విషయాన్ని ఇపుడు ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారం చేసే పనికి పూనుకుంటారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యతిరేకతగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈసారి తమ ఉద్యోగ వర్గం ఓటు బ్యాంకు ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని కూడా చూస్తున్నారట. మొన్నటి వరకూ ఈ రెండు పార్టీల విషయంలో సందిగ్దత ఉండేదని, ఇపుడు అది క్లియర్ అయిపోవడంతో తాము చేపట్టాల్సిన కార్యాచరణ మొదలు పెట్టినట్టు తెలుస్తున్నది. అలా చేపట్టకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక భయంకరమైన నరకప్రాయం అవుతుందనే సంకేతాన్ని నిన్నటి నుంచే సామాజిక మాద్యమాల ద్వారా 75 ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలియజేస్తున్నారట.వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అధికారులు, క్రిందిస్థాయి సిబ్బంది నుంచి వ్యతిరేకత వ్యక్తం అయినా గ్రామ, వార్డు సచివాలయశాఖ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అటు ప్రభుత్వం కూడా భావిస్తున్నది. వారితోపాటు, గ్రామవాలంటీర్లు, పార్టీ కేడర్, అన్ని సామాజికి వర్గాల కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల దగ్గర నుంచి మద్దతుతోపాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన నిరుపేద లబ్దిదారుల నుంచి పరిపూర్ణ మద్దతుతో సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా 
కూడా అధికారపార్టీలో ఉన్నదని విశ్లేషకులు బలంగానే చెబుతున్నారు.

ఇక గ్రామ, వార్డు సచివాలయ శాఖలో చాలా మంది సిబ్బందికి ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందనే భావనతోనే ఉన్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న తరువాత వెంటనే సర్వీసు రెగ్యులర్ చేస్తామన్న ప్రభుత్వం తొమ్మిది నెలలు అదనంగా అదే రూ.15వేలకే పనిచేయించుకుందని.. పీఆర్సీ అమలు చేస్తున్నామని చెప్పి ఐఆర్ ఇవ్వలేదని, తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేసే సమయంలో హెచ్ఆర్ఏ, డీఏ పూర్తిగా కుదించేసిందనే భావన కూడా ఉద్యోగుల్లో ఉంది. నాటి నుంచి నేటి వరకూ తమ శాఖలోని ఉద్యోగులకు పదోన్నతులు, ఇతర ప్రభుత్వశాఖల మాదిరి ప్రయోజనాలు పొందేందుకు వీలు లేకుండా సర్వీసు రూల్స్ కూడా పొందుపరచలేదనే వాదనను కూడా ఉద్యోగులు తెరపైకి తీసుకు వస్తున్నారు. 

ఈ కారణాలతో కూడా సచివాలయశాఖలోని ఉద్యోగులు చెప్పుకొస్తూ.. ప్రభుత్వ విధానం వలనే చాలా మంది ఉద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని, అధికారుల వేధింపులు కూడా అధికం అయ్యాయని చెబుతున్నారు. ఈ తరుణంలో సచివాలయశాఖ ఉద్యోగుల నుంచి కూడా ప్రభుత్వానికి నిరసన వ్యక్తం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ వెరసీ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యోగు, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు టీడిపి-జనసేస పొత్తు తరువాత ఒక ప్రత్యేక క్లారిటీకి వచ్చే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు..చూడాలి ముందు ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనేది..!