విశాఖ నగర అధ్యక్ష పదవికి వంశీ రాజీనామా..


Ens Balu
1
Visakhapatnam
2021-03-18 15:21:41

విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్ష పదవికి సిహెచ్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ రాజీనామా చేశారు. తనకు పార్టీలో సముచిత స్థానం దక్కకపోవడం వలనే తాను కార్యకర్తల దగ్గర తలఎత్తుకొని తిరగలేని స్థితిలో ఈ రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముందు ప్రకటించారు. గురువారం విశాఖ మేయర్ ఎన్నిక అనంతరం ఆయన  మాట్లాడారు. కేవలం పార్టీలోని అంతర్గత రాజకీయాల వలనే తనను మేయర్ కానీయకుండా అడ్డుకున్నారని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ కి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పదేళ్లుగా పార్టీకోసం కష్టపడి పనిచేసిన తనకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, ఆ తరువాత సముచిత స్థానం కట్టబెడతామని కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీచేయించి గెలిచిన తరువాత తనను కాకుండా మరో వ్యక్తిని మేయర్ నుచేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. మేయర్ పదవి ఇస్తానంటేనే తాను కార్పోరేటర్ గా పోటీచేశానని లేదంటే పోటీకి దిగేవాడిని కాదని అన్నారు. కానీ అనూహ్యంగా మహిళకు మేయర్ పదివిని కట్టబెట్టారని అన్నారు. ఇంత అవమానం జరిగిన తరువాత కార్యకర్తలకు నాయకులకు తాను ఏం సమాధానం చెప్పాల్సి వస్తుందోనని ముందుగానే రాజీనామా చేశానని అన్నారు. ఈవిషయాన్ని నేరుగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ద్రుష్టికి తీసుకెళతానని చెప్పారు. కాగా వంశీకి మేయర్ పదవి ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు జీవిఎంసీ గేటు వద్ద బైటాయించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు పార్టీకి విధేయుడిగా పనిచేసినందుకు పార్టీ ఇచ్చిన బహుమానం ఇదా అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.