నూతక్కి రాజకీయ పాఠశాలలు @ 50


Ens Balu
51
Nutakki
2022-05-25 09:08:22

సరిగ్గా యాభై ఏళ్ల క్రితం .. అంటే 1972 మే నెలలో.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూ డెంలో..గుంటూరు జిల్లా నూతక్కి గ్రామంలో అతి పెద్ద రాజకీయ పాఠశాలలు జరిగాయి..! భారతకమ్యూనిస్టు పార్టీ వాటిని ఏర్పాటు చేసింది. సైద్ధాంతిక ,రాజకీయశిక్షణ  అనేది కమ్యూనిస్టుపార్టీల  జీవితంలో ఒక కీలక అంతర్భాగం. మనరాష్ట్రంలో తొలిదశలో జరిగిన  మంతెనవారిపాలెం , కొత్త పట్నం పాఠశాలలు చారిత్రాత్మకమైనవి. 60 వదశకం  చివరిలో  నరసరావుపేట , మారెళ్ళగుంటపాలెం , సరూర్  నగర్ , కానూరు, కేంద్రాల్లో జరిగిన రాజకీయ పాఠశాలల గురించి పెద్దలు చెబుతుంటే  మేం వింటూ ఉండేవాళ్ళం. 1971 లో మంగళాపురంలో   జరిగిన  రాష్ట్రస్థాయి విద్యార్థి, యువజనపాఠశాలకు రికార్డుస్థాయిలో 424  మంది హాజరయ్యారని  ఆరోజుల్లో అబ్బురంగా  చెప్పుకునేవారు! ఆతర్వాత 1972 మే నెలలో తాడేపల్లిగూడెంలో రాష్ట్ర యువజన రాజకీయపాఠశాల , నూతక్కిలో రాష్ట్ర విద్యార్థి రాజకీయ పాఠశాల జరిగాయి. 1972 మే నెల  8 నుండి 18 వరకూ తాడేపల్లిగూడెంలో  పదిరోజుల  పాటు  జరిగిన యువజన రాజకీయ పాఠశాలకు  850 మందికి  పైగా హాజరయ్యారు. 1972 మే 25 నుండి జూన్ 1 వరకూ నూతక్కిలో   జరిగిన విద్యార్థి పాఠశాలకి  కూడా  దాదాపు  525 మంది హాజరయ్యారు. ఈ పాఠశాలలు జరిగి 2022 మే నెలకు సరిగ్గా  యాభైయేళ్ళు  పూర్తి అయ్యింది. 1972 మార్చ్  లో పదోతరగతి   పరీక్షలురాసిన  నేను 15వ ఏట  తాడేపల్లిగూడెం యువజన పాఠశాలకు , నూతక్కి  విద్యార్థి పాఠశాలకు కూడా హాజరయ్యాను! ఇప్పటికి యాభైఏళ్లు  గడిచినా ఆనాటి ఘటనలు నిన్ననో  మొన్ననో  జరిగాయన్నంత   స్పష్టంగా  నాకు గుర్తున్నాయి! బాల్యంలో పడ్డ ముద్రలు గాఢంగా ఉంటాయనేది నిజమే కదా.

  చలసాని నగర్ నిర్మాణం..
తాడేపల్లిగూడెం పట్టణానికి  రెండున్నర  కిలోమీటర్లదూరంలో విమానాశ్రయం  ఉంది. అది ఉపయోగంలో లేదు. దానికి 2 కిలోమీటర్ల పటిష్టమైన రన్ వే  కూడా ఉంది. రన్ వేకి ఎడా పెడా  ప్రైవేటు పొలాలు తోటలు ఉన్నాయి. వాటిలో  తాడేపల్లిగూడెం పట్టణప్రముఖులు  ఎలిసెట్టి నారాయణమూర్తి గారి తోటఒకటి. ఆతోటకి   రన్ వే కి మధ్యఉన్న విశాలమైన  ఖాళీస్థలంలో రాష్ట్ర యువజన రాజకీయ పాఠశాలను నిర్వహించారు. అందులో "చలసాని వెంకటరత్నం నగర్"  పేరుతో ఒక చిన్నపాటి తాత్కాలిక  గ్రామాన్ని నిర్మించారు. కలప , వెదురుగెడలు  , తాటిఆకు వినియోగించి ఒకేసారి  వెయ్యిమంది కూర్చోవడానికి వీలుగా తరగతులకోసం  పెద్దపాక నిర్మించారు.  200 మంది భోజనం  చేయడానికి   వీలుగా  భోజనశాల నిర్మించారు. వంటశాల  , స్టోర్ గది  , ప్రిన్సిపాల్ కు ఒకటి ,ఆహ్వానసంఘం ఆఫీస్ గా మరొకటి తాటాకు షెడ్లు నిర్మించారు. విద్యార్థులు నిద్రించడానికి వేరుగా మరోమూడు పాకలువేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఒకవేదికను నిర్మించారు. ఆవరణచుట్టూ దడికట్టి గేట్లుపెట్టారు. చలసానినగర్  ప్రధానద్వారానికి   దగ్గరలోనే  భూపతిరాజు వెంకటపతిరాజుగారి  తోటమకాం   ఉండేది. ఆ మకాంలోని  పెంకుటింటిలో యువమహిళలకు వసతి ఏర్పాటు చేశారు. నాడు హాజరైన నలభైమంది యువ మహిళల్లో  చండ్ర  రాజకుమారి  , కిలారు విజయలక్ష్మి  ,  కనపర్తి జ్యోత్స్న , సమత  , ఏ. వనజ  , సంకు మనోరమ , సుజాత ,  నిర్మల  ,లత , కమల  , లాంటి పేర్లు మాత్రం నాకు  గుర్తున్నాయి. యువమహిళల బసదగ్గర , చలసాని నగర్ దగ్గర నిర్వాహకులు  రెండు మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.  బైటివారు ప్రవేశించకుండా 24 గంటల సెక్యూరిటీ కోసం గేట్లదగ్గర  రెడ్ గార్డ్ లను ఏర్పాటు చేశారు. ఎలిసెట్టి  నారాయణమూర్తి  గారి తోటలో  బోరింగు దగ్గరి టాంక్ నుండి ఐదడుగుల ఎత్తున   పైపులైన్ వేసి ఒకేసారి వందమంది స్నానం చేయడానికి వీలుగా   పంపులు బిగించారు. వాడకంనీరు ఎలిసెట్టి నారాయణ మూర్తి గారి కొబ్బరితోటలోకి  పోయేటట్లు నీటిబోదెలు ఏర్పాటు చేశారు.  విద్యుత్ మోటారుకు తోడుగా , జనరేటర్లు కూడా పెట్టారు. 

ఆవరణలో , పాకల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఆవరణకు కొద్దిపాటి దూరంలో  ఒక యాభైవరకూ  తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. నాటి ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి  , పార్టీ రాష్ట్ర  కార్యదర్శివర్గ  సభ్యుడు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు  ఎం.వి.ఎన్.కపర్ధి గారు అధ్యక్షుడు  గా ,సి.పి.ఐ.జిల్లా  సహాయకార్యదర్శి  ఇందుకూరి  సుబ్బరాజు గారు ప్రధాన కార్యదర్శిగా ఆహ్వాననసంఘం   ఏర్పడింది. పార్టీ జిల్లాకార్యదర్శి , ఆనాటి పెనుగొండ  శాసనసభ్యుడు వంక  సత్యనారాయణ ,జిల్లాపార్టీలో  దిగ్గజాలు  మాజీ ఎమ్మెల్సీ  సంకు అప్పారావు , భూపతిరాజు మణ్యం , కలిదిండి భీమరాజు , మారెళ్ళ నరసింహారావు , మాజీ ఎమ్మెల్యే  అత్తలూరి సర్వేశ్వరరావు  , మాజీ ఎంపి కోండ్రు సుబ్బారావు , పులవర్తి  విజయ  సారథి , డి.వి.వి.ఎస్.వర్మ , ఐ.ఎస్. రాజు , జల్లేపల్లి వెంకటరాజు , చేకూరి భద్రిరాజు , కంచనకాశీ  విశ్వనాథరావు , పూడి అప్పలస్వామి , బోడపాటి వెంకటరెడ్డి నాయుడు  , ఇందుకూరి  సుబ్బరాజు  (జూనియర్ )  ఆహ్వానసంఘం సభ్యులుగా  ఉన్నారు. మొత్తం క్యాంపు నిర్వహణా సమన్వయబాధ్యత సంకు అప్పారావు గారు చూసారు. వంక సత్యనారాయణ ప్రిన్సిపాల్ గా , డి వి.వి.ఎస్. వర్మ వైస్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. వంటల  బాధ్యతలు పార్టీ సీనియర్ నేత  యాళ్ళబండి  పోలిశెట్టి చూసుకున్నారు. తాడేపల్లిగూడెంలో పేరుపొందిన అతిపెద్దహోటల్   మోడరన్ కేఫ్ యజమాని ,  పార్టీ అభిమాని పైబోయిన సోమయ్య గారు వంటమనుషులను  ఏర్పాటుచేసి  రోజూవచ్చి  పర్యవేక్షణ చేసారు. ఆనాటి మహిళాసంఘం  నేతలు మందలపర్తిశేషమ్మ  , దూసనపూడి  సుబ్బాయమ్మ , యాళ్ళబండి పుణ్యవతి , కాళ్ళధనలక్ష్మి  , మద్ది  సీతమ్మ  , గాదంసెట్టి సత్తెమ్మ  , కాకర్ల అనసూయమ్మ ,  వంటివారు పాఠశాల కోసం  ఆవకాయ పచ్చడి పట్టడం  మాఅందరి  ఇళ్ళలో ఒక గట్టిజ్ఞాపకం!
ఆ పదిరోజులూ వాళ్ళు క్యాంపు దగ్గరికి   వచ్చి వంటల తీరు తెన్నులను గమనించి సూచనలు చేస్తూ ఉండేవారు. తాలూకా పార్టీ సీనియర్ నేత  మద్ది శేషయ్య   స్టోర్స్ బాధ్యతలు చేపట్టి  సరఫరాలను  చూసుకున్నారు.పార్టీ స్థానికనేతలు  దూసనపూడి విరాటరాజు  , యాళ్ళబండి రంగనాయకులు  , పిచ్చా  వెంకటరత్నం  , కాకర్ల సూర్య  ప్రకాశరావు  , సుంకవల్లి  రాజగోపాలరావు   ,  కోరాడగోపాలం   , జాన లక్ష్మణరావు  , పాబోలు  పాపారావు  , దూలం  కృష్ణారావు  , కాళ్ళ  చంద్రరావు , ప్రత్తి బ్రహ్మన్న , దింటకుర్తి మాలకొండయ్య , బత్తుల కృష్ణ , సోమరాజు  లాంటివారు వివిధపనుల్లో  ఆహ్వానసంఘానికి తోడ్పడ్డారు.

పశ్చిమగోదావరి   జిల్లానుండి క్లాసుల్లో  పాల్గొన్నవారిలో  అప్పటికి   యువజన , విద్యార్థి నాయకులుగా  ఉన్న  మందలపర్తి శ్రీపతి  , వైట్ల  వెంకటనారాయణ  , దుగ్గిరాల  గోపాలకృష్ణ  , వడ్డీ వెంకట్రావు , ఆత్కూరి రాయుడు , నెక్కంటి  సుబ్బారావు  , గంధం  ధనంజయ  , బి. కరుణకుమార్ , ఎస్ .సంజీవరావు  , కార్టూనిస్ట్  మోహన్  , పాములపాటి  మాధవరెడ్డి , కొనగళ్ళ రామారావు , ఆకుల  సత్యనారాయణ , గెడా విప్లవరావు,  ఎస్. సూర్యకుమార్  ,  మాదాసు  పుల్లారావు , పొట్టి సూర్యనారాయణ , అబ్బాస్  ,అల్లు కృష్ణారెడ్డి , జి.ఎన్.ఆర్. శంకర్  , యాళ్ళబండి రాజేంద్రప్రసాద్ , మద్దాల  వెంకటరెడ్డి  , గగారిన్   , మద్ది తమ్మారావు  ,  సోమేశ్వరరావు , సత్యారావు ,  నాసర్లరాజా  , కంచుస్తంభం  సత్యన్నారాయణ  , గోగులమండ  స్టాలిన్  , కాళ్ళ  నారాయణరావు  ,  మందలపర్తి జగన్ మోహన్   లాంటి  పేర్లు నాకు గుర్తున్నాయి. అప్పటికి బొత్తిగా  హైస్కూల్  కుర్ర  బ్యాచ్ గా ఉన్న మందలపర్తి  కిషోర్ , కాకర్ల చంద్రశేఖర్  , వంకా  మోహన్ , మాకంటే  ఇంకా  బాగా  చిన్నవాడైన పదకొండేళ్ల   వంక  రవి  కూడా మాతోపాటు  ఈ క్లాసుల్లో  పాల్గొన్నారు. కవి , సీనియర్ పాత్రికేయుడు  మందలపర్తి కిషోర్ కీ నాకూ  స్నేహం కుదిరింది తాడేపల్లిగూడెం క్లాసుల్లోనే!
ఓ పదేళ్ల తర్వాత  మా చెల్లి వాణీదేవి తో కిషోర్ వివాహం జరగడంతో మాకు బంధుత్వం కుదిరినా దానికంటే  మా  స్నేహమే బలమైనదని చెప్పాలి.

  1972 మే 8 న ప్రారంభం !
7వ తేదీ రాత్రికి , 8 వ తేదీ  ఉదయానికే  సుమారు 500 మంది ప్రతినిధులు తాడేపల్లిగూడెం చేరుకున్నారు. 8 వ తేదీ రోజంతా  ప్రతినిధుల ప్రవాహం కొనసాగింది. సాయంత్రానికి సంఖ్య 600 దాటింది. ప్రతినిధులకు వసతి సరిపోదని ఆ రాత్రికి రాత్రి మరో 250 మందికి సరిపడా ఒక పెద్ద తాటాకు షెడ్ ను ఆహ్వానసంఘం నిర్మించింది. "ఆ పాకల   నిర్మాణానికి గెడలెత్తిన  కూలీల్లో"  నేనూ ఒకణ్ణి. పాల్గొంటున్న ప్రతీ ఒక్కరికీ ఒక తాటాకుచాప ,అల్యూమినియం ప్లేటు ,గ్లాసు , తాటాకు విసనకర్ర ఇచ్చారు. క్లాసులు అయిపోయాక  ఇంటికి తీసుకుపోవచ్చని  ఇచ్చేటప్పుడే   చెప్పి వాటిని జాగ్రత్త పెట్టుకోవాలని  ఆహ్వానసంఘం వారు కోరారు. ప్రతినిధులకు ఒక నోటు బుక్కును , పెన్నును  ఇచ్చారు. జిల్లాల వారీగా  బసను కేటాయించి ఆ మేరకు బోర్డులు  ఏర్పాటు చేశారు. 9 వ తేదీకి మొత్తం  ప్రతినిధుల  సంఖ్య  750 దాటిపోయింది. రాష్ట్ర యువజనసమాఖ్య  నాయకులతో స్కూల్ నిర్వహణా  కమిటీని  ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఆకమిటీలో  యువజనసమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు  నల్లూరి వెంకటేశ్వర్లు  ,ప్రధాన కార్యదర్శి  కే. ప్రతాపరెడ్డి  , కార్యదర్శి ఏ.పుల్లారెడ్డి , బి.స్టాలిన్ బాబు , డి.వి.వి.ఎస్.వర్మ , ఎం.కాళిదాసు , సి.మాలకొండయ్య , వై. బీ.శంకర రావు , బి. కరుణకుమార్  , ఎస్. నాగేశ్వరరావు ,  బాపురెడ్డి , జిడ్డు సూర్యనారాయణ  , టి.నారాయణ ,  మణ్యం , చండ్ర రాజకుమారి , కే. జ్యోత్స్న  ఉన్నారు. ఇంకా కొన్ని ఉపసంఘాలు కూడా ఏర్పాటు చేశారు. 8 వ తేదీ సాయంత్రం 4 గంటలకు జిల్లా పార్టీ సీనియర్ నేత  ఇందుకూరి సుబ్బరాజు అరుణపతాకాన్ని  ఎగురవేయడంతో   క్లాసులు  ప్రారంభం  అయ్యాయి. 

వక్తలను వైస్ ప్రిన్సిపాల్  డి.వి.వి.ఎస్.వర్మ వేదికపైకి ఆహ్వానించగా   ప్రిన్సిపాల్ వంక సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఆహ్వానసంఘం  అధ్యక్షుడు ఎం.వి.ఎన్. కపర్ధి స్వాగతం పలికారు. రాష్ట్రపార్టీ కార్యదర్శి   తమ్మారెడ్డి సత్యనారాయణ పాఠశాలను ప్రారంభించారు. క్లాసులు జరిగే విధానం టైమ్ టేబుల్ వంటి వివరాలను యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రతాపరెడ్డి తెలియచేశారు. క్లాసులనిర్వహణకు ఏర్పాటు చేసిన  కమిటీనీ , వేర్వేరు  బాధ్యతల  కోసం వేసిన  ఉపసంఘాలనూ ప్రతాపరెడ్డి ప్రకటించారు. మర్నాటి నుండి క్లాసులు మొదలయ్యాయి. "మార్క్సిస్టు తత్వశాస్త్రం , జాతీయ విముక్తి పోరాటాలు" అంశాన్ని ఈడ్పుగంటి నాగేశ్వరరావు , "రాజకీయ అర్థశాస్త్రం" అంశాన్ని వై.విజయ్ కుమార్ , "ప్రపంచ విప్లవోద్యమ చరిత్ర" అంశాన్ని తమ్మారెడ్డి సత్యనారాయణ , "భారత స్వాతంత్ర్య పోరాటచరిత్ర" అంశాన్ని వేములపల్లి శ్రీకృష్ణ , "మావోయిజం , నక్సలిజం , భారత కమ్యూనిస్టుపార్టీ కార్యక్రమం" అంశాన్ని నీలం రాజశేఖరరెడ్డి , "కమ్యూనిస్టుపార్టీ చీలిక ,మార్క్సిస్ట్ పార్టీ పంథా"  అంశంపై నల్లమల గిరిప్రసాద్ , "జనసంఘ్ - అభివృద్ధి నిరోధకపంథా"  అంశాన్ని కే.ఎల్.మహేంద్ర , "వ్యవసాయరంగ  సమస్యలు" అంశాన్ని వై.వి.కృష్ణారావు , "తెలంగాణా సాయుధపోరాట చరిత్ర" అంశాన్ని డా.రాజ్ బహదూర్ గౌడ్ , "కమ్యూనిస్టుపార్టీ నిర్మాణం" అంశాన్ని ఎం.వి.ఎన్.కపర్ధి , "యువజన సమాఖ్య కార్యక్రమం" అంశాన్ని సురవరం సుధాకరరెడ్డి బోధించారు. పాఠశాల జరిగే  సమయానికి  వియత్నాం విముక్తియుద్ధం  కీలకదశకు  చేరుకున్నది. ఒక రేవుపట్టణం విముక్తి సైన్యం చేతికి చిక్కినట్లు ఒకరోజు పాఠశాలకు  వార్త వచ్చింది. దాంతో తరగతుల్లో ఉత్సాహం పెల్లుబికింది. "వియత్నాం కీ భాయియోం హమ్ తుమారే సాత్  హై"  నినాదాలు మారుమోగాయి.

 కర్రసాములోనూ  శిక్షణ !

పాఠశాల జరిగిన పదిరోజులూ ప్రతీ   సాయంత్రం 5 గంటలకు కవాతు , కర్రసాములో శిక్షణ ఇచ్చారు. జిల్లాలవారీగా  ప్రతినిధులను  విభజించి  ఒక్కొక్క  బృందానికి  ఒక్కో  ఇన్ స్ట్రక్టర్  ను ఏర్పాటు చేశారు. టి.నారాయణ , స్టాలిన్ బాబు , ప్రతాపరెడ్డి , చింతలపూడి రాములు , రామారావు , సత్యపాల్ రెడ్డి , వి.చంద్రం , సి. యాదిరెడ్డి , సమత ,  కమాండర్ లుగా వ్యవహరించారు.
పశ్చిమగోదావరి జిల్లా బృందానికి ఇందుకూరి సుబ్బరాజు  నేతృత్వంలో  నెక్కంటి  సుబ్బారావు , గంధం ధనంజయ , కరుణకుమార్ లాంటి వారు ఇన్ స్త్రక్టర్లు గా వ్యవహరించారు. సాయంత్రం అయ్యేసరికి  విమానాశ్రయం రన్ వే మీద వందలాదిమంది యువతీ యువకులు కవాతు , కర్రసాము , నేర్చుకుంటూ ఉంటే ఆ దృశ్యాన్ని  చూడ్డానికి తాడేపల్లిగూడెం పట్టణం నుండి  ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. కవాతు చేసేటప్పుడు అందరూ గొంతెత్తి మార్చింగ్ సాంగ్ పాడేవారు. "జై జై జై అరుణపతాకకుజై.. వేగరావోయ్  కార్మికా.. వేగరావోయ్  కర్షకా.. ఎత్తినజెండా  దించకోయ్  , అరుణపతాకకు జై .. కత్తులు దూసుకుపోయినా .. నెత్తురు టేరులు  పారినా.. బాంబుల వర్షం కురిసినా .. బారు ఫిరంగులు మ్రోగినా  ... ఎత్తినజెండా దించకోయ్ ...
అరుణపతాకకు  జై  అనే మార్చింగ్ సాంగ్  ఆ పదిరోజులూ  విమానాశ్రయం మీద  మారుమ్రోగిపోయింది. బృందాలవారీగా మార్చింగ్ చేస్తూ రన్ వే మీద అటూ ఇటూ కదం తొక్కుతుంటే ఆర్మీ కాలమ్స్ కదులుతున్నట్లు ఉండేది. విజిళ్ళు  , బూట్లచప్పుడు  , లాఠీ  సౌండ్లు  కమాండర్ల   అరుపులతో   అక్కడ  నిజంగానే   ఆర్మీట్రైనింగ్  జరిగిపోతున్నట్లుగా    ప్రజలు భావించేవారు!
లెఫ్ట్  రైట్  లెఫ్ట్  అంటూ కవాతు నేర్పుతూ   కమాండర్లు    అప్పట్లో కొన్ని చిత్రమైన  నినాదాలు ఇచ్చేవారు. వాటిల్లో   రెండు  నినాదాలు నాకు  బాగా గుర్తున్నాయి. సి.ఆర్., ఎన్.ఆర్., తమ్మారెడ్డి  ,ఎస్. ఏ. డాంగే  జిందాబాద్ , జిందాబాద్. ఎం.ఎన్., టి.వి., అచ్యుత మీనన్  , ఎస్. ఏ. డాంగే , జిందాబాద్ జిందాబాద్. తేరానామ్   మేరానామ్   వియత్నామ్  .. వియత్నామ్.. రెండుగంటల  లాఠీశిక్షణ  తర్వాత మొత్తం విద్యార్థులంతా  క్యాంపు లోకిచేరి స్నానాలు ముగించేవారు. కాస్సేపు ఆరోజు జరిగిన పాఠ్యాంశం పై జిల్లాలవారీ చర్చలు జరిగేవి. ఆ తర్వాత సాంస్కృతిక వేదిక దగ్గర చేరేవారు. భోజనాలు ఓపక్కన నడుస్తూ ఉండేవి. మరోపక్కన సాంస్కృతిక కార్యక్రమాలు  జరుగుతూ ఉండేవి.

   సాంస్కృతిక ప్రదర్శనలు
ప్రతిరాత్రి పాటలు , నృత్యాలు , బుర్రకథలు , గొల్లసుద్దులు  , నాటికలు , నాటకాలు , కవితా పఠనం , ఏక పాత్రలు , స్కిట్లు ,  వేసేవారు. అప్పట్లో ప్రకాశంజిల్లా  నుండి అన్న నల్లూరితో  వచ్చిన బృందంలో  సినీ  నటుడు   ఈశ్వరరావు ,మాదాల రంగారావు , టి.కృష్ణ వంటివాళ్ళు ఉన్నారు. సంభవామి యుగే యుగే , రాజీనామా , నాటికలు వాళ్ళువేయడం గుర్తుంది. ఏటుకూరి ప్రసాద్ గారి ఎర్ర జెండేరా తమ్ముడా , ఎర్ర జెండేరా లాంటి పాటలు క్యాంపులో ప్రతిధ్వనించేవి. వరంగల్ నుండి వచ్చిన జి.వై.గిరి కంజర వాయిస్తూ  "రిక్షావాలా.. ఓహో రిక్షావాలా" అంటూ హృదయం ద్రవించే పాటఒకటి పాడేవాడు. అందరూ ఆయన్ని అడిగి మరీ పాటలు పాడించుకునే వారు. "మళ్ళీ ఇంకోసారి  నేను  మంత్రినయ్యాను .. ఆవుదూడ బొమ్మ  అడ్డు పెట్టుకొని  గెలిచాను"
అంటూ అదృష్టదీపక్  పాడేపాట  అప్పట్లో పెద్ద హిట్. "కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు" పాటని కూడా అదృష్ట  దీపక్  బాగా పాడేవారు. "సోవియట్ల దేశమా ...సమతా సందేశమా .. ఆంధ్రజాతి విప్లవాభి  వందనాలు ... అందుకో"  అనే పాట ఒకటి ప్రతిరోజూ వినపడేది. "ఎవరిదీ ఎక్కువ కులమూ ,ఎవరిదీ తక్కువ కులమూ" ,అనే పాట , "లాగరో హైలెస్సా" అనే రోడ్ రోలరు పాట, ఎవరో ఒకరు పాడేవారు. ఒక యువమహిళా కామ్రేడ్ " అంతే నాకు చాలు ,తమలపాకు తోడిమే పదివేలు" అంటూ ఒక జానపద గేయం పాడటం కూడా  గుర్తుంది. జర్నలిస్ట్ జి. వీరా ఏక పాత్రాభినయం చేయడం , జర్నలిస్టు , కవీ  కే.రాజేశ్వరరావు ఆధ్వర్యంలో యువకవి సమ్మేళనం జరగడం కూడా నాకు గుర్తున్నాయి. గొల్లసుద్దులు  కళారూపాన్ని  నేను తొలిసారిగా  అప్పుడేచూసాను. సభలో జనం మధ్యకూచున్న కళాకారులు ఒకర్ని ఒకరు గొంతెత్తి  పిలుస్తూ లేచివెళ్ళి  వేదికఎక్కడం  చూసి అప్పట్లో థ్రిల్ అయిపోయాను. ఆబృందం  22 రకాల   స్టెప్స్  వేయడాన్ని  లెక్కపెట్టి  కిషోర్ , నేనూ  ఆశ్చర్యపోయాం. ఒకాయన  మహాప్రస్థానం  కవితలకు బాణీలుకట్టి పాడుతూ ఉండేవారు. 


రాత్రి  ఒంటిగంట  వరకూ ప్రదర్శనలు   కొనసాగుతూనే  ఉండేవి. పాఠశాల నిర్వాహకులు  ఇక చాలు  ముగించండి అంటూ విజిల్స్ ఊదేవారు. అయినా వినకుండా  కళాకారులు రెండింటివరకూ  ప్రదర్శనలు కొనసాగించేవారు. తెల్లవారు ఝామున ఏ నాలుగింటికో  మళ్ళీ కోలాహలం మొదలయ్యేది. ఉదయం కొందరు  కసరత్తులు  , సాముగరిడీలు   చేసేవారు. కొందరు కబడీ , వాలీబాల్ , బ్యాడ్మింటన్ ఆడేవారు. ఆ పదిరోజులూ అది ఒక "మరో ప్రపంచం" అని చెప్పాలి. పాఠశాల ముగింపు సందర్భంగా మే 17 వ తేదీ సాయంత్రం తాడేపల్లిగూడెంలో  భారీర్యాలీ  జరిగింది. పాఠశాల విద్యార్థులు పదిరోజులూ నేర్చుకున్న  కవాతుచేస్తూ కొన్ని సెంటర్లలో లాఠీవిన్యాసాలు ప్రదర్శించారు. కళాకారులు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ పాల్గొన్నారు. మునిసిపల్ టౌన్ హాల్ ఎదుటి  ఖాళీస్థలంలో  జరిగిన బహిరంగసభ  లో సి.పి.ఐ. ప్రధానకార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు గారు ప్రధానవక్తగా  పాల్గొన్నారు. సభకు  నాలుగువేలమంది  హాజరయ్యారు. రాష్ట్ర రైతుసంఘం  ఉపాధ్యక్షుడు  సంకుఅప్పారావు  అధ్యక్షత  వహించారు. సభలో కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు  నీలం రాజశేఖరరెడ్డి ,జిల్లాకార్యదర్శి  వంక సత్యనారాయణ ,సహాయ కార్యదర్శి  ఇందుకూరి సుబ్బరాజు , ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.ఎన్ కపర్థి , రాష్ట్ర యువజనసమాఖ్య  ప్రధానకార్యదర్శి  కే. ప్రతాపరెడ్డి ప్రసంగించారు. 17 వ తేదీ ఉదయమే  చండ్ర రాజేశ్వరరావు గారు రాజకీయ పాఠశాలను సందర్శించారు. 850 మంది పాల్గొనడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వియత్నాం పోరాట  తాజా  విజయాలు , బంగ్లాదేశ్  విముక్తి , సోవియెట్  తో  భారత్ సంబంధాలు   , కేరళలో   అచ్యుత మీనన్  ప్రభుత్వ  ప్రజాసంక్షేమ చర్యలు  ,  మణిపూర్ , బీహార్  , పంజాబ్  రాష్ట్రాలలో    పార్టీ చేస్తున్న  పోరాటాలను   ప్రస్తావిస్తూ  ఆయన  సందేశం  ఇచ్చారు. పాఠశాలలో జరిగిన వివిధ పోటీలలో గెలుపొందిన వారికి రాజేశ్వరరావు గారి చేతులమీదుగా బహుమతులను అందజేశారు. ఆహ్వాన సంఘం పెద్దలకు యువజన సమాఖ్య తరపున అరుణ పతాకాలను బహూకరించారు.

 పెనుగాలుల  బీభత్సం  !

17 వ తేదీ రాత్రి బహిరంగసభ ముగిసిన అనంతరం  చాలామంది టౌన్ నుండే నేరుగా  తమతమ స్వస్థలాలకు  తిరుగుప్రయాణం అయ్యారు. మిగిలినవారు తిరిగి చలసాని నగర్ కు చేరుకున్నారు. ఆరాత్రి  పెనుగాలులతో  భారీవర్షం   కురవడంతో  పాఠశాలకోసం   వేసిన భారీపాకలు  ఒరిగిపోయాయి. కొన్ని కూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆరాత్రి పెట్రోమాక్స్ లైట్లను తెచ్చి భోజనాలు వడ్డించారు. చీకటిలో  ,వర్షంలో  అలాగే బిక్కు బిక్కుమంటూ గడిపాం. విద్యార్థులకు పంపిణీ చేయడానికి తెచ్చిన సాహిత్యం తడిసిపోకుండా  టార్పాలిన్ కప్పి జాగ్రత్తచేశాం. తడిసిన పుస్తకాలను  మర్నాడు ఎండలో ఆరబెట్టాం. వైస్  ప్రిన్సిపాల్   వర్మగారు దగ్గర  ఉండి   మొత్తం పుస్తకాలను పంపిణీ చేయించారు.

  కొన్ని విశేషాలు !

అనుకున్న దానికంటే ప్రతినిధుల సంఖ్య పెరిగిపోవడంతో తాడేపల్లిగూడెం రాజకీయపాఠశాల  ప్రవేశానికి  గడువు ముగిసిందనీ , ఎవరువచ్చినా ప్రవేశం ఉండదని    ప్రిన్సిపాల్ వంక సత్యనారాయణ మే 9 న  ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆరోజుల్లో విశాలాంధ్ర మొదటిపేజీలో దాన్ని వేశారు.  1972 లో  కొండేపి నియోజకవర్గం నుండి సి.పి.ఐ. తరపున  ఎమ్మెల్యేగా  ఎన్నికైన యువజనసమాఖ్య నాయకుడు  దివి శంకరయ్య గారు పాఠశాలకు ఒకరోజు ఆలస్యంగా వచ్చారు. ఆలస్యానికి బహిరంగ క్షమాపణ చెప్పాకనే ఆయన్ని  క్లాసులోకి  రానిచ్చారు.  పాఠశాలలో పారిశుద్ధ్యం - ఆరోగ్యం పరిరక్షణ కోసం ఒక ఉపసంఘం పనిచేసింది. దాని కన్వీనర్ మాలకొండయ్య గారు ప్రతిరోజూ ప్రాంగణాన్ని శుభ్రం  చేయడానికి  కార్యకర్తల సహాయంతో మంచి కృషి చేశారు!
స్థానికులుగా ఆ పనికి మేం సాయం చేస్తుండే వాళ్ళం.  పొద్దున్నే  చలసానినగర్లో  ప్రతిరోజూ  విశాలాంధ్ర  దినపత్రికను అమ్మడానికి నేనూ , కిషోర్ , వంక రవి పోటీపడేవాళ్ళం. అప్పట్లో విశాలాంధ్ర  దినపత్రిక   ఖరీదు 15 పైసలు. మేం రోజూ  ఆరురూపాయల  నుండి ఎనిమిది రూపాయలు  అమ్మేవాళ్ళం.  తెలుపునిక్కరు  ,తెలుపు  టీషర్ట్  ధరించిన  కే.ప్రతాపరెడ్డి గారు   మెడలో  కెమెరాతో  తిరుగుతూ కనిపించేవారు. వివిధబృందాలు  ఆయన్ని అడిగి ఫోటోలు  తీయించుకుంటూ ఉండేవి. 

 నూతక్కి విద్యార్థి పాఠశాల !

మే 25 నుండి జూన్ 1 వరకూ ఎనిమిది రోజులపాటు విద్యార్థి రాజకీయ పాఠశాల గుంటూరు జిల్లా నూతక్కిలో జరిగింది. దానికి 525మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రారంభసభకు    సి.పి.ఐ. కేంద్ర   కార్యదర్శివర్గసభ్యుడు   ఎన్.కే. కృష్ణన్  హాజరయ్యారు. సురవరం సుధాకరరెడ్డి గారు  ప్రిన్సిపాల్ గా , ఆలా నాగేశ్వరరావు గారు  వైస్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. "విప్లవ తత్వశాస్త్ర ఆవశ్యకత" అంశంపై రాంభట్ల కృష్ణమూర్తి , "భారతదేశం  ఎందుకు పేద దేశం అయ్యింది , సమస్యలు పరిష్కారాలు" అంశంపై తమ్మారెడ్డి సత్యనారాయణ , "స్వాతంత్ర్య పోరాటం" అంశంపై సురవరం సుధాకరరెడ్డి , "ఆచరణలో సోషలిజం, సోవియెట్ వాస్తవికత" అంశంపై వై.విజయకుమార్ , "ప్రస్తుత రాజకీయ పరిస్థితి  - కాంగ్రెస్ పాలన స్వభావం" అంశంపై , "నక్సలైట్లు - ఆచరణ" అంశంపై నీలం రాజశేఖరరెడ్డి , "సిపిఎం పంథా" అంశంపై ," పెట్టుబడిదారీ  శిబిరం - సోషలిస్టు శిబిరం" అంశంపై వేములపల్లి శ్రీకృష్ణ , "విప్లవం అంటే ఏమిటి ? ఫ్రెంచ్ ,అమెరికా , సోవియట్ ,చైనా , క్యూబా విప్లవాలు " అంశంపై , "మార్క్స్ ,ఎంగెల్స్ , లెనిన్ , డిమిట్రావ్ విప్లవకారుల జీవితం" అంశంపై  ఈడ్పుగంటి  నాగేశ్వరరావు , "తెలంగాణా సాయుధపోరాటం" అంశంపై డా.రాజ్ బహదూర్  గౌడ్  , "భూసంస్కరణలు , వ్యవసాయం" అంశంపై ," కమ్యూనిస్టు పార్టీ అంటే ఏమిటి , దాని స్వభావం  ఏమిటి" అంశంపై గుజ్జుల  యల్లమందారెడ్డి ,  "విద్యార్థి ఉద్యమసమస్యలు" అంశంపై సురవరం సుధాకరరెడ్డి బోధించారు. విద్యార్థులకు నూతక్కి హైస్కూల్ గదుల్లో  బస ఏర్పాటు చేశారు. హైస్కూల్ ఆవరణలో క్లాసులు జరపడానికి 500 మందికి సరిపడా ఒకటే  పెద్దతాటాకుపందిరి వేశారు. రోహిణీకార్తె  ఎండలకి   ఇబ్బందిగా  ఉండేది. దాంతో ఉదయం , సాయంత్రం బుంగలతో నీళ్ళు తెచ్చి  పందిరిపై చల్లి ఉపశమనం కలిగించేవారు!
ప్రతిరోజూ ఉదయం కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ హిందీ  పాట పాడటంతో క్లాసుమొదలయ్యేది. "ఉఠ్  జాగ్ ఓ భూకే  బందీ   అబ్ ఖీంచ్ లాల్ తల్వార్ కబ్ తక్ సహోగీ భాయీ  
జాలీమ్  కా అత్యాచార్ " అంటూసాగే  ఆపాటని  500 మంది ఒకేసారి  గొంతెత్తి   పాడుతుంటే  ఉద్వేగంగానూ, ఉత్తేజంగానూ  ఉండేది. యాభైఏళ్లు  గడిచినా ఆ బృందగానం ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే   ఉంది. అక్కడకూడా ఎనిమిదిరోజులూ కవాతు ,కర్రసాము నేర్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా  ఉర్రూతలూగించాయి. తాడేపల్లిగూడెం నుండి యాళ్ళబండి రాజేంద్రప్రసాద్ , యాళ్లబండి రామకృష్ణ   పరమహంస , జాన ప్రసాదరావు ,  నేనూ , హాజరయ్యాం.

నూతక్కిపాఠశాలలో  మాకు బాగా గుర్తున్న  విషయం  వై.చెంచయ్య గారి వివాహం. గాయకుడు గని  వెలుగులోకి వచ్చింది కూడా అక్కడే. నూతక్కి క్లాసుల ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభకు ఖమ్మంజిల్లా నుండి శాసనసభ్యుడు మహమ్మద్ రజబ్ ఆలి , శాసనసభ్యుడు  వేములపల్లి శ్రీకృష్ణ వక్తలుగా హాజరయ్యారు. నూతక్కి పాఠశాల తర్వాత కూడా రాష్ట్రస్థాయి పాఠశాలల పరంపర  కొనసాగింది. 1974 ,75 ,76 సంవత్సరాలలో తెనాలి, రేవేంద్రపాడు,  రాజమండ్రి పెనుగంచిప్రోలు వంటిచొట్ల విద్యార్థి యువజన కార్యకర్తలకు పెద్ద స్థాయిలోనే పాఠశాలలు జరిగాయి. వాటికి కూడా ఐదారు  వందలమంది తగ్గకుండా హాజరు అయ్యారు. పార్టీకి అప్పట్లో సమీకరణ సామర్థ్యం గట్టిగా ఉంది. భారీస్థాయిలో పాఠశాల  నిర్వహణకు ఆర్ధికవనరుల సమీకరణ ఒకఎత్తు అయితే పదిరోజులపాటు వందలాది మంది కోసం  క్యాంపు నిర్వహించడానికి కార్యకర్తలను  సమీకరించడం  మరోఎత్తు. తాడేపల్లిగూడెం పాఠశాలకు నమోదైన  ప్రతినిధులు  750 మందే  అయినా , స్థానికులు మరో  వందమంది ఆసక్తిగావచ్చి  క్లాసుల్లో  కూర్చునేవారు. వారికి  వివిధరకాల  సేవలు అందించడానికి  దాదాపు 150 మంది వాలంటీర్లు కూడా  నెలరోజులు  పనిచేశారు. ఆరోజుల్లో పార్టీకిఉన్న సమీకరణ శక్తికి  ఈపాఠశాలలు ఒకరుజువు. నిర్మాణదక్షత  , నిర్వహణా సామర్ధ్యం పుష్కలంగా ఉండటం కారణంగానే ఇంత భారీపాఠశాలలు నిర్వహించగలిగారు. తర్వాత పరిస్థితుల్లో సహజంగానే మార్పులు వచ్చాయి. 

శిక్షణా కార్యక్రమాల పద్దతి మారింది. జిల్లాస్థాయిలో మూడు, నాలుగురోజుల  పాఠశాలలు వచ్చాయి. అందులో అంశాలపై  ప్రాథమిక పరిచయం మాత్రమే ఉంటున్నది. తర్వాతిస్థాయిలో   పదిరోజుల  శిక్షణ వచ్చింది. వాటిల్లో అంశాలపై లోతయిన వివరణ ఉండేది. ఆ తర్వాత  విద్యార్థులకు 20 నుండి 25 రోజులు , పార్టీ కార్యకర్తలకు 40 రోజుల  శిక్షణ వచ్చింది.  అందులో అధ్యయనానికి  చర్చకు ప్రాముఖ్యం ఉండేది. అవి హైదరాబాద్ లోని మఖ్దూం భవన్ లో జరిగేవి. పైనుండి  కిందవరకూ   సైద్ధాంతిక  శిక్షణాకార్యక్రమాలకోసం సంస్థాగతంగా ఏర్పాట్లుచేసిన  ఘనత నీలం  రాజశేఖరరెడ్డి  గారికి దక్కుతుందనీ , ఆయన పట్టువదలని  విక్రమార్కుడిలా  కృషిచేశారనీ  , జాతీయస్థాయిలో  గంగాధర అధికారి , భవానీసేన్ , మోహిత్ సేన్ ,వంటి వారు సైద్ధాంతిక శిక్షణకు బాధ్యత వహించారని పెద్దలు ఈడ్పుగంటి నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడిన సందర్భంలో చెప్పారు. తాడేపల్లిగూడెం , నూతక్కి రాజకీయ పాఠశాలలు నిర్వహించి 50 సంవత్సరాలు పూర్తిఅయిన  సందర్భంగా  ఆనాటిస్ఫూర్తిని  గుర్తు చేసుకున్నాను. ఆ పాఠశాలలకు హాజరైన  స్నేహితులతో పంచుకున్నాను. ఈడ్పుగంటి నాగేశ్వరరావు గారు, వర్మగారు  , ఐ.ఎస్.రాజు గారు , ప్రతాపరెడ్డి గారు , నల్లూరి అన్న,  డా.కే.నారాయణగారు , నానీ గారు , వనజ , లాంటి పార్టీ నేతలతో   మాట్లాడాను. వారుకూడా  తమజ్ఞాపకాలను  గుర్తు చేసుకుని  ఎంతోసంతోషం వ్యక్తం చేశారు. నాటి పాఠశాల  నిర్వహణలో  క్రియాశీలపాత్ర   పోషించి ఇప్పటికీ మనమధ్యనే  ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్న   ఐ.ఎస్.రాజు గారికి , డి.వి.వి.ఎస్. వర్మగారికీ అభినందనలు. అది స్వర్ణయుగం ,ఇప్పుడేమీ లేదు అనేవారు ఉంటారు. అది ఒక అభిప్రాయం మాత్రమే. కమ్యూనిస్టులు ప్రతిపాదించిన అనేక భావనలకు సామాజిక ,రాజకీయ ఆమోదం లభించింది అనేది ఒక వాస్తవం. వారి ప్రత్యక్ష ,పరోక్ష ప్రభావంతోనే  అవి అమలు జరుగుతున్నాయి. అలాగే ప్రతికూల భావజాలం కూడా బలోపేతం అయిన మాట కూడా నిజమే. అయితే ఆనాటి సాధనాలు ,పద్దతులు  మారాయి. సైద్ధాంతికపోరాటం మాత్రం కొత్త కొత్త రూపాలలో  కొనసాగుతూనే  ఉంది..!
 
గత అనుభవం, స్వీయరచన..
డి.సోమసుందర్ ,
సీనియర్ పాత్రికేయుడు.
తాడేపల్లి గూడెం.