మీడియారంగలోకి రాజకీయపార్టీల రంగ ప్రవేశంతో జర్నలిస్టులే సమిథలైపోతున్నారు.. జర్నలిజం విలువలు మచ్చుకైనా కనపించకుండా పోతున్నాయి. ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడకపోవడంతో వీళ్లలో వీళ్లే ఒకరు పచ్చపత్రిక అని.. మరొకరు పచ్చకామెర్ల పత్రికలంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడం మాని రాజకీయపార్టీల ముష్టియుద్ధాలకు జర్నలిస్టులు గొడవలు పడాల్సి వస్తున్నది. రాజకీయపార్టీలకోసమే జర్నలిస్టుగా పనిచేయక తప్పని దుస్థితి కూడా వచ్చేసింది. అలాగని మీడియా రంగంలో వర్కింగ్ జర్నలిస్టులకు రక్షణ అయినా ఉంటుందా అదీ లేదు. కొన్ని సంస్థలు జీతాలిస్తే.. మరికొన్ని సంస్థలు ప్రజా సేవ చేయమంటున్నాయి. జర్నలిజం ఆశక్తి ఉన్నవారు తప్పితే మరెవరూ ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి సాహసం చేయడం లేదు. తెల్లవారు లెగిస్తే ప్రజా సమస్యలు ఎక్కడా పత్రిలూ టీవీ ఛానల్స్ లో కనిపించడం లేదు. ఒకప్పుడు పత్రికలంటే ప్రభుత్వాలకి రాజకీయపార్టీలకు కాస్త భయం ఉండేది. ఇపుడు అది పోయింది. కారణం రాజకీయపార్టీలకే మీడియా సంస్థలు రావడం వాటినే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే నిధుల సర్ధుబాటు ప్రభుత్వ ప్రకటనల ద్వారా అడ్డగోలుగా చేసుకోవడం అలవాటైపోయింది.
మరికొన్ని మీడియా సంస్థలు మనుగడ కోసం అధికాపార్టీలకు తొత్తుల్లా మారాల్సి వస్తున్నది. ఎటొచ్చీ రాజకీయపార్టీల మీడియా ఆదిపత్యంలో స్థానిక పత్రికలు మట్టికొట్టుకు పోతున్నాయి. అంతేకాదు స్థానిక పత్రికలను పూర్తిగా అణగదొక్కేయడానికి రక రకాల జీఓలు తీసుకువచ్చి ఇక వారంతట వారే పత్రికలు, మీడియా సంస్థలు మూసేసుకునే చర్యలకు దిగుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు తెల్లవారుజామున లేచే సరికి బాహ్య ప్రపంచంలో ఎం జరుగుతుందనే తాజా సమాచారంతో పత్రికలు ప్రజలను చైతన్య పరిచేవి. ఇపుడు పేపర్ తిరగేస్తే మూడొంతులు రాజకీయపార్టీ ముష్టియుద్దాలకు జర్నలిస్టులు బలపోయి, పొట్టగూటికోసం ఉద్యోగాలను నిలుపుకోవడం రాసిన కథనాలే కనిపిస్తున్నాయి. మీడియా సంస్థలకు ప్రభుత్వాలు ఇచ్చే గుర్తింపు ఇస్తే ఎక్కడ ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందోనని కనీసం పత్రికలకు ఎంపానల్ మెంట్ చేయడం లేదు. ఉన్నవాటికి కూడా రెగ్యులారిటీ పేరుతో నిబంధనలు విధించి ప్రభుత్వ ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిఏవీపీ ప్రకనటలు ఇవ్వడం తగ్గించేసింది.. కాదు కాదు ఇవ్వడమే మానేసింది. ఇచ్చినా కూడా ఇందులో కూడా అడ్డగోలు రాజకీయాలు చేస్తూ.. స్థానిక పత్రకలను ప్రక్కకు నెట్టేస్తున్నారు. ఈ విషయంలో కూడా రాజకీయపార్టీల పత్రికలే మొత్తం ప్రకటనల్లో అగ్రభాగాన్ని లాగేస్తున్నాయి.
ఒకప్పుడు జర్నలిజం అంటే ప్రభుత్వాన్ని, ప్రజలను వారి వార్తలతో చైతన్యపరచడం.. దాని ఇపుడు వాటి స్వరూపం మారిపోయి ఒక పార్టీ పేపరులో, మరోపార్టీ రాజకీయాలకే అగ్రతాంబాలం, పేజ్-1 ఆర్టికల్స్ కి ప్రత్యేక స్థానాలను కేటాయిస్తున్నారు. సమాజంలో తమవంతు పాత్ర పోషించి ప్రజలను చైతన్యం చేయడానికి జర్నలిజం, మీడియారంగంలోకి అడుగుపెడుతున్న జ్నలిస్టులు సమిధలుగా మారి రాజకీయ క్రీడలో ఆటగాళ్లు అవుతున్నారు. యాజమానం ఏం చెబితే అదే రాయాలి. ఎలా చెబితే అలా రాయాలి.. ఎక్కడా జర్నలిస్టులకి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు రాసే స్వేచ్చ పోయి చాలా కాలమే అయ్యింది. ఆ స్వేచ్చ మళ్లీ వస్తుందనే నమ్మకం కూడా లేదు. ఉన్న కొద్దిపాటి స్థానిక పత్రికలైనా వాస్తవాలను బయటపెడితే ఆ లోకల్ పేపర్ మన పార్టీది కాదు.. ప్రభుత్వానికి అనుకూలంగా కూడా లేదు. అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదంటూ ప్రభుత్వంలో ఉన్నవారే స్థానిక పత్రికలను ప్రక్కన పెట్టేస్తున్నారు. ఎంతదారుణం అంటే జర్నలిస్టులకి, పత్రికను అందంగా తీర్చి దిద్దే డెస్కు జర్నలిస్టులకి, వాస్తవాలను చిత్ర రూపంలో చిత్రించే ఫోటో జర్నలిస్టులకి, కదిలే బొమ్మలు వీడియోలు చిత్రీకరించే వీడియో జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా ప్రపంచంలో ఏ దేశంలో లేని నిబంధనలు భారతదేశంలోనూ, అందునా ఆంధ్రప్రదేశ్ లోనే అమలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.
ఇపుడు ఇంకో అడుగు ముందుకి వేసి. యావత్ మీడియానే నియంత్రించే పని ప్రారంభించారు. సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఏ పార్టీకి ఆ పార్టీ, కార్పోరేట్ సంస్థలు సైతం సోషల్ మీడియాని సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఎంత దారుణమైన పరిస్థితులు ఇపుడు తెరపైకి వచ్చాయంటే.. సోషల్ మీడియాకి కూడా ప్రెస్ అక్రిడిటేషన్లు ఇవ్వాలనే సూచనలు ప్రభుత్వాలు చేస్తున్నాయంటే వర్కింగ్ జర్నలిస్టులకు వచ్చే ఆ కొద్దిపాటా గౌరవం కూడా ప్రెస్ అక్రిడిటేషన్ రూపంలో సోషల్ మీడియాకి వెళ్లిపోతుందనే భయానక పరిస్థితులు వచ్చాయి. మీడియా రంగంలో ఏం జరిగినా.. ఏం చేసినా రాజకీయపార్టీలు మాత్రమే శాసిస్తున్నాయి. దానికి అధికారం కూడా ఒక అవకాశం అవుతుంది. ఇప్పటికై మీడియా పతన దశకి చేరుకుంది. రానున్న రోజుల్లో మీడియా అనే పదం, వార్తలు కనుమరుగు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఎవరు ఎన్ని సంస్థలు పెట్టుకున్నా అందులో పనిచేసేది.. రాసేది..రాయించేది..రాటుదేలి ప్రజలను, ప్రభుత్వాలను చైతన్య పరిచిదే జర్నలిస్టులు మాత్రమే..జర్నలిస్టులకి పూర్వవైభవం రావాలి.. జర్నలిజం వర్ధిల్లాలి..!