ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులు అదృష్టవంతులు..?!


Ens Balu
10
viskahpatnam
2025-07-27 07:38:48

ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులు చాలా అదృష్టవంతులు.. ఏ చీకూ చింతా లేదు. పనిచేసినంత కాలం పనిచేస్తారు.. 60ఏళ్లు దాటిన తరువాత  ప్రభుత్వం నుంచి ఏవిధమైన ప్రయోజనం లేకుండా.. పొందకుండా.. పొందే వీలు లేకుండా.. ఇంటిదగ్గే రెస్టు తీసుకుంటూ రామా క్రిష్ణా అని పిల్లలు పెట్టే ఏదో నాలుగు మెతుకులు తిని బ్రతుకు ఈడ్చేస్తారు. అదే బీహార్ రాష్ట్రంలో లాగా ప్రతీనెలా రూ.15 వేలు పెన్షన్ ఏమీ తీసుకోరు. అసలు అలాంటి ఊసే ఏపీలో లేదు.. రాదు.. రాబోదు. 60ఏళ్లపాటు ప్రజలకి, ప్రభుత్వాలకి మధ్య సమాచార వారధిగా పనిచేసి కూడా కనీసం పెన్షన్ కి కూడా నోచుకోని జర్నలిస్టులన్న రాష్ట్రంగా ఏపీ కీర్తికెక్కింది. జర్నలిస్టుల కనీస అవసరాలు తీర్చలేని, తీర్చుకోలేని, ఆ దిశగా పోరాటాలు చేయని జర్నలిస్టుల సంఘాలున్న రాష్ట్ర జర్నలిస్టుల సంఘాలున్న రాష్ట్రంగా  కూడా దేశంలోనే కీర్తి పొందింది. 

అదేదో బీహార్ రాష్ట్రమట. అక్కడ మాత్రం జర్నలిస్టులు ఏదో చేశారని.. సమాజం కోసం ప్రజలు, ప్రభుత్వం కోసం పనిచేశారని గుర్తించిన అక్కడి ప్రభుత్వం రిటైర్ అయిన జర్నలిస్టులకి ఇప్పటి వరకూ రూ.10వేలు ఇచ్చేది. ఇపుడు దానిని కాస్తా రూ.15వేలకి పెంచిందట. అంతే  మన రాష్ట్రంలో ఏమీ సాధించుకోలేని జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాలు ఆ పెన్షనేదో ఇక్కడే తీసుకుంటున్నట్టు పత్రికా ముఖంగా ప్రకటనలు ఇచ్చి మరీ తెగ ఆనంద పడిపోతున్నారు.. బహుసా జర్నలిస్టులంటే అక్కడి రాష్ట్రప్రభుత్వానికి కాస్త గౌరవం కాబోలు. లేదంటే  జర్నలిస్టులకిచ్చే పెన్షన్ ను రూ.10వేల నుంచి రూ.15కి కి పెంచడమేంటి సిరాకు కాకపోతే. అదే మన ఆంధ్రప్రదేశ్ ని చూడండి.. ఒక్కసారి సారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులూ.. జర్నలిస్టుల సంఘాల నేతలు. నిజంగా జర్నలిస్టులంటే మనం.. జర్నలిస్టు సంఘ నేతలమంటే మనమే.. మనకి ఏ రాష్ట్రంలోని జర్నలిస్టులతోనూ పోలిక ఉండదు. 

కనీసం వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేం సరికదా.. కనీసం మండల విలేఖరికి ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కూడా సాధించుకోలేం. ఇంతలా చేయడం అంటే మాటలా చెప్పండి.  ప్రభుత్వాలంటే బీహార్, ఒడిసా లాంటి  రాష్ట్రాలవినే కాదా..? చెప్పండి..! అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే వర్కింగ్ జర్నలిస్టులకి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు అదేనండీ ప్రెస్ అక్రిడిటేషన్ పొందాలన్నా దేశంలోనే లేని నిబంధనలన్నీ వర్తింపజేస్తారు. వాటిని ప్రశ్నించలేం.. సంక్షేమ పథకాలంటారా.. అవి ఒక్కటి కూడా జర్నలిస్టులకి ఉండవు.. ఒక వేళ ప్రజలను నమ్మించడానికి ఏ రాజకీయపార్టీ అయినా మేనిఫెస్టోలో పెట్టినా కూడా వాటిని అమలు చేయలేక ప్రత్యేక సబ్ కమిటీలు వేస్తాయి. అపుడూ మాట్లాడలేం.. సబ్ కమిటీ అంటే తెలుసుకదా..వాళ్లకున్నంత బిజీ మరే కమిటీకి ఉండదు. ఇచ్చే రిపోర్టులు కూడా అంతే త్వరగా ఇచ్చేస్తారు(ఎంత లేదనుకున్నా ఆరు నెలల నుంచి ఏడాదిలోపే లేదంటే మన ప్రెస్ అక్రిడిటేషన్ లాగా మరో ఆరు నెలలు ఎక్స్ టెన్షన్ చేసుకుంటూ పోతారు)..

 ఆ తరువాత వాటిపై జీఓలు రావడానికి మరో ఏడాది. ఈ లోగా ఏ జర్నలిస్టు సంఘమైనా కోర్టుకి వెళ్లకుండా ఉంటే అదీ కూడా సక్రమంగా జీఓ రావడానికి. కానీ బీహార్, ఒడిసా లాంటి రాష్ట్రాలు అలా కాదు. జర్నలిస్టులంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య నిరంతర సమాచార సారధులుగా గుర్తించి వారికి 60ఏళ్లు నిండన వారికి పెన్షన్లు ఇస్తున్నాయి. కనీసం దానికోసమైనా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల కోసం జర్నలిస్టులు పనిచేస్తారు.. ప్రచారం చేస్తారు.. ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళతారు.. ఇంకేమనా చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి పరిరిస్థితి ఏంటి.. ఇక్కడ ప్రభుత్వాలకి జర్నలిస్టులతో పనిలేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా నిబంధనలు మామూలుగా ఉండవు. అవి పాటించే మీడియా సంస్థలు వారి ఆస్తులు తాకట్టు పెట్టి పత్రికలను నడుపుకోవాలి. మళ్లీ ఇక్కడ మాత్రం మరో వెసులుబాటు వుంది. అదే సదరు రాజకీయపార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికలు, మీడియా సంస్థలు ఉంటే మాత్రం వందల కోట్ల రూపాయలు ఒక్క ప్రకటనల ద్వారానే వారికి కట్టబెడతారు.

 అందులో ఒక్కశాతం కూడా స్థానిక పత్రికలకి ఇవ్వాలంటే మాత్రం ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు కూడా ఎక్కడలేని నొప్పులన్నీ పడిపోతుంటాయి. వాటికే అంతా నొప్పులు పడగా లేనిది.. ఇక 60ఏళ్లు దాటిన రిటైర్డ్ జర్నలిస్టులకి పెన్ష్లు ఏమిస్తారు చెప్పండి..? అసలే ఖజానాలో డబ్బులు లేవు. అలాంటి సమయంలో జర్నలిస్టులకి పెన్షన్లు, ప్రెస్ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ లు, ఇళ్ల స్థలాలు, హౌసింగ్ స్కీములు, ఎటాక్స్ కమిటీలు అంటే అది అసలు జరిగే పనికూడా కాదు. అలాంటివేమీ అడక్కూడదు. అదే స్థానిక పత్రికలకు  ప్రెస్ అక్రిడిటేషన్లు కుదించేయడానికి, స్థానిక పత్రికలు నడవకుండా ఎక్కడలేని నిబంధనలు పెట్టడానికి, ఇచ్చే ప్రకటనలకు ఎంపానల్ మెంట్ నిబంధనల ముడిపెట్టడానికి,  జీఓలు తెమ్మంటే మాత్రం రాత్రికి రాత్రి జీఓలు వచ్చేస్తాయి. క్షణాల్లో నే అమల్లోకి కూడా వచ్చేస్తాయి. స్థానిక పత్రికలకు గుదిబండాలా మారిన ఆ నిబంధనలను అమలు చేసే వరకూ ప్రభుత్వం కూడా ఊరుకోదు. 

 సరికదా మీడియాకోసం పనిచేసే సమాచారశాఖ ద్వారా జీఓని అమలు చేసి దానిని పర్యవేక్షించి గంగ గంటకీ నివేదికలు ఇమ్మని చెబుతుంది. అదే మండలంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టుకి కనీసం ప్రెస్ అక్రిటేషన్ ఇవ్వండని ప్రభుత్వానికి జర్నలిస్టుల సంఘాలు ఆర్జీ పెట్టాయనుకోండి.. అబ్బే ఆ ఒక్కటీ అడక్కు అంటాయి. కనీసం ఇంటి స్థలం ఇస్తే కనీసం కమ్మలతోనైనా ఇల్లు కట్టుకుంటామని అని అడిగితే.. దానికోసమే కమిటీ వేశాం.. ఆ కమిటీ రిపోర్టు రాగానే ఇస్తామని గుక్కతిప్పుకోకుండా చెబుతాయి. కాకపోతే ఆ లోగా ప్రభుత్వానికే టైమ్ అయిపోతుంది. ఎందుకంటే ఈలోగా ఐదేళ్లు గడిచిపోతాయ్ కదా.. కావాలంటే గత ప్రభుత్వ విధానాలు ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికలకు ఏడాది ముందు హడావిడి చేసేస్తారు. అదిగో ఇదిగో అనేసరికి ఎన్నికలు వచ్చేసి ప్రభుత్వాలే మారిపోయాయి. ఇపుడు ప్రభుత్వం ఏకంగా జర్నలిస్టులకోసం మేనిఫెస్టోలోనే హామాలిచ్చింది. 

ఇచ్చినట్టుగానే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తరువాత బ్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ లోని పరిస్తితి. అదే బీహార్, ఒడిసా లాంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు కదా.. జర్నలిస్టుగా పనిచేసి రిటైర్ అయితే చాలు బీహార్ లో ఇపుడు రూ.15వేలు పెన్షన్ ఇస్తున్నారు. అలాంటి పరిస్థితులు, అవకాశాలు, ఉపయోగాలు లేని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు అదృష్టవంతులా కాదా చెప్పండి..పైగా మన అదృష్టం మనల్నే వెక్కిరించేలా ఎక్కడో బీహార్ లాంటి రాష్ట్రంలో జర్నలిస్టుల పెన్షన్ రూ.10 వేల నుంచి రూ.15వేలకి పెంచి అక్కడి జర్నలిస్టులకి మేలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో మన జర్నలిస్టులంతా.. యూనియన్ల పేరుతో హర్షం ప్రకటిస్తాం అదీ పత్రికా ముఖంగా?!