ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు పంద్రాగస్టు వేడుకల్లో ఖాకీ దుస్తులతో గౌరవ వందనం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14వేలకు పైగా వున్న మహిళా పోలీసులకు ప్రభుత్వం యూనిఫారం ఇవ్వాలని నిర్ణయించింది. దానికోసం మూడు నెలలు ముందే పోలీస్ స్టేషన్లు వారీగా సచివాలయ మహిళా పోలీసులకు డ్రెస్ కొలతలు కూడా తీసుకున్నారు. ఆ మేరకు అన్ని జిల్లాలకు 2 నెలల క్రితమే యూనిఫారం చేరుకుని కుట్టు పనులు కూడా పూర్తిచేసుకుంది. ఈ కార్యక్రమం మొత్తం జూలై నెలాఖరుకే ప్రభుత్వం పూర్తిచేసింది. ఆగస్టు 1వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్దీకరించిన ప్రభుత్వం మిగిలిన శాఖల సిబ్బందికి యూనిఫాం ఇచ్చినట్టుగానే సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన ఖాకీ యూనిఫాం కూడా అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాల వారీగా ఆయా పోలీసు స్టేషన్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య ఆధారంగా వీటిని అందించనున్నారు.
ఆగస్టు 15న యూనిఫాంతో జెండా వందనం..
గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు యూనిఫారం ఈవారంలోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మహిళా పోలీసులంతా ఖాకీ యూనిఫాంతోనే 2022 పంద్రాగస్టు వేడుకల్లో
పాల్గొంటారు. ఇప్పటికే యూనిఫాం కుట్టు కార్యక్రమాలు, షూ, బెల్ట్, విజిల్, నేమ్ బోర్డు, కేప్ ఇలా అన్ని సిద్దం చేయడంతో డీజీపీ ఆదేశాల కోసం మేరకు మాత్రమే ఎదురు చూస్తున్నట్టుగా అధికార యంత్రాంగం చెప్పుకొస్తోంది. డీజీపీ నుంచి ఉత్తర్వులు రాగానే వాటిని మహిళా పోలీసులకు పంపిణీ చేసి తద్వారా గ్రామస్థాయిలో మహిళల రక్షణ ప్రారంభించనుంది ప్రభుత్వం. ఇప్పటి వరకూ మహిళా పోలీసులంటే పేరుకే సచివాలయాల్లో ఉన్నారు తప్పితే వారిని ప్రజలు గుర్తించడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఖాకీ యూనిఫాం వేసుకోవడం ద్వారా ప్రజలు కూడా సచివాలయాల్లో మహిళా పోలీసులను సులువుగా గుర్తుపట్టడంతోపాటు వారి సమస్యలు నేరుగా వచ్చి చెప్పుకోవడానికి, వారి ద్వారా స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి.
యూనీఫాంలోనే సచివాలయ సిబ్బంది..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం అందరూ ప్రభుత్వం కేటాయించిన యూనిఫాంలోనే విధులకు హాజరవుతున్నారు. ఒక్క మహిళా పోలీసులు మాత్రమే సివిల్ డ్రెస్ లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వీరు కూడా ఖాకీ యూనిఫాం వేసుకుంటే సచివాలయ సిబ్బందికి మొత్తం డ్రెస్ కోడ్ అమలు జరిగినట్టే. ఇప్పటి వరకూ అరకొరగా యూనిఫాం వేసుకు వస్తున్న సిబ్బంది ఇకపై పూర్తిస్థాయిలో ప్రజలకు కనిపించే విధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నది. ఏ ఒక్క సిబ్బంది అయినా యూనిఫాం వేసుకురాకపోతే కఠిన చర్యలు కూడా తీసుకునే విధంగా అధికారులు ప్రత్యేక ద్రుష్టిసారిస్తున్నారు. ప్రజలు సచివాలయ సిబ్బందిని కేవలం ప్రభుత్వం కేటాయించిన డ్రెస్ కోడ్ ఆధారంగానే గుర్తిస్తున్నారు. అయితే దానికి భిన్నంగా చాలా మంది సచివాలయ ఉద్యోగులు డ్రెస్ సక్రమంగా వేసుకోకపోగా ప్రభుత్వం ఇచ్చిన యూనిఫాంను బ్యాండ్ మేళంగా అభివర్ణిస్తూ వరి నచ్చిన దుస్తులతో విధులకు హాజరవుతున్నారు. ఇకపై అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకొని..డ్రెస్ కోడ్ లోనే విధులకు హాజరయ్యే విధంగా చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి అన్ని ప్రభుత్వశాఖల అధికారులను ఆదేశించినట్టుగా చెబుతున్నారు. చూడాలి మహిళా పోలీసులకు ఖాకీ యూనిఫాం అందజేసిన తరువాతనైనా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందితో తరచుగా యూనిఫాం వేసుకుని వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటారో..లేదంటే యదావిధిగా పేరుకే ప్రకటనలు చేసి.. అమలుని గాలికి వదిలేస్తారో..!