నెల్లూరు నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో జిల్లా వాసులు పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విపిఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మంగళవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు వైభవోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి రోజు ఉదయం నిర్వహించిన వసంతోత్సవ పూజా కార్యక్రమంలో మంత్రి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు, విపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సూళ్ళూరుపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య, నుడ ఛైర్మన్ ముక్కాల ద్వారాకానాథ్ లతో కలసి వసంతోత్సవంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని ప్రజలందరికీ కల్పించాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో వైభవోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం, వి పి ఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులో 5 రోజుల పాటు జరుపుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. తిరుమలలో స్వామి వారికి జరిగినట్లుగానే ఇక్కడ శ్రీవారి సేవలు నిర్వహిస్తారని, జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీ వారి వైభవోత్సవాల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలన్నారు. ఏడు సంవత్సరాల తర్వాత వైభవోత్సవాలు మళ్ళీ నెల్లూరులో నిర్వహించుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఐదు రోజుల పాటు నెల్లూరులోనే కొలువై ఉన్నట్లుగా ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు, విపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ల అధ్వర్యంలో చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, విశేష సంఖ్యలో భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.