ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్లు ఉమ్మడి 13 జిల్లాల్లోనే 2024 వరకూ ఇస్తుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను అయితే మార్చింది తప్పితే చాలా వరకు విధాన పరమైన కార్యకలాపాలు ఉమ్మడిజిల్లాల్లోనే చేపడుతుండటమే దీనికి కారణం కనిపిస్తుంది. ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు సంబంధించిన ఫైళ్లపై పాత జిల్లా కలెక్టర్లు, పాత జిల్లాశాఖల అధికారులే సంతకాలు చేసి ఆర్డర్లు జారీ చేశారు. ఇపుడు కొత్త జిల్లాల్లో పనిచేసే జర్నలిస్టుల అక్రిడిటేషన్లు కూడా పాత ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఉన్నచోటనే సమాచారశాఖ చేయించాలని చూస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ విషయంలో ఇప్పటికే ఆయా జిల్లాల సమాచారశాఖ డీడీలు కూడా ఇదే విషయాన్ని రాష్ట్ర సమాచారశాఖకు తెలియజేశారని చెబుతున్నారు. వాస్తవానికి ఏ జిల్లాలో కలెక్టర్ ఉంటే ఆ జిల్లాల్లో జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్ చైర్మన్ హోదాలో కలెక్టర్ కార్డులు జారీ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్నీ నిబంధనలకు విరుద్దంగానే జరుగుతుండంటంతో ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలో పాత నిబంధనే పాటించాలని సమాచారశాఖ యోచిస్తుందనే ప్రచారం జరుగుతుంది.
జిల్లా పరిషత్ లు మారేంత వరకూ ఉమ్మడి జిల్లాలే
ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు 26 జిల్లాలు అయినా జిల్లా పరిషత్ లు మాత్రం ఉమ్మడి జిల్లా కేంద్రంగానే పనిచేస్తున్నాయి. పాత జిల్లా పరిషత్ చైర్మన్ పదవీకాలం పూర్తయ్యేంత వరకూ ఉమ్మడి జిల్లాల కార్యకలాపాలు యదావిధిగా కొనసాగుతాయని..అధికారులు చెప్పుకొస్తున్నారు. ఒక్క జిల్లా పరిషత్ లు మాత్రమే కాకుండా పాత ఉమ్మడి జిల్లాల కార్యాలయాల వ్యవహారాలు కూడా ఇదే విధంగా కొనసాగుతాయని.. కొత్త జిల్లాల్లో మాత్రం పరిపాలన కేంద్ర సర్వీసులకు సంబంధించినంత వరకూ ఇప్పుడిప్పుడే అధికారాల బదలాయింపులు జరుగుతున్నాయని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు. వాస్తవానికి చాలా సంస్థలకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండి పలు కీలక వ్యవహారాలు చేయాల్సి వుంటుందనే విషయాన్ని ప్రస్తావించినపుడు.. ఉమ్మడి జిల్లాల్లో చేపట్టే కార్యకలాపాలు తప్పించి ఇతర కార్యక్రమాలు, అధికారాలు అన్నీ కొత్త జిల్లాల కలెక్టర్లకు జిల్లా అధికారులకు సంక్రమిస్తాయని.. కొన్ని వ్యవహారాలు మాత్రం పాత ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, జిల్లాశాఖల అధికారులు మాత్రం చేస్తారని అన్నారు. ఇదే ఫార్ములా మొన్నటి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ సమయంలో కూడా పాత జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులే ఆఖరి దస్త్రాలుపై సంతకాలు చేసి ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చింది చెప్పుకొచ్చారు. కొత్త జిల్లాల విభజన జరిగినప్పటికీ చాలా వరకూ విధానపరమైన బదలాయింపులు మాత్రం జరగాల్సి వుందని వివరించారు.
కొత్త జిల్లాల్లో పేరుకే సమాచార పౌరసంబంధాల శాఖ..
రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల్లో పేరుకే సమాచారశాఖ కార్యాలయాలు, సిబ్బంది పనిచేస్తున్నారు. విధాన పరమైన నిర్ణయాలు, వ్యవహారాలు మాత్రం మాత్రం ఉమ్మడి జిల్లాకేంద్ర కార్యాలయాల నుంచే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జర్నలిస్టులకు ప్రభుత్వం జారీ చేసే ప్రెస్ అక్రిడిటేషన్లు కూడా పాత జిల్లా కార్యాలయాల్లోనే ఈసారి చేపడతారని జిల్లా సమాచారశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి కొత్త జిల్లాల్లో పదోన్నతులు పొందిన అధికారులను, జిల్లా అధికారులగా నియమించాల్సి వుంది. కానీ ప్రభుత్వ శాఖల్లో పరిపాలనా సౌలభ్యం కోసం సీనియర్ అధికారులను జిల్లా అధికారులుగా, డిప్యూటేషన్ పద్దతిపై కొత్త జిల్లాల్లో అధికారులుగా ప్రభుత్వం నియమించింది. దీనితో చాలా వరకూ కార్యక్రమాలు, కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారాలు కొత్త జిల్లాలలోని అధికారులకు లేవు. దీనితో యదావిధిగా మళ్లీ పాత జిల్లా కార్యాలయాల నుంచే పనులు చేయించాల్సి వస్తుంది. ఇలా ఒక్క సమాచార పౌర సంబంధాల శాఖ మాత్రమే కాకుండా 75 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని పనులు, వ్యవహారాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసుకు వస్తుంది.
మీడియాకి సమాచారం ఇవ్వడంలో పూర్తివైఫల్యం..
ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి పాత జిల్లాల్లోని పాత వ్యవహారం మాదిరిగానే సామాచర పౌర సంబంధాల శాఖ మీడియాకి సమాచారం ఇవ్వడంలో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తోంది. పెద్ద పత్రికలు, టీవీ ఛానళ్లు మినహా ఇతర చిన్నతరహా మీడియాకి మాత్రం సమాచారం ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వానికి చెందిన అధికారిక కార్యక్రమాలు, ప్రెస్ నోట్లు కేవలం పెద్ద మీడియా సంస్థల్లోలని జర్నలిస్టులకే సమాచార శాఖ ఇవ్వడం, వారి నెంబర్లు మాత్రమే అధికారిక ప్రెస్ గ్రూపులో యాడ్ చేయడం ఇపుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అంతేకాకుండా సమాచారశాఖ అవినీతి వ్యవహారాలు బయట పెట్టే చిన్న, మధ్య తరహా మీడియా సంస్థలను ప్రభుత్వ వ్యతిరేక మీడియాగా ముద్ర వేసి వారికి సమాచారం అందించడం మానేస్తున్నది. ఈ విషయమై కొత్తజిల్లాల్లోని డీపీఆర్వోలను మీడియా సంప్రదిస్తే.. అక్రిడేటెడ్ మీడియా జర్నలిస్టులను మాత్రమే రాష్ట్ర కార్యాలయం ప్రెస్ గ్రూపులో యాడ్ చేయాలని ఆదేశాలున్నాయని వీరు చేసే తప్పును కమిషనర్ కార్యాలయం మీదకు నెట్టేస్తున్నది. చిన్న పత్రికలకు చాలా వరకూ ప్రెస్ అక్రిడిటేషన్లు ఇవ్వలేదనే విషయాన్ని పదే పదే ప్రశ్నించి జిల్లా కలెక్టర్ లేదా.. రెవిన్యూ అధికారుల ద్రుష్టికి తీసుకెళితే తప్పా మీడియా వాట్సప్, టెలీగ్రామ్ గ్రూపుల్లో జర్నలిస్టుల పేర్లు, నెంబర్లను చేర్చడం లేదు.
సమాచారశాఖ నిర్లక్ష్యమే కొత్త జిల్లాలకు శాపం..
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో అధికారుల ఇష్టారాజ్యం, నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కొత్తజిల్లాలకు శాపంగా పరిమణమిస్తోంది. కొత్త జిల్లాల్లో అధికారులు, ప్రభుత్వ శాఖల సమాచారం పెద్ద మీడియా సంస్థలకు తప్పితే చిన్న మధ్య తరహా జిల్లా మీడియాకి తెలియడం లేదు. అలాగని పెద్ద మీడియా సంస్థలకు చెందిన పత్రికలు, టీవీ ఛానళ్లు అన్ని వర్గాల ప్రజలకు వెళుతున్నాయా అంటే అదీ జరగడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు తప్పితే మరెవర వద్దకూ పెద్ద పత్రికలు చేరడం లేదు. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజల వద్దకు వెళ్లే చిన్న, మద్య తరహా మీడియా, పత్రికలకు సమాచారశాఖ సమాచారం అందించడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమపథకాలకు సంబంధించిన సమాచారం మీడియాకి విడుదల చేయడం అంటే సమాచారశాఖ జేబులో నుంచి తమ నెలజీతం మొత్తం మీడియాకి ఖర్చు చేసేస్తున్నట్టు కొత్త జిల్లాల్లో డీపీఆర్వోలు, ఏపీఆర్వోలు తెగ ఫీలైపోతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు అయిన తరువాత పెద్ద పత్రికల కంటే ముందుగా చిన్న, మధ్య తరహా పత్రికలు మాత్రమే కొత్త జిల్లాల్లో కార్యాలయాలు, జర్నలిస్టులను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకున్న కొందరు డీపీఆర్వోలు కొత్త జిల్లాల్లోని జర్నలిస్టులకు సమాచారాన్ని సకాలంలో అందిస్తుంటే నేటికీ అధికశాతం డీపీఆర్వోలు కొత్తజిల్లాల్లో మీడియాకు సమాచారం ఇచ్చేందుకు మాత్రం ముందుకి రావడంలేదు. ఈవిషయం సమాచారశాఖ కమిషనర్ కి తెలిసినా అంటీముట్టనట్టే వ్యవహరిస్తుండటం వలనే మీడియాకి కొత్త జిల్లాల్లో సమాచారం అందడం లేదనేది స్పష్టమవుతున్నది. పరిస్థితి ఇలానే ఉంటే కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయిలో పరిపాలన ప్రారంభమైతే పరిస్థితి మరింత జఠిలంగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇదే పరిస్థితి జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్లు ఇచ్చే విషయంలో కూడా తలెత్తుతుందని కూడా జర్నలిస్టులు రాష్ట్ర సమాచారశాఖకు పెద్ద ఎత్తున తెలియజేస్తున్నారు. చూడాలి ఇప్పటికైనా సమాచార పౌర సంబంధాల శాఖ తీరు మారుతుందా లేదా అనేది..!