ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఇవ్వాల్సిన డీఏ బకాయిలకు మోక్షం కలగాలంటే 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ ఆగాల్సిందేనా.. ఎన్నికల ముందు బకాయి డీఏలే తాయిలాలుగా ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ద్రుష్టి మొత్తం సామాన్య ప్రజల సంక్షేమం మీదే వుందనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజల సంక్షేమం కాదని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలను మంజూరు చేస్తే సంక్షేమ పథకాల అమలుకి ఆర్ధిక ఇబ్బందులు వచ్చిపడతాయి. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి సమయానికి జీతాలు అందుతున్నాయి కనుక డీఏల బకాయిలన్నీ ఎన్నికల ముందు రిలీజ్ చేయడం ద్వారా ఉద్యోగులకు ఒకే సారి డిఏలు ఇచ్చినట్టుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికిప్పుడు బకాయి డిఏలు ప్రభుత్వ అధికారులకిచ్చే మొత్తంతో నవరత్నాల్లోని ఒక పథకానికి అర్హులైన వారికి నగదు బదిలీల చేయవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా ఉండటంతోనే బకాయి డిఏల ఊసెత్తడం లేదని ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వ తీరుపైన తీవ్ర ఆగ్రహం ఉన్నారు.
డిఏ ఇవ్వాల్సి వస్తే.. సచివాలయాల భారం కూడా
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు డీఏలు ఇవ్వాల్సి వస్తే ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసులు రెగ్యులర్ అయ్యాయి కనుక రాష్ట్రవ్యాప్తంగా వున్న ఒక లక్షా 21వేల మంది సచివాలయ ఉద్యోగులకు కూడా డిఏ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే బకాయి డీఏ భారం ప్రభుత్వంపై పడుతుండగా..ఇపుడు గ్రామ,వార్డు సచివాలయాలు కూడా తోడవుతాయి. అపుడు మరింత ఆర్ధిక భారం అవుతుంది. అయితే ఇప్పటి కిప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు డీఏ ఇస్తే సచివాలయ ఉద్యోగులకు డీఏ ఇచ్చే పనుండదు. అలా కాకుండా డీఏ బకాయిలు ఇవ్వడానికి సమయం తీసుకుంటే..సచివాలయ ఉద్యోగులకు కూడా డీఏ ఇవ్వాల్సి వచ్చి ప్రభుత్వానికి మరింత ఆర్ధిక భారంగా పరిణమిస్తుంది. కాగా ఇప్పటికే దగ్గర దగ్గర రెండు డీఏలు కోల్పోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు త్వరలో ఇచ్చే డీఏ ఇవ్వకపోతే మాత్రం అటు సచివాలయ ఉద్యోగుల నుంచి కూడా ఆగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే పీఆర్సీ ప్రకటించి సచివాలయ ఉద్యోగులకు ఎరియర్స్ మొత్తాన్ని ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇపుడు డీఏల కోత కూడా విధిస్తే దాని ప్రభావం వచ్చే ఎన్నికలపై చాలా తీవ్రంగా పడే అవకాశాలు కూడా లేకపోలేదు.
పీఆర్సీకి ముసలం తెచ్చింది సచివాలయాలే..
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు పీఆర్సీకి ముసలం తెచ్చింది గ్రామ, వార్డు సచివాలయ శాఖ అనే విషయం ఎవరికీ తెలియకపోవడం విశేషం.ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ద్రుష్టిలో ఉంచుకొనే పీఆర్సీ ఇచ్చే సమయానికి పాత డీఏలు, హెచ్ఆర్ఏ స్లాబులను ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్ధిక భారం లేకుండా కుదించింది. అలా కుదించిన మొత్తాన్ని భర్తీచేస్తున్నట్టుగా అదే మొత్తాన్ని ఉద్యోగులకు పీఆర్సీ కింద మంజూరు చేసింది. దాని ప్రభావంతో సచివాలయ ఉద్యోగులు 9నెలలు పీఆర్సీ పేస్కేలు, ఆ సమయంలో ఒక డీఏ, పెరిగిన పీఆర్సీ ఎరియర్స్ కూడా కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఆవిషయాన్ని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నించకుండా ఉండేందుకు నేరుగా వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తున్నట్టుగా ప్రకటించి రెండేళ్లు దాటిన ఉద్యోగులకు ఆగస్టు1కి కొత్తగా పెరిగిన పేస్కేలును అమలు చేసింది ప్రభుత్వం. దీనితో ఇపుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య, వారికి ఏ అదనపు మొత్తం ఇచ్చినా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిపే ఇవ్వాల్సి రావడంతో ఆ భారాన్ని ప్రభుత్వం మోసే పరిస్థితి కనిపించడంలేదు. దీనితో ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఇవ్వాల్సిన డీఏ బకాయిలను మంజూరు చేయకుండా దాటవేస్తూ వస్తున్నది. వాస్తవానికి పాత పేస్కేలు ప్రకారం పెంచిన పీఆర్సీ మొత్తం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిఉంటే ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు చాలా మొత్తం జీతం ఇవ్వాల్సి వచ్చేది. అలా ప్రభుత్వంపై భారం పడకుండా ఉండేందుకే సచివాలయ ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేసే సమయానికి హెచ్ఆర్ఏ, డీఏ స్లాబులను పూర్తిగా కుదించేసింది ప్రభుత్వం.
సచివాలయ ఉద్యోగులకు తప్పా..అందరికీ డీఏలు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ అయ్యేనాటికి 9నెలల పేస్కేలతోపాటు ఒక డీఏ, పీఆర్సీ ఎరియర్స్ కూడా కోల్పోయారు. వాళ్ల సర్వీసు రెగ్యులైజేషన్ ఆగస్టులోనే అయ్యింది కనుక సర్వీస్ రెగ్యులర్ అయిన తరువాత ఆరునెలలకు ఒక డీఏ ప్రభుత్వం ఇవ్వాలి. అలా ఇచ్చేటట్టు అయితే సచివాలయ ఉద్యోగులు మరో డీఏ కూడా కోల్పోతారు. అలా పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులకు డీఏలు, హెచ్ఆర్ఏ, ఇతర ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందనే ఏటూగానీ సమయానికి అంటే.. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన రెండేళ్ల ప్రొబేషన్ సమయానికంటే ఆలస్యం 9నెలలు ఆలస్యంగా ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించింది. ఇంకా అందులో చాలా మంది మహిళా ఉద్యోగిణిలు మెటర్నటీ లీవు తీసుకున్న సందర్భంగా వారి సర్వీసు మరో ఆరు నెలలు పొడిగింపు వర్తించింది. ప్రభుత్వం జీఓ నెంబరు 5లో ప్రకటించినట్టుగా ఒక లక్షా 21 వేల మంది ఉద్యోగులకు కూడా పూర్తిస్థాయిలో సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ కాలేదు. ఆగస్టు1వ తేదీ నాటికి కొంతమంది ఉద్యోగులకే సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ అయ్యింది. మెటర్నటీ లీవులు తీసుకున్నవారందరూ పాత పద్దతిలో రూ.15 వేలు మాత్రమే జీతాలు తీసుకున్నారు. అలా సెప్టెంబరు 1నాటికైనా మిగిలిన వారికి సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ అవుతుందా అంటే దానికి ఇంకా డీఎస్సీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ల నుంచి క్రమబద్దీకరణ ఉత్తర్వులు రాలేదు. ప్రతీ నెలా 20 నుంచి 25వ తేదీనాటికి ఉద్యోగులందరికీ జీతాలు పెట్టాల్సి వుంది. అయినప్పటికీ నేటికీ గత నెలలో సర్వీసు క్రమబద్దీకరణ కానివారి జాబితాలు ఇంకా సచివాయాలకు చేరలేదు. దీనితో సచివాలయ ఉద్యోగులకు తప్పా మిగిలిన ఉద్యోగులందరికీ డీఏ వచ్చే అవకాశం వుంది అదీ కూడా ఎన్నికల ముందు తప్పా.. అంతకు ముందు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చూడాలి ప్రభుత్వం బకాయి డీఏల విషయంలో ఏం చేస్తుంది..ఎప్పుడు చెల్లిస్తుంది..దానికోసం ఎప్పుడు ప్రకటిస్తుందనేది..!