సీపీఎస్ పై కథ మళ్లీ ముందుకొచ్చింది. ఆర్థిక భారం కారణంగా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం సీపీఎస్ అంశంపై వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల ఉన్నతాధికారులు గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు 5 గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. పాత పింఛను విధానమే కావాలి, జీపీఎస్‌పై చర్చకు కూడా సిద్ధంగా లేమని సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. దీనితో సీపీఎస్ రద్దుపై పీఠముడి వీడలేదు. మధ్యే మార్గంగా జీపీఎస్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు తెలిపినా.. ఉద్యోగులు మాత్రం సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను అమలు పరచాలని ఎట్టి పరిస్థితుల్లోనూ జీపీఎస్‌ను ఒప్పుకోబోమని చెప్పారు. అంతేకాకుండా సెప్టంబర్ ఒకటిన సీఎం ఇంటి ముట్టడి మాత్రం జరిగి తీరుతుందని స్పష్టంచేయడంతో ప్రభుత్వం కూడా తమ వాణిని బలంగానే వినిపించింది. సీపీఎస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్)పై చర్చకు కూడా తాము సిద్ధంగా లేమని.. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని (ఓపీఎస్) అమల్లోకి తేవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు తెగేసి చెప్పినా ప్రభుత్వం ససేమిరా అనడం విశేషం. ఓపీఎస్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ప్టెంబరు 1న తలపెట్టిన ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి, విజయవాడలో మిలియన్ మార్చ్, బహిరంగ సభ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తామని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఎవరి వాదనకు వారు కట్టుబడటంతో ప్రతిష్టంభన వీడలేదు. ప్రభుత్వం నియమించిన కమిటీలో మరో సభ్యుడు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమావేశానికి హాజరవలేదు. దీనితో బుగ్గనతో మాట్లాడాక, మరోసారి చర్చలకు పిలుస్తామని ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రి బొత్స, సజ్జల తెలియజేశారు. అయితే జీపీఎస్ అంశంపై చర్చించేందుకైతే తాము రాబోమని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను అమల్లోకి తెస్తామని విస్పష్టమైన ప్రకటన చేస్తేనే చర్చలకు వస్తామని చెప్పడంతో సీపీఎస్ అంశం మళ్లీ రసకందాయంలో పడింది.
ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా మేలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వ ఉంది. పలు దఫాలుగా చర్చలు జరిపి ఈ సమస్యకు త్వరలోనే ముగింపు పలకాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఉద్యోగులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ అంశంపై తగు నిర్ణయం తీసుకుంటుందని వారికి సజ్జల చెప్పారు. అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు’’ అని సమావేశం అనంతరం ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే మరియదాస్‌పాత పింఛను విధానంపైనా.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అమలవుతున్న విధానంపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చామని.. సానుకూల స్పందన ఆశిస్తున్నామనుకున్నాం కానీ ప్రభుత్వం ఆ దిశగా కాకుండా జీపీఎస్ అమలు చేస్తామని చెప్పడం పట్ల ఉద్యోగ సంఘాలు అభ్యంతరం తెలియజేశాయి. దీనితో సీపీఎస్ కధ మళ్లీ ముందుకొచ్చినట్టు అయ్యింది. సాధ్యమైనంత వరకూ సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం ఎక్కడా అనుకూలంగా లేదనే సంకేతాలు ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం తెలియజేసింది.