ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపినా.. ఇంకా పూర్తికాని ఉద్యోగుల సర్వీస్ ప్రొబేషన్, విడుదల కానీ సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ మోకాలడ్డుతున్నాయి. వినడానికి కాస్త ఇబ్బందిగానే ఉన్నా ఇది ప్రక్రియ ముందుకి సాగడానికి వీలులేకుండా ఉన్న సాంకేతిక వాస్తవం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఒక లక్షా 21 వేల మంది సచివాలయ ఉద్యోగల సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం జీఓనెంబరు 5 ద్వారా ఇటీవలే ప్రకటించి ఆగస్టు1 నాటికి కొందరికి సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేసి.. కొత్త పేస్కేలు కూడా అమలు చేసింది. ఇదే సమయంలో మెటర్నటీ లీవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల సర్వీసు ప్రొభేషన్ మాత్రం ఆరు నెలలు సెలవులు తీసుకోవడంతో వారి సర్వీస్ ప్రొబేషన్ మరింత ముందుకి వెళ్లింది. ఫలితంగా జూలై 31 నాటికి రాష్ట్రంలో చాలా మంది సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ నిలిచిపోయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ పూర్తయిన తరువాత మాత్రమే ఉద్యోగులకు బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఇపుడు అన్నీ సాంకేతిక ప్రతిబంధకాలు మోకాలడ్డటంతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాస ఎదురవుతున్నది. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేయాలని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డిని కోరిన వెంటనే సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. దీనిపై కార్యాచరణ మొదలు పెట్టి, పాత ఉమ్మడి 13 జిల్లాల నుంచి ఎంత మంది ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ పూర్తయింది..? ఇంకా ఎంత మంది ఉద్యోగుల సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ కావాల్సి వుంది..? అనే సమాచారం తెలుసుకున్నపుడు.. ఇంకా చాలా మంది ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ పూర్తవలేదనే విషయాన్ని రాష్ట్ర అధికారులు గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని సీఎంఓకి సమాచారం అందించారు. వెంటనే సీఎంఓ నుంచి ఉద్యోగులందరి సర్వీసు ప్రొభేషన్ మొత్తం పూర్తయిన తరువాత మాత్రమే బదిలీలకు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని..లేదంటే చాలా మంది ఉద్యోగులు బదిలీలకు అర్హత సాధించరని చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది.
కారుణ్య నియామకాలు, పదోన్నతులు అలా..
రాష్ట్రప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో చాలా మంది సిబ్బందిని కారుణ్య నియామకాలు, మరికొందరిని నేరుగా వీఆర్ఏల నుంచి వీఆర్వోలుగా పదోన్నతి కల్పించింది. అలా వచ్చిన వారు చాలా మంది సచివాలయ శాఖలో ఉన్నారు. వారితోపాటు ఉద్యోగం వచ్చిన తరువాత ఆలస్యంగా చేరినవారు, మెటర్నటీ లీవులు తీసుకున్నవారు అత్యధిక సంఖ్యలోనే సచివాలయశాఖలో సర్వీస్ ప్రొభేషన్ కాకుండా ఉండిపోయారు. వాస్తవానికి పోయిన నెలలో రోజుల వ్యవధిలో కొంత మంది ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ పూర్తి అయినా జిల్లాశాఖల అధికారుల నుంచి ఆఖరి దస్త్రాలు డిఎస్సీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ సంతకం అయి జాబితాలు సిద్దం కాలేదు. దీనితో చాలా మంది ఉద్యోగులకి గత నెలలో సర్వీసు పూర్తయినా లిస్టులు రాని కారణంగా వారి సర్వీసు ప్రొబేషన్ పూర్తికాలేదు. అలాగని ఈ ఆగస్టు నెలలో అయినా వారికి సంబంధించిన జాబితాలు వస్తాయనుకుంటే ఆ జాబితాలు ఇంకా జిల్లా శాఖల కార్యాలయాలకు డిఎస్సీ కమిటీ చైర్మన్ నుంచి రాలేదు. దీనితో ఈనెలలో 20 నుంచి 25వ తేదీలోగా సాలరీలు పెట్టే సమయానికి జాబితాలు వస్తే తప్పా మరికొందరు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ అయి పేస్కేలు అందుకునే పరిస్థితి ఉండదు. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19జిల్లాశాఖలకు చెందిన జిల్లా అధికారులు ఇప్పటికే జాబితాలు రూపొందించి డిఎస్పీ చైర్మన్ కు ఫైల్స్ పంపారు. కానీ అటునుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీనితో తమ సర్వీసు ప్రొభేషన్ ఈనెలలో నైనా పూర్తవుతుందా..? లేదా అనే అనుమానాన్ని సచివాలయ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.
సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ తలనొప్పి..
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 శాఖల సిబ్బందికి సంబంధించి చాలా శాఖల సిబ్బందికి ప్రభుత్వం సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. ఉద్యోగులకు బదిలీలు చేయాల్సి వస్తే ముందుగా ప్రభుత్వం రూపొందించిన సర్వీసు నిబంధనల ఆధారంగా బదిలీలు చేపడతారు. బదిలీల్లో లోకల్ జిల్లాలు, నాన్ లోకల్ జిల్లాలకు ఉద్యోగులు బదిలీలు కోరుకుంటే దానికోసం ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించాల్సి వుంటుంది. అయితే వాటికోసం ప్రభుత్వం ఏవిధంగా నిబంధనలు రూపొందిస్తుందనే విషయంలో నేటి వరకూ క్లారిటీ లేదు. తొలుత అన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించి ప్రమోషన్ ఛానల్, సర్వీస్ రూల్స్ రూపొందిస్తే తప్పా బదిలీల విషయంలో క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఈ అంశాలన్నీ ద్రుష్టిలో పెట్టుకుంటే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఏ ఒక్క పని కూడా ముందుకి కదిలే పరిస్థితి లేదు. సచివాలయ ఉద్యోగులంతా విధుల్లోకి చేరి సుమారు మూడేళ్లు కావొస్తున్నా ప్రభుత్వం నేటికీ వారి సర్వీసు రూల్స్ విషయంలో ఎలాంటి జీఓలు జారీ చేయలేదు. కొన్ని శాఖలకు పదోన్నతులకు సంబంధించిన ఛానల్ ఏర్పాటు చేసినా..ఎన్నేలకు పదోన్నతి కల్పిస్తారనే విషయాన్ని కూడా అందులో పొందుపరచలేదు. దీనిని బట్టీ చూస్తే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ విషయంలో శాఖల వారీగా ప్రత్యేక జీఓలు వస్తే తప్పా బదిలీలకు సంబంధించిన ఫైలు ముందుకి కదిలే పరిస్థితి లేదు. ప్రభుత్వం బదిలీలకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ రాష్ట్రశాఖల అధికారులు చేసిన తప్పిదాల వలన ఇప్పట్లో బదిలీలు జరిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు.
బదిలీల ఆశలపై నీళ్లు చిలకరింపే..
సచివాలయ ఉద్యోగుల బదిలీల ఆశలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. సాంకేతికంగా నీళ్లు చల్లినట్టే కనిపిస్తుంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా తమ ఉద్యోగాలు రెగ్యులరైజేషన్, బదిలీలకు సంబంధించిన అర్జీలు ప్రభుత్వానికి పెడుతున్నారు తప్పితే.. 19శాఖలకు సంబంధించినంత వరకూ సర్వీసు రూల్స్, పదోన్నతుల విషయంలో ప్రత్యేకంగా జీఓలు విడుదల చేయాలనే విషయంలో ప్రభుత్వం ద్రుష్టికి ఒక్క అర్జీ కూడా వెళ్లిన దాఖలాలు కనిపించడం లేదు. సాధారణంగా ఒక కొత్త ప్రభుత్వశాఖ ఏర్పాటైతే ఏ శాఖకు అనుబంధంగా శాఖ ఏర్పాటవుతుందో..పాత శాఖలోని సర్వీసు నిబంధనలను కొత్తగా ఏర్పాటు చేసే శాఖలకు జతచేస్తారు. కానీ.. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన తరువాత ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా ప్రత్యేకంగా సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ కి సంబంధించి ప్రత్యేక జీఓలు జారీచేస్తూ వచ్చింది. రెండు మూడు ప్రభుత్వశాఖలు మినహా ఇతర శాఖలకు సంబంధించినంత వరకూ జీఓలు రాకపోవడంతో ఇపుడు ప్రభుత్వం బదిలీలకు ఆమోదం తెలిపినా..సాంకేతికంగా బదిలీలు చేపట్టలేని పరిస్థితి ఎదురైంది. దీనితో సచివాలయ ఉద్యోగుల బదిలీల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. అయితే ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగని, చూడని విధి విధానాలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రస్థాయి అధికారులు అమలు చేస్తుండటంతో..ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి కూడా గ్రామ, వార్డు సచివాలయశాఖలో నెలకొంది. చూడాలి.. గ్రామ, వార్డు సచివాల ఉద్యోగులకు సంబంధించి నేటి వరకూ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా, జీఓలు కూడా ఇవ్వకుండా బదిలీల విషయంలో అటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు, ఉద్యోగులకు ప్రభుత్వం ఏ విధమైన హామీ ఇస్తుంది.. ఏం చేసి చూపిస్తుందనేది..!