పదోన్నతలూ లేవు.. పూర్తిస్థాయి అధికారులూ లేరు


Ens Balu
11
Guntur
2022-08-22 01:44:28

ఆంధ్రప్రదేశ్ లోని కొత్తగా విభజించిన 13 జిల్లాల్లో వింత పరిస్థితి నెలకొంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఐ లాంటి సివిల్ సర్వీస్ అధికారులు తప్పా రాష్ట్రప్రభుత్వానికి చెందిన 75 ప్రభుత్వ శాఖల్లో పూర్తిస్థాయి జిల్లా అధికారులు లేరు. ఆగ మేఘాలపై రాష్ట్రప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా అయితే విభజించి గెజిట్లు విడుదల చేసింది తప్పితే..కొత్త జిల్లాలో మాత్రం అన్నిశాఖలకు జిల్లా అధికారులను నియమించకపోగా.. జిల్లాస్థాయి అధికారి హోదా లేకపోయినా..నియమించిన అధికారే జిల్లా అధికారి అవుతారని పేర్కొంది. అన్ని ప్రభుత్వ శాఖలకు ఇన్చార్జి అధికారులు, డిప్యూటేషన్ పై అధికారులు తప్పా..పూర్తిస్థాయి పదోన్నతి పొందిన అధికారులు లేరు. దీనితో కొత్త జిల్లాల్లో పరిపాలన గాడిన పడటం లేదు.. అలాగని ఉన్న ప్రభుత్వ శాఖల్లోనైనా పదోన్నతుల దస్త్రాలు కదులుతున్నాయా అంటే అవన్నీ ఆయా ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిల పేషీల్లో మూలుగుతున్నాయి. ఇటు పదోన్నతులు లేక..అటు పూర్తిస్థాయి అధికారి అని చెప్పుకోలే..కొన్ని జిల్లాల్లో ఒకే అధికారి రెండు మూడు శాఖలు కూడా అదనపుబాధ్యతలతో చూడాల్సి వస్తున్నది. ఇటు రాష్ట్రప్రభుత్వం కూడా సివిల్ సర్వీస్ అధికారులకి ఇచ్చే ప్రాధాన్యత రాష్ట్రశాఖల్లో జిల్లా అధికారులకు ఇవ్వడం లేదనే విషయం జిల్లా విభజనల తరువాత మరోసారి తేటతెల్లమవుతోంది.

అరకొర సిబ్బంది..జిల్లాకి ఒక్కరే అధికారి..
ప్రస్తుతం 75 ప్రభుత్వశాఖల్లో మినిస్టీరియల్ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొత్త జిల్లాల్లో వేళ్లపై లెక్కపెట్టేంత మందిని మాత్రమే ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వున్న సిబ్బందితో పనిచేయించాలంటే ప్రభుత్వ అధికారులు అదనపు సమయం పనిచేయాల్సి వస్తున్నది. అరకొర సిబ్బందితో కొత్తజిల్లాల్లో పనులు ముందుకి సాగకుండా ఎక్కడికక్కడే చతికలబడి ఉండిపోతున్నాయి. కొందరు జిల్లా అధికారులు తమ పైస్థాయి అధికారులతో మాట పడేకంటే అదనంగా రెండు మూడు గంటలకు పనిచేస్తే ఇచ్చిన పని పూర్తవుతుందనే ఉద్దేశ్యంతో ఉన్నసిబ్బందినే బ్రతిమిలాడుకొని పనులు చేయించాల్సి వస్తున్నది. కొన్నిచోట్ల మినిస్టీరియల్ సిబ్బందికి పని భారం అధికం కావడంతో తమను ఉంచితే ఉంచాలని..లేదంటే సెలవులు పెట్టి వెళ్లిపోతామని చెప్పే పరిస్థితికి తీసుకు వస్తున్నారు. దీనితో జిల్లా అధికారులు ఉన్నసిబ్బందితోనే ఎంత వరకూ పనులు జరిగితే అంతవరకూ పనులు చేయించుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వశాఖకు 5 నుంచి 13 రకాల మొబైల్ యాప్స్ ని అందుబాటులోకి తీసుకురావడంతో వాటి వినియోగానికే సమయం అంతా కేటాయించాల్సి వస్తున్నది. అందులోనూ జిల్లా అధికారులకే ప్రభుత్వం జిల్లాశాఖలకు ఇచ్చిన యాప్స్ వినియోగించడం రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అయితే జిల్లా అధికారి కింద డివిజనల్ స్థాయి, వారికింద మండల స్థాయి అధికారులు, అధిక సంఖ్యలో మినిస్టీరియల్ సిబ్బంది ఉండేవారు దానితో సాంకేతికంగా అవగాహన ఉన్నవారితో జిల్లా అధికారులు పనిచేయించుకునేవారు. ఆ పరిస్థితి జిల్లాల విభజన తరువాత పూర్తిగా మారిపోవడంతో ఉన్న ఒకే ఒక్క జిల్లా అధికారి నానా పాట్లు పడాల్సి వస్తున్నది.

పదోన్నతులకు ఆమడదూరంలో అధికారులు..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వశాఖల్లో ఎక్కడో ఒకటి అరా ప్రభుత్వ శాఖలకు మినహా మిగిలిన ప్రభుత్వ శాఖల్లో సిబ్బందికి, అధికారులకూ పదోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తున్నది. పదోన్నతులు కల్పించడం ద్వారా ఉద్యోగులకు, అధికారులకు ఇచ్చే జీతాలు పెరుగుతాయి. కొందరు అధికారులకైతే వసతులు కూడా సమకూర్చాల్సి వుంటుంది. ప్రభుత్వం ఆదాయంలోని అత్యధిక భాగం మొత్తం సంక్షేమ పథకాలకు కేటాయించడంతో ఉద్యోగులకు ఇచ్చే జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ఆర్ధిక భారం నెపంతో చాలా ప్రభుత్వశాఖల్లో ఇప్పటికే కల్పించాల్సిన పదోన్నతులు కల్పించకపోవడంతో సీనియర్ అధికారులు కూడా జూనియర్ అధికారులతో సమానంగానే విధులు నిర్వహించాల్సి వస్తున్నది. అలాగని పదోన్నతులు కల్పిస్తే ఆర్ధిక భారం పడి.. దాని ప్రభావం ప్రభుత్వంపై పడి ఖాళీ అయిన ఉద్యోగాల ప్రదేశంలో కొత్త ఉద్యోగాలు తీయాల్సి వస్తుందనే కారణంతో ఇటు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించకుండా ఏళ్ల తరబడి అలాగే వదిలాశారు. ప్రస్తుతం కొత్త జిల్లాల్లో అలా పదోన్నతులు కల్పించకపోవడం వలన పూర్తిస్థాయి జిల్లా అధికారులను ప్రభుత్వం నియమించలేక.. ఉన్నవారినే సర్ధుబాటు చేసి అందరినీ జిల్లా అధికారుల కోవకే తీసుకు వచ్చి పనులు చేయిస్తున్నది.

విధాన పరమైన నిర్ణయాలకు అన్నీ అడ్డంకులే..
ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖల్లోనూ పూర్తిస్థాయిలో జిల్లా అధికారులను నయమించకపోవడం వలన ప్రభుత్వశాఖల్లో విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సాంకేతిక కారణాలు మోకాలడ్డుతున్నాయి. ఇటీవల కాలంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్షా 21వేల మంది ఉద్యోగులను వారి సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ చేసి..వారికి కొత్త పేస్కేలు ఇవ్వడానికి ప్రభుత్వం పాత ఉమ్మడి జిల్లాల్లోని కలెక్టర్లు, జిల్లా అధికారులనే వినియోగించాల్సి వచ్చింది. అప్పటికి కొత్త జిల్లాలు ఏర్పాటై అన్ని ప్రభుత్వ శాఖలకూ అధికారులు, అన్ని జిల్లాలకు కలెక్టర్లను ప్రభుత్వం నియమించినా ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ ఫైలు విషయంలో పాత జిల్లా కలెక్టర్లు, ఉమ్మడి జిల్లాల అధికారులకే అధికారం కట్టబెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో జిల్లాలో అధికారులు, కొత్తగా వచ్చిన కలెక్టర్లు, ఎస్పీలు అలిగి ఈ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి కూడా తీసుకెళ్లారు. దానితో ఉమ్మడి జిల్లాల్లో ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ ఉమ్మడి జిల్లాల అధికారులతోనే పూర్తిచేయించాల్సి వచ్చిందని ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది.  అన్ని ప్రభుత్వశాఖలకు జిల్లా అధికారులు లేకపోవడంతో ఒక్కో జిల్లా అధికారికి రెండు మూడు జిల్లాలు ఇన్చార్జి బాధ్యతలు కూడా ప్రభుత్వం అప్పగించింది. అదే ప్రభుత్వం ఉన్న అధికారులకు, ప్రభుత్వశాఖల్లో పదోన్నతులు కల్పిస్తే పూర్తిస్థాయిలో కొత్త జిల్లాల్లోనూ అధికారులను నియమించడానికి మార్గం సుగమం అవుతుంది. కానీ ఇది ఆర్ధిక పరమైన అంశం కావడంతో ప్రభుత్వం రెండు అడుగులు వెనక్కివేసి ఉన్న అరకొర అధికారులతోనే పనులు చేయిస్తున్నది. ఇదే పద్దతి కొనసాగితే 2024 తరువాత అత్యధిక సంఖ్యలో అధికారులు, ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేస్తారు. అపుడు ఒకే సారి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అపుడు ఇపుడున్న ఆర్ధిక భారం కంటే వందరెట్లు భారం ప్రభుత్వంపై పడుతుంది. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే ప్రభుత్వశాఖల్లో అధికారులకు పదోన్నతులు కల్పించడం ద్వారా కొత్తజిల్లాల్లో పూర్తిస్థాయి అధికారులను నియమించడానికి, రానున్న కాలంలో కొత్త ఉద్యోగాల కల్పనకు, అధికారులు, సిబ్బంది కొరతను అధిగమించవచ్చును. దీనితో మార్గం సుగమం అయి విధాన పరమైన నిర్ణయాలు అమలు చేయడానికి, పరిపాలనను గాడిలో పెట్టడానికి వీలుపడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి..!