ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాల్లో ఈ-క్రాప్ బుకింగ్ లో కోట్ల రూపాయాల్లో జరిగిన అవినీతి వెనుక చాలా పెద్ద పెద్ద తలకాయలే ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిన్నగాక మొన్న సర్వీసుల్లో చేరిన సచివాలయాల్లోని అగ్రికల్చర్, హార్టికల్చర్ విలేజ్ అసిస్టెంట్లకు అసలు స్థానికంగా వున్న బినామీ రైతులు, భూములు, సర్వే నెంబర్ల జాబితాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై లోతుగా పరిశోధన జరుగుతోంది. గత రెండు రోజులుగా రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతున్న ఈ-క్రాప్ బినామీ స్కామ్ వెనుక భారీ గుంటనక్కలు దాగివున్నాయని చెతున్నారు. ప్రభుత్వం రైతులకు పంటనష్టాలు ఈక్రాప్ లో నమోదైన మొత్తాలన్నింటికీ పరిహారం ఇస్తుందని రాష్ట్ర సచివాలయం నుంచి సమాచారం అందుకునే రాష్ట్రవ్యాప్తంగా ఈ భారీ అవినీతికి పాల్పడినట్టు ఇప్పుడిప్పుడే అసలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన రెవిన్యూ రికార్డులు, సర్వే నెంబర్ల జాబితా మొత్తం సేకరించడంతోపాటు, వ్యవసాయశాఖలో రైతులు, కౌలు రైతుల జాబితాలను సేకరించి భారీమొత్తాన్ని కొల్లగొట్టడానికి పథక రచన చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాల్లోని అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు చెబుతున్న లెక్కలు, షోకాజ్ నోటీసులు ఇచ్చిన మొత్తాలు చూస్తుంటే ఇందులో ఎవరి పరిధిలో వారు చక్కగా సర్దేసుకున్నట్టుగానే కనిపిస్తున్నది..
సర్వేశాఖతో కాకుండా రెవిన్యూశాఖతో విచారణ..?
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు పాల్పడిన బినామీ బాగోతాన్ని వాస్తవానికి జిల్లా అధికారులు సర్వేశాఖతో విచారణ చేయిస్తే ఏ సర్వే నెంబరులో ఎంతెంత పరిధిలోని విస్తీర్ణంలో భూములు ఉన్నాయనే విషయం బయటకు తెలుస్తుంది. కానీ అధికారులు తెలివిగా రెవిన్యూశాఖలోని వీఆర్వోలు, ఆరఐలతో విచారణ చేపడుతున్నారని ఈ విషయంలో ముందుగానే రెవిన్యూ, అగ్రికల్చర్, హార్టికల్చర్ సిబ్బంది గ్రామపరిధిలోనే మిలాఖత్ అయినట్టు తెలిసింది. పంపకాలు, పర్శంటేజీలు కుదిరన చోట రికార్డులు బాగానే ఉన్నాయని, వీరిచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా అధికారులు కూడా ఇచ్చిన షోకాజ్ నోటీసులకు మమ అనే విచారణ పూర్తిచేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అంతే తప్పా అసలు భూముల రికార్డులకు సంబంధించి సర్వేశాఖలోని గ్రామ సర్వేయర్లతోగానీ, మండల సర్వేయర్లతో గానీ విచారణ చేయించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. కోట్ల రూపాయాల్లో అవినీతి జరగడంతో రెవిన్యూ అధికారుల వద్ద అయితేనే రికార్డులు సక్రమంగా ఉంటాయని జిల్లా అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు విచారణ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అందులోనూ విచారణ మొత్తం జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుండటంతో అంతా సక్రమంగానే జరుగుతుందనే విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చి తమకు అవినీతి మరకలను అంటుకోకుండా జిల్లా అధికారులు జాగ్రత్త పడుతున్నట్టుగా తెలిసింది.
తేడా వచ్చిన కోట్ల రూపాయలు అవినీతి కాదట..
ఈ-క్రాప్ బుకింగ్ లో జరిగిన కోట్ల రూపాయల అవినీతిని కప్పిబుచ్చేందుకు జిల్లా అధికారులు కూడా రోజు మాట.. పూటకో ప్రకటన మీడియాకి లీకులిస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు అగ్రికల్చర్, హార్టికల్చర్ సహాయకులు ఇచ్చిన సంజాయిషీలు నమ్మసక్యంగా లేవని ప్రకటించిన అధికారులు..ఈరోజు షోకాజ్ నోటీసులైతే ఇచ్చాం గానీ తేడాగా వచ్చిన మొత్తం అంతా అవినీతి జరిగినట్టు కాదని..అది ప్రాధమిక సమాచారం మాత్రమేనని మాట మార్చుతుండటం వెనుక జరిగిన అవినీతి మొత్తాన్ని కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలా అనుకుంటే నెల్లూరు, పశ్చిమగోదావరి, అంభేద్కర్ కోనసీమ జిల్లాల్లో సుమారు 50 మందికి పైగా వీఏఏలు, వీహెచ్ఏలను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నిస్తే.. అక్కడి సంగతి మాకు తెలియదు కానీ..మా జిల్లాల్లో మాత్రం పక్కాగా విచారణ చేపడుతున్నామని మిగిలిన జిల్లాల్లో అధికారులు రక రకాలు మాట్లాడుతుండటంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుఫాను సమయంలో పంట నష్టం పెద్దగా జరగలేదని ప్రకటించిన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు ఇపుడు ఈ-క్రాప్ బుకింగ్ పక్కాగానే జరిగిందని చెప్పడం వెనుక పలువురు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.
తేడా మిల్లర్ల దగ్గర నుంచి బినామీరైతుల సమాచారం
అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు ఈ-క్రాప్ బుకింగ్ చేసే సమయంలో కొందరు అవినీతి మిల్లర్ల దగ్గర నుంచి బినామీ రైతుల జాబితా సేకరించి ఈ భారీ స్కామ్ కి పాల్పడినట్టు తెలుస్తుంది. గతంలో మిల్లర్ల ద్వారానే ధాన్యం కొనుగోలు చేసిన సమయంలో రైతులు, కౌలు రైతులు సమాచారం మొత్తం సేకరించి ఈ-క్రాప్ పంటనష్టాలు నమోదు చేసే సమయంలో గ్రామ సచివాలయ అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్ల ద్వారా నమోదు ప్రక్రియ తతంగం నడిపి ఆపై వచ్చిన మొత్తాలను కూడా నేరుగా రైతుల ఖాతాల నుంచే డ్రా చేసినట్టుగా చెబుతున్నారు. అలా డ్రా చేసిన సమయంలో అటు రెవిన్యూ అధికారులు, ఇటు అగ్రికల్చర్, హార్టికల్చర్ శాఖల్లోని కొందరు అధికారులు, రెవిన్యూ అధికారులకి ఇవ్వాలని చెప్పి పంపకాలు కూడా చేసినట్టుగా తెలిసింది. చాలాచోట్ల సక్రమంగా పర్శంటేజీలు పంపకాలు జరిగిన చోట రికార్డులు సక్రమంగా ఉన్నాయని.. అలా పంపకాలు పూర్తికాని చోట్ల మాత్రమే అవినీతి జరిగినట్టుగా బయటకి వచ్చిన తరువాత.. సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు రావడానికి కారణం అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
అవినీతిని కప్పిబుచ్చేందుకు రంగంలోకి దిగిన మధ్యవర్తులు
రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయాల్లో జరిగిన ఈ-క్రాప్ బుకింగ్ బినామీ అవినీతిని ఏం జరగనట్టుగా కప్పిబుచ్చేందుకు అన్నిజిల్లాల్లో కొందరు ఆయా నియోజకవర్గాల్లోని వచ్చే ఎన్నికల్లో సీటు దక్కదని పక్కాగా నమ్మకానికి వచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రంగంలోకి దిగినట్టుగా జిల్లాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంతో మరికొందరు ఎమ్మెల్యేలు, ఇతర మాజీ మంత్రులు ఈ అవినీతి అంశాన్ని తమ దగ్గరకు తీసుకొచ్చి తమను మధ్యలోకి లాగొద్దని చెప్పినట్టుగా కూడా చెబుతున్నారు. అధికారికంగా అగ్రికల్చర్, హార్టికల్చర్ గ్రామసచివాలయ సిబ్బంది అవినీతికి పాల్పడినా అందులో బయటకు తెలియకుండా రెవిన్యూశాఖకు చెందిన వీఆర్వోలు, ఆర్ఐలు కొన్ని చోట్ల తహశీల్దార్లు కూడా ఉన్నట్టుగా తెలిసింది. భూములు విషయం, సమాచారం, సర్వేనెంబర్లు కేవలం రెవిన్యూ అధికారులు, సిబ్బంది దగ్గరే ఉండటంతో జరిగిన అవినీతికి సంబంధించి నొక్కేసిన మొత్తం పంచుకోవడానికి, పర్శంటేజీలు ఇప్పించడానికి రెవిన్యూ భాగస్వామ్యం అయినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యవర్తులను కూడా వీళ్లే గుర్తించి రాయబారం కూడా నడుపుతున్నట్టు తెలిసింది. ఆ విధంగా నొక్కేసిన దానిలో సింహభాగం ఇస్తే అసలు అవినీతే జరగనట్టుగా చూస్తామని సచివాలయ అవినీతి రాబంధులకు భరోసా ఇచ్చారని సమాచారం.
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఇదే ప్రధాన అస్త్రం
2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గ్రామ, వార్డు సచివాలయశాఖలోని అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు చేసిన ఈ భారీ ఈ-క్రాప్ బినామీ అవినీతినే అస్త్రాలు చేసుకోవాలని చూస్తున్నట్టుగా అపుడే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏఏ జిల్లాల్లో ఎంతెంత మొత్తంలో అవినీతి జరిగింది, ఎంత మంది సిబ్బంది సస్పెండ్ కి గురయ్యారనే సమాచారాన్ని సేకరించి ఎదురుదాడి చేయడానికి సిద్దమవుతున్నారని తెలిసింది. దానికోసం బినామీ రైతుల పేర్లతో జరిగిన మోసాన్ని బయటపెట్టి ప్రజల ముందుకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ కూడా చేపట్టినట్టుగా చెబుతున్నారు.అంతే కాకుండా ఏ బినామీ రైతుల పేర్లు, సర్వే నెంబర్లతో అయితే భారీ మొత్తంలో కొల్లగొట్టారో సదరు రైతులు, కౌలు రైతులతోనే ఆందోళనలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బినామీ రైతులే రోడ్డెక్కడం విశేషం.
ముఖ్యగమనిక..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ప్రతీ విషయాన్ని ప్రజల ముందుకి తీసుకెళ్లే భాద్యతను స్వీకరించిన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ Ens Live, అధికారికి న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా జరిగిన వాస్తవాలను ప్రత్యేక కథనాలుగా అందిస్తున్నామని తెలియజేస్తున్నాం. అంతే తప్పా సచివాలయ ఉద్యోగులపై గానీ, ప్రజాప్రతినిధులపైగానీ, ప్రభుత్వంపై గానీ ఎలాంటి తేడా అభిప్రాయాలు లేవని ప్రకటిస్తున్నాం. ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందుకి ప్రత్యేక కథనాలు తెచ్చే ఈఎన్ఎస్ భారీ స్థాయిలో జరిగిన అవినీతి విషయంలో కూడా వాస్తవాలను బయటకు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా పెద్ద సాహసమే చేస్తున్నామని..అయినా అవినీతిని బయట పెట్టే ప్రక్రియలో ఎవరికీ భయపడేది లేదని కూడా దైర్యంగా ప్రకటికిస్తున్నాం. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావివ్వకుండా ప్రజల పక్షాన మాత్రమే నిలబడి, ప్రభుత్వానికి నష్టం తెచ్చిన గ్రామసచివాలయ అవినీతి రాబంధుల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గమని కూడా మాటిస్తున్నాం..!