పేదల జోలికి వెళ్లొద్దని, వారు సాగుచేసుకుంటున్న భూములకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ భూపరిపాలన చీఫ్ కమిషనర్ జి.సాయిప్ర సాద్ అధికారులను ఆదేశించారు. భూ కబ్జాలకు పాల్పడే మోతుబరులపై కఠిన చర్యలను తీసుకోవాలని సూచించారు. పేదలకు వ్యతిరేకంగా పనిచేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకం క్రింద చేపట్టిన సమగ్ర భూ సర్వేపై, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో, సర్వే, భూరికార్డుల కమిషనర్ సిద్దార్ధజైన్ తో కలిసి, సిసిఎల్ఏ సాయిప్రసాద్ మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా మూడు జిల్లాల్లో జరుగుతున్న రీసర్వే ప్రక్రియ వివరాలను కలెక్టర్లద్వారా తెలుసుకున్నారు.
భూ సర్వే ప్రక్రియను ఖచ్చితంగా, మరింత పకడ్భందీగా నిర్వహించడంతోపాటు, వివరాలను మరింత సరళంగా నమోదు చేసే ప్రక్రియపై దృష్టిపెట్టారు. దీనికోసం వివిధ స్థాయి అధికారులు, సిబ్బంది అభిప్రాయాలను తెలుసుకున్నారు. నమోదు చేసే సమయంలో వారికి ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై ఆరా తీశారు. డేటా ఎంట్రీ సులభంగా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకు పడుతున్న సమయంపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ మాట్లాడుతూ, గ్రౌండ్ ట్రూతింగ్ ఖచ్చితంగా చేస్తే, మిగతా ప్రక్రియ కూడా సజావుగా జరుగుతుందని అన్నారు. విఆర్ఓ లాగిన్‌లోని అంశాలను 38 నుంచి 20కి తగ్గిస్తామని చెప్పారు. భూముల కేటగిరీకి సంబంధించి అగ్రికల్చర్, హార్టికల్చర్ లేదా నాన్ అగ్రికల్చర్ విభాగాలను మాత్రమే ఉంచుతామని తెలిపారు. అలాగే నీటి వనరులకు సంబంధించి మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ఆప్షన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రైతుల వ్యక్తిగత వివరాలను నమోదు చేసే ప్రక్రియను కూడా మరింత సరళంగా చేస్తామన్నారు. అదేవిధంగా 9(2), 10(2) నోటీసులను జారీ చేసేందుకు ప్రింటెడ్ ఫారాలను అందజేస్తామని చెప్పారు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా 22 ఏలో నమోదు చేయాలని ఆదేశించారు. అసైన్డ్ భూమి కొన్నవారికి పిఓటి ప్రకారం నోటీసు ఇచ్చి, దానిని ప్రభుత్వ భూమిగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములను సాగుచేసుంటున్న నిరుపేదల జోలికి వెళ్లొద్దని సిసిఎల్ఏ స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్, మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జెసి ఓ.ఆనంద్, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు, ఆర్‌డిఓలు, మూడు జిల్లాల సర్వేశాఖ ఎడిలు, తాశిల్దార్లు, డిటిలు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.