ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి మేలు కలిగేలా వైద్య ఆరోగ్యశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌లోకి అదనంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలను శాశ్వతంగా చేరుస్తూ వైద్య ఆరోగ్యశాఖ జీఓఎంఎస్ నెంబరు 49ని విడుదల చేసింది. ఇక ప్రతీ ఉద్యోగుల హెల్త్ కార్డులను ఏటా రెన్యువల్ చేయాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా 46 రకాల క్యాన్సర్(సర్జికల్ అంకాలజీ-10, మెడికల్ అంకాలజీ -32, రేడియేషన్ అంకాలజీ-4) చికిత్సలు అందేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. అవి తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా అందులో వివరించింది. కాగా, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఈ చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు ఆదేశించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.