మే 4న తిరుమల‌లో శ్రీ నృసింహ జయంతి


Ens Balu
13
Tirumala
2023-04-27 11:26:34

తిరుమల‌ శ్రీవారి ఆల‌యంలో మే 4న నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూల‌మూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు. వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల‌ వసంత మండపంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల‌ వరకు శ్రీ నరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.  శ్రీవారి ఆల‌య మొదటి ప్రాకారంలో గర్భాల‌యానికి ఈశాన్యం వైపున గల‌ మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆల‌యం ఉంది. శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతుల్లో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆల‌యంలో శ్రీ రామానుజాచార్యుల‌ వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.