ముందు ఉద్యోగులకు బదిలీలు.. ఆపై సచివాలయ శాఖకు చట్టబద్దత


Ens Balu
549
Tadepalli
2023-05-16 02:03:48

గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం ఈశాఖ చట్టబద్ధత కంటే.. బదిలీలు చేపట్టి తర్వాత అసెంబ్లీ సమా వేశాల్లో చట్టబద్దత తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కేవలం 10నెలలు మాత్రమే ఉండ టంతో ఈలోగా ఇతర 75శాఖల ఉద్యోగులు, అధికారులతోపాటు, సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీలు చేపట్టిన తరువాత చట్టబద్ధతకు కార్య రూపం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. దానికోసం కూడా విధి విధానాలు రూపొందించాలని ఇప్పటికే జిఏడి నుంచి సచివా లయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, డైరెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయా ల్లోని 1.25 లక్షలకు పైచిలుకు ఉద్యోగులకు(ప్రొబేషన్ పూర్తిచేసుకున్నవారికి) బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ బదిలీల ప్రక్రియలో ఇతర శాఖల్లోని సబార్డినేట్ సర్వీసు రూల్సు పాటించి జిల్లాలోపల బదిలీలు, అంతర్ జిల్లాలు, స్పౌజ్ కోటా, మ్యూచ్ వల్, ఎగ్జిస్టింగ్ వేకేన్సీ, హెల్త్ ఇష్యూస్ వారీగా బదిలీలు చేపడతారా వీరికి ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందిస్తారా అనే విషయంలో మా త్రం స్పష్టత రాలేదు.  కాకపోతేకే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్టుగా ఏపీ సబార్డినేట్ సర్వీసు నిబంధనలనే సచివాలయ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని మాత్రం ప్రాధమిక అంచనాకు వచ్చినట్టుగా తెలిసింది.

వాస్తవానికి ప్రభుత్వంలో ఏదైనా ఒక  శాఖను కొత్తగా ఏర్పాటు చేసినపుడు అసెంబ్లీ సభ్యుల ఆమోదంతో ఎలాగైతే చేస్తారో..అదే అసెంబ్లీ సాక్షిగా దానికి చట్టబద్ధత కూడా తీసుకు వస్తారు. కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖ విషయంలో ముందుది వెనుక, వెనుకది ముందు అన్నట్టుగా ఒక్కో ప్రక్రియ ఒక్కోసారి చేపట్టడంతో ఉద్యోగులు సైతం గందరగోళంలో పడిన పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు ఈశాఖలో పనిచేసే 19శాఖల సిబ్బందికి చాలా వరకూ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. కొన్నిశాఖల సిబ్బందికి వాటిని ఏర్పాటు చేసినా.. మహిళాపోలీసు విభాగంలో ఇంకా కోర్టు కేసులు నలుగుతున్నాయి. వీరికి సాధారణ పోలీసులు మాదిరిగా యూనిఫాం ఇచ్చే విషయంతో  కూడా పోలీసుశాఖ ఇంకానిర్ణయం తీసుకోలేదు. దానికి కూడా ఇంకా స్పష్టత రావాల్సి వుంది. పేరుకి వీరు హోంశాఖ ఉద్యోగులు అయినప్పటికీ, సచివాలయాల్లో మాత్రం అధికంగా ఐసిడిఎస్, రెవిన్యూశాఖకు చెందిన బిఎల్వో లాంటి విధులు చేస్తున్నారు. ఈ తరుణంలో జిఏడి నుంచి వచ్చిన సూచనలు ఆధారంగా వీరికి బదిలీలు చేపడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా చూస్తున్నారని సమాచారం. ఆ విధంగా ఒక్కసారి విధివిధానాలు రూపొందిస్తే మూడు దఫాలుగా జరిగిన ఈ నియామకాల్లో విధుల్లో చేరిక వారికి కూడా బదిలీలకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయశాఖలోని కొన్ని గ్రామీణ శాఖలకు చెందిన సిబ్బంది ఉండటంతో వారిని వార్డు సచివాలయాలకు బదిలీ చేసే అవకాశం లేదని కొందరు.. ఒకేశాఖ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంటే అక్కడి కూడా ఖాళీలను బట్టీ చేస్తారని మరికొంత ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అర్భన్ ప్రాంతాల్లో పోలీస్, హెల్త్, ఇంజనీరింగ్, వెల్ఫేర్, సర్వేయర్, వీఆర్వో, పశుసంవర్ధక, ఇంజనీరింగ్, ఫిషరీష్ శాఖలకు సంబంధించిన స్పష్టత రావాల్సి వుంది. మిగిలిన శాఖలైన అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీ కల్చర్, పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ లు వార్డు సచివాలయాల్లో పనిచేసే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ కారణాలు కూడా సచివాలయ ఉద్యోగుల సామాజిక మాద్యమాల గ్రూపుల్లో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం బదిలీలు చేపడుతుందని స్పష్టత ఇచ్చితన తరువాత చాలా మంది వారి వారి సొంత జిల్లాలకు వెళ్లడానికి మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్స్ కోసం పెద్ద ఎత్తు శోధనలు మొదలు పెట్టారు. ఎవరికుండే పరిచయాలను, రాజకీయనాయకులతో పలుకుబడి, అధికారులను ప్రశన్నం చేసుకొని తొలిసారిగా జరిగే బదిలీల్లోనే ఉన్న ప్రాంతం నుంచి కదిలిపోవాలనే బలంగా ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేసుకుంటున్నారు.

ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈశాఖలో ఆదినుంచి ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. 19శాఖలకు చెందిన ప్రిన్స్ పల్ సెక్రటరీలు, కమిషనర్లు, ఇటు జిల్లా కలెక్టర్లతో పరస్పర సహకారం, సమన్వయం లేకుండానే ఇంత కాలం నెట్టుకొచ్చేశారు. మరోవైపు గ్రామసచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శిలు వారే మిగిలిన సిబ్బందికి జీతాలు ఇస్తున్నట్టుగా తెగ ఫీలపైపోయి వారి మాతృశాఖల విధులు నిర్వర్తించే సమయంలో ఉద్యోగులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తున్నారు.  ముఖ్యంగా వారి ఇబ్బందులు తాళలేక ప్రభుత్వం కల్పించనున్న ఈ బదిలీల్లో వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలని చూస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. ఈ విషయంలో వీరికి సంఘాలు ఉన్నప్పటికీ విధానపరమైన అంశాలను లేవనెత్తకుండా కేవలం ప్రభుత్వానికి విధేయత ప్రదర్శించే కార్యక్రమం మాత్రమే చేస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న శాఖపరమైన విధినిర్వహణ విషయంలో అటు ప్రభుత్వంలోని ముఖ్యకార్యదర్శి నుంచి, ఆయాశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, డైరెక్టర్లు కూడా జిల్లా కలెక్టర్లకు సైతం సమన్వయాన్ని చేయలేకపోవడం చర్చనీయాంశం అవుతుంది. తమ ఉద్యోగాలు రెగ్యులర్ అయినా ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా తమకు అన్ని జిఓలు, పదోన్నతులు, బదిలీలు జరుగతాయా లేదా అనే అనుమానం ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులను తీవ్రంగా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో జరిగే బదిలీల ప్రక్రియలో ఒక్కో విషయం ఒక్కోసారి వైరల్ అవుతోంది. చూడాలి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో ఎలాటి నిబంధనలు పాటించి, ఈ శాఖకు చట్టబద్ధత కల్పిస్తుందనేది..!