జగనన్నకు చెబుదాంపై ప్రభుత్వం వినూత్న పర్యవేక్షణ


Ens Balu
128
Tadepalli
2023-05-17 04:04:52

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై వినూత్న రీతిలో పర్యవేక్షణ చేపట్టింది. ఇప్పటి వరకూ స్పందనలో వచ్చిన ఆర్జీలను ఆన్ లైన్ చేసిన అధికార యంత్రాంగం ఇపుడు సమస్య పరిష్కారం అయిన తరువాత సదరు కుటుంబం యొ క్క వివరాలు, సమస్య ఏ శాఖకు చెందినదో తెలియజేస్తూ ఆన్ లైన్ లో ఫోటోతో సహా అప్ లోడ్ చేస్తున్నారు. ఆ కార్యక్రమం గ్రామాల్లో గ్రామస చివాలయ సిబ్బందితోనూ, పట్టణాల్లో వార్డుు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. తద్వారా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎన్ని కుటుంబాలకు లబ్ది చేకూరిందనే విషయాలను ఒక ప్రత్యేక గణన చేపడుతున్నారు.  అంతే కాకుండా ఐవీఆర్ ఎస్ ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా పరిష్కరించి ఆ డేటాను సచివాలయాలకు ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా పంపిస్తు న్నారు. ఒకేసారి సచివాలయాల్లోని ఏ తరహా ప్రభుత్వసేవలు అందుతున్నాయి.. సిబ్బందికి నేరుగా ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమం కూడా జరిగిపోతున్నది. ఇప్పటి వరకూ పంచాయతీ అన్నా, సచివాలయం అన్నా కార్యదర్శిలు మాత్రమే ప్రజలకు కనిపించేవారు. జగనన్న కు చెబుదాం కార్యక్రమంతో మొత్తం సచివాలయాల్లోని 19శాఖల సిబ్బంది కూడా ప్రజలకు చేరువ అవుతున్నారు.

ప్రతీజిల్లాలోనూ సోమవారం వచ్చే ఫిర్యాదుల జాబితా మొత్తం 75 ప్రభుత్వశాఖల ద్వారా మండలాలకు, అక్కడి నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళుతుంది. ఫిర్యాదు ఆధారంగా సమస్య పరిష్కారం చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వశాఖల పైనే ఉంటుంది. ఫిర్యాదు అందిన దగ్గర నుంచి సమస్య పరిష్కారం అయ్యేంతవరకూ సదరు జిల్లాశాఖ అధికారి బాధ్యత వహించాల్సి వుంటుంది. సమస్య పరిష్కారం కాగానే సచివాలయ సిబ్బంది ఆ వివరాలు, ఫోటోను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తారు. ఇదే సమయంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుతున్న సేవలు కూడా ప్రజలకు నేరుగా తెలిసే అవకాశం ఏర్పడింది. సచివాలయాలు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి సిబ్బంది ప్రజలతో మమేకం అయ్యేలా ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు ఇచ్చినా అవి బుట్టదాఖలే అయ్యాయి. కానీ జగనన్నకు చెబుదాం కార్యక్రమంతో మాత్రం రాష్ట్రంలోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమాలరు 1.25లక్షల పైచిలుకు సిబ్బంది ఇపుడు ప్రజల వద్దకే నేరుగా వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాశాఖల అధికారులు కూడా ఇదే పనిపై దృష్టిసారించాల్సి వుంటోంది. దానికితోడు జిల్లా కలెక్టర్లు స్పందన కార్యక్రమంలో ఖచ్చితమైన ఆదేశాలు జారీచేస్తుండటంతో ప్రజల వద్దకు ఈ కార్యక్రమం సత్వరమే వెళ్లడానికి మార్గం సుగమం అయ్యింది. అయితే ప్రజల నుంచి అర్జీలు కూడా కలెక్టరేట్లకే వెళుతుండటంతో మండలాలు, సచివాలయాల్లో దరఖాస్తులు రావడం లేదు. జిల్లాశాఖల నుంచి తప్పితే, నేరుగా ప్రజలు సచివాలయాలను సద్వినియోగం చేసుకోవాలనే ఆదేశాలను జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు సైతం అమలు చేయలేకపోతున్నారు. వాస్తవానికి గ్రామస్థాయి సమస్యలు సచివాలయాల్లోనూ, మండలస్థాయి సమస్యలు మండల కేంద్రాల్లోనూ, జిల్లా స్థాయిలో సమస్యలు కలెక్టరేట్లలోనూ దరఖాస్తులు చేసుకునేవిధంగా ప్రభుత్వం కార్యాచరణ చేసినా, నేరుగా ప్రజలందరూ కలెక్టరేట్లనే ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ అనతి కాలంలోనే జగనన్నకు చెబుదాం కార్యక్రమం  ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నేరుగా ప్రజలతో మమేకం కావడానికి ప్రత్యేక వేదికలా మారింది. ఇదే పద్దతి కొనసాగితే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడంతోపాటు, ప్రజల సమస్యలు కూడా సత్వరమే పరిష్కారానికి నోచుకుంటాయి..!
సిఫార్సు