ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక..ప్రజల ఇంటిముంగిటే సమస్యలు తీర్చే జనదీపిక.. గ్రామ, వార్డు సచివాలయ శాఖ అడుగడుగునా అన్యా యానికి గురవుతుంది. రాష్ట్రప్రభుత్వం ఈ శాఖలోని ఉద్యోగులకు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వెంటనే ప్రొభేషన్ చేస్తామని చెప్పి తొమ్మిది నెలలు ఆలస్యంగా చేయ డంతో ఆదిలోనే పేస్కేలు, ప్రొబేషన్ రెగ్యులైజేషన్ సమయంలో కలవాల్సిన 2 ఇంక్రిమెంట్లు కోల్పోయిన ఉద్యోగులు ఇపుడు డిఏలు కూడా కోల్పోయే పరిస్థితి దాపు రించిం ది. సక్రమంగా రెండేళ్లు పూర్తికాగానే ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ పూర్తయి వుంటే ఇపుడు ఉద్యోగులకు ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులతోపాటు డిఏ అందుకోవడానికి ఆస్కారం వుండేది. కానీ అది జరగలేదు. ప్రభుత్వం విడుదలచేసిన డిఏ బకాయి గ్రామ, వార్తు సచివాలయ ఉద్యోగులకు వర్తిస్తుందో లేదో తెలియకుండా ఉంది. సదరు డిఏ జిఓలో ఈశాఖ ప్రస్తావన లేకపోవడమే కారణంగా కనిపిస్తున్నది. పీఆర్సీ ద్వారా పేస్కేలు పెంచినట్టు చూపించిన ప్రభుత్వం సర్వీసు ప్రొభేషన్ అంటే ఏడాదికి ఒక ఇంక్రిమెం టు చొప్పున, రెండేళ్లకు రెండు ఇంక్రిమెంట్లు రెగ్యులర్ అయిన తరువాత ఉద్యోగుల జీతాల్లో ప్రభుత్వం కలపాల్సి వుంది. కానీ అలా ప్రభుత్వం చేయలేదు. అలా అప్పుడే ఉద్యోగులకి తొలినష్టం ప్రారంభం అయ్యింది. ఆ తరువాత కూడా ఆ విషయాన్ని ఈశాఖ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లకపోవడం విశేషం.
గ్రామ, వార్డు సచివాలయ శాఖకు ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా అన్ని ప్రయోజనాలు వర్తించవని ఇక్కడే ప్రధమ నిరూపణ అయ్యింది. ఏ ప్రభుత్వశాఖలోనైనా రెగ్యులర్ ఉద్యోగాల్లో చేరిన తరువాత రెండేళ్లకి సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారు. ఆ సమయంలో 2 ఇంక్రిమెంట్లు కలిపి పేస్కేలుకి జమచేస్తారు. కానీ సచివాలయ ఉద్యోగులకు సర్వీసు రెగ్యులర్ చేసే సమయానికి పీఆర్సీని వర్తింప చేస్తున్నట్టు చూపించి వాటిని కోతవేసేశారు. వాస్తవానికి 2 ఇంక్రిమెంట్లు కలిసిన తరువాత పీఆర్సీ వర్తిస్తే ఒక్కో సచివాలయ ఉద్యోగికి కనీసం 3 నుంచి 5వేల రూపాయల జీతం పెరిగేది. అలా జరగకపోగా ఆలస్యంగా సర్వీసు ప్రొబేషన్ చేయడం ద్వారా పేస్కేలుతోపాటు, సుమారు 2డిఏలను కూడా కోల్పోయారు ఉద్యోగులు. అసలు సచివాలయశాఖ ఉద్యోగులకు ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 1999 వర్తింపచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా ప్రయోజనాలు వర్తింపజేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధం కాకుండా ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వంలోని ఏ ప్రభుత్వశాఖలోనైనా వారికి కేటాయించిన శాఖ విధులు మాత్రమే చేస్తారు. కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖలో మాత్రంలో అన్ని శాఖల విధులు, ఖాళీగా ఉన్న సిబ్బంది శాఖల విధులు కూడా బలవంతంగా నిర్వర్తించాల్సి వస్తున్నది. ఇంతచేస్తున్నా, తమ శాఖకు ప్రభుత్వం కల్పిస్తామని చెప్పిన చట్టబద్ధత నేటికీ కల్పించలేదని ఉద్యోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలు, నిర్మాణ రంగ కంపెనీల్లో వేలాది రూపాయాల జీతాలు వదులుకొని రెగ్యులర్ ఉద్యోగాలనే ఒకే ఒక్కకారణంతో వచ్చిన తమకు తీవ్ర నష్టం జరుగుతోందని వాపోతున్నారు. ఒక సందర్భంలో అసలు మావి రెగ్యులర్ ఉద్యోగాలా..లేదంటే అలా చెప్పుకునే కాంట్రాక్టు ఉద్యోగాలో అర్ధంకాని పరిస్థితి నెలకొంటుందని కూడా చర్చకు తెరలేపుతున్నారు. ఇప్పటికే ఉద్యోగాల్లోకి చేరిన తరువాత మంచి ఉద్యోగాలు వస్తే.. కొందరు ఈ సచివాలయ ఉద్యోగాలను వదిలి వెళ్లిపోవడంతో చాలా చోట్ల భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నామని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం వాస్తవానికి ఆ సేవలు అందించే ఉద్యోగుల విషయంలో మాత్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందనడానికి తాజా పరిణామాలే ఉదాహరణ.
రానున్న రోజుల్లో గ్రామ, వార్డు సచివాలయశాఖను మరింత బలోపేతం చేసి ప్రజలకు ఉత్తమంగా సేవలు అందిస్తామని ప్రకటిస్తున్న ప్రభుత్వం ప్రచారాలకు పెద్దపీట వేసి.. ఈ శాఖలో పనిచేసే ఉద్యోగుల విషయంలో మాత్రం తీవ్ర అన్యాయం చేస్తోంది. సరిగ్గా ఉద్యోగుల సర్వీసు ప్రొభేషన్ చేసే సమయంలో పీఆర్సీ వర్తింపజేస్తున్నామని చెప్పి, ఐఆర్ వీరికి వర్తింపజేయలేదు. ఆ తరువాత ఆలస్యంగా సర్వీసు రెగ్యులర్ చేయడం వలన సుమారు రెండు డిఏలు, పూర్తిస్థాయి పేస్కేలు కోల్పోవాల్సి వచ్చింది. ఇపుడు తాజాగా డిఏ కూడా కోల్పోయారు ఉద్యోగులు. ఇదే పరిస్థితి కొనసాగినా..ఈ శాఖకు చట్టబద్దత కల్పించి ఇతర ప్రభుత్వశాఖలకు వర్తింపజేసే ప్రయోజనాలు వర్తింపజేయకపోయినా ఉద్యోగులు మరింతగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయంలో కమిషనర్, ముఖ్యకార్యదర్శిలు చొరవతీసుకోకపోతే పరిస్థితి విషమించి, చాలా ప్రయోజనాలు కోల్పోతారు సచివాలయ ఉద్యోగులు. ఇంత దారుణంగా నష్టపోయిన సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి..!