ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 జిల్లాల్లోని అన్ని గ్రామాలను మండల కేంద్రాలకు అనుసంధానం చేస్తూ ఇంటర్నెట్ ను విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఏపిఎస్ఎఫ్ఎల్ ను ఆర్ధికంగా బలోపేతం చేయడంతోపాటు, అన్ని గ్రామాలకు 5జి ఇంటర్నెట్ అందించాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. ఎంపిక చేసిన గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ ను మరింతగా అభివ్రుద్ధి చేయనున్నారు. రాష్ట్రంలోని గ్రామాల్లో ఇప్పటి వరకూ సాధారణ కేబుల్ టివి, డిటిహెచ్, ఓటిటి యాప్ లు అందుబాటులోకి రాగా..అత్యంత వేగంగా ఏపీ ఫైబర్ నెట్ ను అభివ్రుద్ధి చేసి ప్రజలకు అత్యంత నాణ్యమైన ఇంటర్నెట్ తోపాటు, కేబుల్ సర్వీసులు, టెలీఫోన్ సేవలను తీసుకురావాలిని యోచిస్తున్నది. దానికోసం ఏపీఎస్ఎఫ్ కి రూ.445.7 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ టివిల వినియోగం, స్మార్ట్ ఫోన్ ల వినియోగం గ్రామాలలో అధికంగా పెరిగినందున అక్కడే హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు ఆన్ లైన్ సేవలు, విద్య అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తన్నది.
దానికోసం ఏపిఎస్ఎఫ్ఎల్ ను విస్తరించి మండల కేంద్రం నుంచి అన్ని గ్రామపంచాయతీలకు విస్తరించి, పాఠశాలలు, డిజిటల్ లైబ్రెరీలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు, పిహెచ్సీలకు హై బ్యాండ్ విడ్త్ ను అనుసంధానించనున్నది. ఇంటర్నెట్ లో లోపాలు రాకుండా, అంతరాయాలు లేకుండా ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు, విద్యార్ధులు, ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని కూడా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అందిం చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను అదేరోజు ఏపీ ఫైబర్ నెట్ లోనే ఇంట్లో ఉండి చూసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 14వేల 5 గ్రామ, వార్డుసచివాలయాలతోపాటు, అన్ని పంచాయతీలు, గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.